బాడీ బిల్డర్‌ని పెళ్లాడుతున్న గాయని.. ఫ్యాన్స్ విషెస్
ప్రముఖ మలయాళ ప్లేబ్యాక్ సింగర్, టీవీ యాంకర్ రిమి టామీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.
By: Sivaji Kontham | 4 Nov 2026 1:49 PM ISTప్రముఖ మలయాళ ప్లేబ్యాక్ సింగర్, టీవీ యాంకర్ రిమి టామీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న దాదాపు ఆరేళ్ల తర్వాత.. ఆమె మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ సంతోషకరమైన విషయాన్ని షేర్ చేస్తూ.. తన జీవితంలోకి సరికొత్త భాగస్వామి వచ్చారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.
తొలుత తన కాబోయే భర్త వివరాలను దాచిపెట్టిన రిమి టామీ.. ఆ తర్వాత సోమవారం విడుదల చేసిన వీడియోలో అతడి పేరు లిబిన్ మాథ్యూ అని స్పష్టం చేశారు. ముంబైకి చెందిన ఆయన ఒక బాడీబిల్డర్, ఫిట్నెస్ ట్రైనర్. పుట్టుకతో మలయాళీ అయిన లిబిన్ గత కొన్ని నెలలుగా రిమి టామీకి ఫిట్నెస్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి వివాహం ఈ నవంబర్‌లో దొంబివ్లీలోని ఒక చర్చిలో కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది.
తన కాబోయే భాగస్వామి గురించి రిమి టామీ మాట్లాడుతూ..``ఆయన ఏమీ సినీ నటుడు, సింగర్ లేదా కోటీశ్వరుడు కాదు. జీవిత భాగస్వామి అంటే డబ్బు, హోదా ఉన్నవారు కాకూడదు.. మన ప్రశాంతతను పెంచే వ్యక్తి అయి వుండాలి. నా మనసుకు ప్రశాంతతను ఇచ్చి, నన్ను నాలా అర్థం చేసుకునే వ్యక్తి లభించారు. ఇది దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను`` అని భావోద్వేగానికి గురయ్యారు.
రిమి టామీ కెరీర్ విషయానికి వస్తే.. 2002లో లాల్ జోస్ దర్శకత్వంలో వచ్చిన `మీస మాధవన్` చిత్రంలోని `చింగమాసమ్` పాటతో గాయనిగా అరంగేట్రం చేసి రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారారు. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ పాటలు పాడి నేపథ్య గాయనిగా అలాగే, మలయాళంలో పాపులర్ టీవీ యాంకర్‌గా కూడా పేరు సంపాదించుకున్నారు.
2008లో వ్యాపారవేత్త రాయిస్ కిళక్కుడన్ను వివాహం చేసుకోగా.. 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా 2020లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు 2026లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో అభిమానులు-నెటిజన్లు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
