Begin typing your search above and press return to search.

కాంతార ఇంత దూరం వస్తుంది అనుకోలేదు

ఆయన కాంతార చాప్టర్‌ 1 గురించి మాట్లాడుతూ.. సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయని అంటూ ఉంటే చాలా బాగుంది.

By:  Ramesh Palla   |   10 Oct 2025 3:00 PM IST
కాంతార ఇంత దూరం వస్తుంది అనుకోలేదు
X

రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన కాంతార, కాంతార చాప్టర్‌ 1 సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చిన్న సినిమాగా రూపొందిన కాంతార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, భారీ బడ్జెట్‌తో కాంతారకు ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్‌ 1 ను రూపొందించిన రిషబ్‌ శెట్టి మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకోవడం మాత్రమే కాకుండా నటుడిగా పలు సీన్స్‌లో తన నటనతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశాడు. ముఖ్యంగా రిషబ్ శెట్టి క్లైమాక్స్‌లో కనబర్చిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అంతే కాకుండా రిషబ్‌ శెట్టికి మరోసారి ఈ సినిమాలో పోషించిన బర్మె పాత్రకు గాను అవార్డుల పంట పండటం ఖాయం అంటూ సినిమాను చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

కాంతార చాప్టర్‌ 1 కలెక్షన్స్‌ జోరు

సినిమాకు కన్నడంలో పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ టాక్‌ రాలేదు. దాంతో వసూళ్లు ఎలా ఉంటాయో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ కాంతార చాప్టర్‌ 1 సినిమా ఏకంగా పుష్ప సినిమా వసూళ్లను బ్రేక్ చేసిందని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాంతార చాప్టర్ 1 చేస్తున్న సందడిపై హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇది తన ఒక్కడి విజయం కాదని, సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరి విజయం అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా మంచి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దక్కిన విజయం ఇది అన్నాడు. కాంతార వంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు ఎప్పటికీ చాలా సంతోషంగా, సంతృప్తిగా తనకు ఉంటుంది అంటూ కాంతార నటుడు రిషబ్ శెట్టి తాజా మీడియా ఇంట్రాక్షన్‌ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

రిషబ్‌ శెట్టి కాంతార జర్నీ

ఆయన కాంతార చాప్టర్‌ 1 గురించి మాట్లాడుతూ.. సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయని అంటూ ఉంటే చాలా బాగుంది. ఆ క్రెడిట్‌ ప్రేక్షకులు, హొంబులే ఫిల్మ్స్‌కు దక్కుతుంది. మాకు ప్రేక్షకుల యొక్క అభిమానం, ఆశీర్వాదం సరిపోతాయి అన్నాడు. వాటితోనే నా మనసు నిండి పోతుంది. రికార్డులు అనేవి నటుడికి, దర్శకుడికి సంబంధించినవి కాదు. అవి పూర్తిగా ప్రేక్షకులు ఇచ్చినవి, ప్రేక్షకులకు చెందినవి అన్నాడు. ఒక సినిమాను ఎంత దూరం తీసుకు వెళ్లాలో వారు నిర్ణయిస్తారు. కనుక వారికే రికార్డులు అనేవి సొంతం. సినిమాను చూసిన ప్రతి ఒక్కరికీ ఈ రికార్డ్‌ సొంతం అన్నట్లుగా రిషబ్‌ శెట్టి చెప్పుకొచ్చాడు. కాంతార సినిమాను ఆధరించిన ప్రతి ఒక్కరికీ ఈ రికార్డ్‌ సొంతం అని, వారి వల్లే ఈ రికార్డ్‌లు సాధ్యం అయ్యాయి, కనుక వారికే ఈ రికార్డుల గౌరవం దక్కుతుంది అన్నట్లుగా పేర్కొన్నాడు.

కాంతార చాప్టర్‌ 2 ఉంటుందా..

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మొదలైన ఈ సినిమా ఇంత దూరం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈ స్థాయిలో ప్రేక్షకుల అభిమానంను కాంతార దక్కించుకుంటుందని కనీసం కలలో కూడా అనుకోలేదు. లాక్‌ డౌన్‌ టైంలో కెమెరా, కొంతమంది సాంకేతిక నిపుణులతో మొదలైన ఈ సినిమా పరిధి పెరుగుతూ వచ్చింది. సినిమాను ప్రేక్షకులు అభిమానిస్తే ఏ స్థాయికి తీసుకు వెళ్తారో కాంతార సినిమాతో నిరూపితం అయింది. అందుకే కాంతార చాప్టర్‌ 1 కి ప్రేరణగా నిలిచిందని అన్నాడు. నేను ఎప్పటికీ సినిమాను తీయాలి అంటే క్షేత్ర స్థాయికి వెళ్తారు, గ్రామాల్లో తిరుగుతాను, ముందు ముందు కూడా నా నుంచి రాబోయే సినిమాలు అలాగే ఉంటాయి అని రిషబ్‌ శెట్టి హామీ ఇచ్చాడు. కాంతార చాప్టర్‌ 1 సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం కొత్త సినిమా ఆలోచన లేదని చెప్పాడు. వచ్చే ఏడాదిలో రిషబ్‌ కొత్త సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంతార చాప్టర్‌ 2 ను ప్రకటించిన విషయం తెల్సిందే. అది ఎప్పుడు ఉంటుంది అనేది రిషబ్‌ శెట్టి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.