ప్రముఖ గాయనికి మూడో బిడ్డ.. పెళ్లిపై ప్రశ్నల వర్షం
అయితే ఈ గాయని ఎవరో పరిచయం అవసరం లేదు. గత ఏడాది అంబానీ ఇంట పెళ్లిలో సందడి చేసిన పాప్ స్టార్ రిహాన్నే గురించే ఇదంతా.
By: Sivaji Kontham | 25 Sept 2025 3:20 PM ISTప్రముఖ గాయని మూడో బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఇద్దరు మగపిల్లలకు `మామ్` అయిన ఈ ప్రముఖ గాయని ఇప్పుడు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం అభిమానుల్లో చర్చగా మారింది. మూడో బిడ్డ జననం సరే కానీ, సదరు గాయనికి పెళ్లయిందా? అంటూ ప్రశ్నించేవారే సోషల్ మీడియాల్లో ఎక్కువ.
అయితే ఈ గాయని ఎవరో పరిచయం అవసరం లేదు. గత ఏడాది అంబానీ ఇంట పెళ్లిలో సందడి చేసిన పాప్ స్టార్ రిహాన్నే గురించే ఇదంతా. బిలియనీర్ అనంత అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో కొన్ని నిమిషాల పాటు ప్రదర్శనకు గాను రిహానా దాదాపు 80కోట్లు అందుకుందని ప్రచారమైంది.
మేటి ప్రతిభావని రిహన్న ఇప్పుడు ఒక శుభవార్తను మోసుకొచ్చింది. సదరు గాయని తన స్నేహితుడు ASAP రాకీతో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు జన్మించిన ఆడబిడ్డకు రాకీ ఐరిష్ మేయర్స్ అని పేరు పెట్టారు. తల్లి బిడ్డకు సంబంధించిన మొదటి ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. సెప్టెంబర్ 13న తనకు బిడ్డ జన్మించిందని కూడా రిహానా వెల్లడించింది.
తల్లి కూతుళ్ల మధ్య ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఇలా అభిమానుల కోసం ఫోటో రూపంలో షేర్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. తన బిడ్డను రిహానా రెండు చేతులతో పొదివి పట్టుకుని మైమరిచిపోయి తథేకంగా చూస్తోంది. పింక్ దుపట్టాలో క్యూట్ కిడ్ ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్ లో తన బేబీ బంప్ లుక్ ని షేర్ చేసి తన గర్భధారణ గురించి రిహానా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఒక బిడ్డకు జన్మనివ్వగానే, లిల్ రాకీ క్యూట్ అంటూ అభిమానులు ప్రశంసించారు. `స్వాగతం యువరాణి` అని ఒక అభిమాని వెల్ కం చెప్పారు. అయితే రిహానా- రాకీ జంట పెళ్లి గురించి పలువురు ప్రశ్నించారు. పిల్లలు సరే పెళ్లయిందా? అంటూ కొందరు ప్రశ్నించారు.
రిహన్న- రాకీ ఇద్దరూ సుదీర్ఘ కాలంగా మంచి స్నేహితులు. 2021 నుంచి రాకీతో రిహానా ప్రేమలో ఉంది. ఈ ఐదేళ్లలో ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులు అయ్యారు. మొదటి బిడ్డ RZA 2022లో జన్మించగా, రియోట్ 2023లో జన్మించాడు. ఇప్పుడు ఆడపిల్లకు రిహానా తల్లయింది.
