'కేజీఎఫ్' స్టార్ మిస్టేక్‌ను 'కాంతార' స్టార్ రిపీట్ చేయడా?
ఈ ప్రణాళికలో భాగంగానే రిషబ్ శెట్టి సంచలన మలయాళ చిత్రం `మంజుమ్మేల్ బాయ్స్`తో బాక్సాఫీస్ వద్ద అద్భుతం సృష్టించిన ప్రతిభావంతుడైన దర్శకుడు చిదంబరంతో చేతులు కలిపారు.
By: Sivaji Kontham | 6 Oct 2026 8:30 AM IST`కాంతార` చిత్రంతో జాతీయ స్థాయిలో అసాధారణ విజయాన్ని అందుకుని.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి తదుపరి సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత హీరోలు ఎటువంటి కథలను ఎంచుకోవాలనే విషయంలో తరచూ చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా `కేజీఎఫ్ 2` వంటి పాన్ ఇండియన్ విజయం తర్వాత యష్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో కొంత సమయం తీసుకోవడం.. ఆ తర్వాత ఊహించని ప్రయోగం (గీతూ మోహన్ దాస్ -టాక్సిక్) చేయడంపై అనేక విశ్లేషణలు వచ్చాయి. మరి `కాంతార`, `కాంతార: చాప్టర్ 1` సినిమాల తర్వాత రిషబ్ శెట్టి కూడా అటువంటి డైలమాలోనే ఉన్నారా లేక చాలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అయితే రిషబ్ శెట్టి వేస్తున్న అడుగులు పరిశీలిస్తే.. యష్ చేసిన తప్పులను పునరావృతం చేయడం లేదనే స్పష్టమవుతోంది. పాన్-ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాల వెంటే పరుగెత్తకుండా.. రిషబ్ చాలా తెలివిగా సెన్సిబుల్ - టాలెంటెడ్ దర్శకులతో కలిసి పనిచేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా.. తన నేటివిటీకి తగ్గట్టుగానే కొత్త జోనర్లను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు. దీనివల్ల ఆయనపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు తగ్గకపోగా..మరింత పెరుగుతున్నాయి.
ఈ ప్రణాళికలో భాగంగానే రిషబ్ శెట్టి సంచలన మలయాళ చిత్రం `మంజుమ్మేల్ బాయ్స్`తో బాక్సాఫీస్ వద్ద అద్భుతం సృష్టించిన ప్రతిభావంతుడైన దర్శకుడు చిదంబరంతో చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఏకంగా రెండు సినిమాలు వస్తుండటం విశేషం. ఇందులో మొదటి సినిమా కన్నడ భాషలో ఒక శక్తివంతమైన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ మలయాళ నిర్మాత షిబు తమీన్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.
దర్శకుడు చిదంబరం తనదైన అసాధారణ కథాకథనాలతో.. మానవ సంబంధాలను లోతుగా ఆవిష్కరించడంలో దిట్ట. ఆయనతో రిషబ్ శెట్టి కలయిక అనేది కేవలం గ్లామర్ లేదా హైప్ కోసం కాకుండా.. బలమైన కంటెంట్ ఉన్న రూటెడ్ స్టోరీస్‌కు ఇద్దరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనడానికి నిదర్శనం. `కాంతార` ఫ్రాంచైజీతో స్థానిక సంస్కృతి, జీవన విధానాలను అద్భుతంగా తెరపైకి తెచ్చిన రిషబ్.. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా జానర్‌లోకి అడుగుపెట్టడం ద్వారా తనలోని నటుడిగా, కథకుడిగా ఉన్న మరో కోణాన్ని ఆవిష్కరించనున్నారు.
మరోవైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `జై హనుమాన్` లాంటి ప్రాజెక్ట్‌లతో పాటు... ఇలాంటి డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకోవడం రిషబ్ శెట్టి ప్లానింగ్‌లోని పరిణతిని తెలియజేస్తోంది. కేవలం భారీ విజయాల ఒత్తిడికి తలవంచకుండా.. తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ అతడు టాలీవుడ్, శాండల్‌వుడ్ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్నారు. త్వరలోనే ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానుండటంతో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.
