Begin typing your search above and press return to search.

మ‌రాఠా చ‌క్ర‌వ‌ర్తి 'ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్' పాత్ర‌లో ద‌క్షిణాది న‌టుడా?

అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో స‌మూలంగా మార్పులు వచ్చాయి. నటీనటులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఏ భాష మాట్లాడతారు?

By:  Sivaji Kontham   |   31 Oct 2026 9:38 AM IST
మ‌రాఠా చ‌క్ర‌వ‌ర్తి ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ పాత్ర‌లో ద‌క్షిణాది న‌టుడా?
X

మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు, మ‌హా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం `ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్`. టీ-సిరీస్, లెజెండ్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ రెండు భాగాల చారిత్రాత్మక సిరీస్ ను సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అయితే, మహారాష్ట్ర వీరుడి పాత్రలో కన్నడ నటుడు, `కాంతార` ఫేమ్ రిషబ్ శెట్టిని ఎంపిక చేయడం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరాది లేదా మరాఠీ యోధుల కథలో దక్షిణ భారతీయుడు నటించడం మార్కెట్ పరంగా వర్కవుట్ అవుతుందా అనే సందేహాలను కొందరు వ్యక్తపరుస్తున్నారు.

ఈ చర్చకు ప్రధాన కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యత. శివాజీ అనగానే మహారాష్ట్ర సంస్కృతి, మరాఠా పౌరుషం గుర్తుకొస్తాయి. అలాంటి మహోన్నత పాత్రను ఒక దక్షిణాది నటుడు పోషిస్తే ఉత్తరాది ప్రేక్షకులు, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారనే కోణంలో బిగ్ డిబేట్ నడుస్తోంది. గతంలో ప్రాంతీయ సరిహద్దులు, భాషా భేదాలు సినిమాల విజయాలపై తీవ్ర ప్రభావం చూపించిన దాఖలాలు ఉండటంతో టీ-సిరీస్ తీసుకున్న ఈ కాస్టింగ్ నిర్ణయం పెద్ద సాహసమేనని కొందరు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో స‌మూలంగా మార్పులు వచ్చాయి. నటీనటులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఏ భాష మాట్లాడతారు? అనేది ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సినిమాలో విషయం (కంటెంట్) ఉందా లేదా? నటుడు తన పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాడు? అనేదే ప్రమాణంగా మారింది. అతడు అగ్ర హీరోనా, కొత్త నటుడా అనే భేదం లేకుండా నటనలో ప్రతిభ ఉంటే చాలు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. `కాంతార` వంటి చిత్రంతో రిషబ్ శెట్టి తన సహజసిద్ధమైన అభినయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే ఇందుకు నిదర్శనం.

మరో ముఖ్యమైన పరిణామం ఏమిటంటే.. భారతదేశంలో ఇప్పుడు ప్రాంతీయ సినిమా రంగాలు సరిహద్దులను చెరిపేసి `భారతీయ సినీ పరిశ్రమ`గా అవతరించాయి. మన హీరోలు, మేకర్స్ కూడా ``మనది ప్రాంతీయ పరిశ్రమ కాదు.. సమిష్టి భారతీయ సినిమా`` అని గర్వంగా చాటుతున్నారు. ఈ `మ‌న‌` అనే భావ‌న‌ను ప్రేక్షకులు సైతం అంగీకరించి అప్‌గ్రేడ్ అయ్యారు. ఒకప్పుడు ``మీ హీరో.. మా హీరో``, ``మా ప్రాంతం.. మీ ప్రాంతం`` అంటూ విభజన చూపించిన అభిమానులు ఇప్పుడు భాషా సరిహద్దులను పక్కనపెట్టి మంచి ప్రతిభను, గొప్ప కథలను ఆదరిస్తున్నారు.

ఈ క్రమంలోనే టీ-సిరీస్ తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమైనదేనని మెజారిటీ నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని.. ఆయన స్వరాజ్య స్వప్నం, దేశభక్తి యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకమని సగర్వంగా పేర్కొంటున్నారు. కన్నడిగుడైన రిషబ్ శెట్టికి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రలోకి ఒదిగిపోయే తత్వం శివాజీ మహారాజ్ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాయని మేకర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా విశ్వసిస్తున్నారు. 2027 ప్రారంభంలో షూటింగ్ జరుపుకోనున్న ఈ పాన్-ఇండియా చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ఆశిస్తున్నారు.

రిష‌బ్ ఏమ‌న్నారంటే?

ఛ‌త్ర‌ప‌తి మ‌హారాజ్ పాత్ర‌కు త‌న‌ను ఎంపిక చేయ‌డంపై రిష‌బ్ ఎంతో ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న స్పంద‌న ఇలా ఉంది. ``స్వరాజ్యం అనేది ఒక కల కాదు.. అది భారతదేశ చరిత్ర గతిని మార్చివేసిన ఒక మహోన్నత దార్శనికత. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అసాధారణ త్యాగం.. ధీరోదాత్తమైన వీరత్వం .. అజేయమైన స్వరాజ్య స్ఫూర్తిని స్మరించుకుంటూ.. ఆయన అమర వారసత్వానికి ఘనమైన నివాళిగా టీ-సిరీస్ - సందీప్ సింగ్ సంయుక్త‌ నిర్మాణంలో భారత్ గ‌ర్వ‌కార‌ణ‌మైన #ఛత్రపతిశివాజీమహారాజ్ అనే రెండు భాగాల బృహత్ చారిత్రక గాథను రూపొందిస్తున్నారు. 2027 ప్రారంభంలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ మహత్తర ప్రతిష్టాత్మక చిత్రంలో భాగస్వామ్యమవ్వడం తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక అరుదైన గౌరవం... అని పేర్కొన్నారు.