Begin typing your search above and press return to search.

ఏడేళ్ల వైవాహిక బంధం.. 'లీడ‌ర్' బ్యూటీ ఎమోష‌న‌ల్

తాజాగా రిచా లాంగెల్లా తన 7వ పెళ్లి రోజు సందర్భంగా తన భర్త జో లాంగెళ్లాతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసారు.

By:  Sivaji Kontham   |   17 Sept 2026 7:54 AM IST
ఏడేళ్ల వైవాహిక బంధం.. లీడ‌ర్ బ్యూటీ ఎమోష‌న‌ల్
X

లీడర్ సినిమాతో రానా సరసన కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఎన్నారై నటి రిచా గంగోపాధ్యాయ్ (రిచా లాంగెల్లా) తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. వెంకటేష్, నాగార్జున, రవితేజ, ప్రభాస్, ధనుశ్ వంటి అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించింది. నాగవల్లి, మిరపకాయ్‌, సారొచ్చారు, మిర్చి వంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాల్లో నటించారు. కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే అనూహ్యంగా వెండితెరకు దూరమైన రిచా ప్రస్తుతం అమెరికాలోని ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తున్నారు.

తాజాగా రిచా లాంగెల్లా తన 7వ పెళ్లి రోజు సందర్భంగా తన భర్త జో లాంగెళ్లాతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసారు. తామిద్దరం పూర్తిగా భిన్నమైన స్వభావం గల వ్యతిరేక ధృవాలు అయినా ఈ బంధం విజయవంతంగా సాగుతోందని ఎమోషనల్ అయ్యారు. తనలోని గందరగోళాన్ని భర్త ప్రశాంతతతో సమతుల్యం చేస్తారని.. ప్రతి పిచ్చి ఆలోచనకు ఆయన మద్దతుగా నిలుస్తారని రిచా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రిచా గంగోపాధ్య‌య్ తన భర్తతో ఉన్న బంధాన్ని ఒక సరదా ఉదాహరణతో వివరించారు. తాను `స్టార్ వార్స్` చిత్రంలోని ఆందోళన చెందే C-3PO లాంటి ప్రొటోకాల్ డ్రాయిడ్ అని... తన భర్త కూల్ అండ్ కాన్ఫిడెంట్ `హాన్ సోలో` లాంటి వారని చమత్కరించారు. డేటింగ్ ప్రారంభ రోజుల్లో భర్త కోసం హాకీ ఆటను ఇష్టపడకపోయినా నటించానని.. కానీ ఇప్పుడు ఎలాంటి నటన లేకుండా అసలైన రూపంలో హాయిగా ఉండగలగడమే తమ బంధం ప్రత్యేకత అని తెలిపారు.

ఈ ఏడేళ్ల వైవాహిక ప్రయాణంలో తమకు అండగా నిలిచిన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. భర్త తనపైనా.. కుమారుడు లూకాపైనా చూపుతున్న నిస్వార్థ ప్రేమను రిచా కొనియాడారు. ఈ పోస్ట్‌కు అమిత్ ఖేని, ప్రణీత్ మైసూర్, మరియా ఒర్లోవా వంటి పలువురు స్నేహితులు, నెటిజన్లు హ్యాపీ యానివర్సరీ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ విచిత్రమైన జంటను ఒకరికొకరు పరిచయం చేసిన స్నేహితుడికి రిచా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.