Begin typing your search above and press return to search.

డబ్బున్నా దర్జా వద్దు: కోట్ల ఆస్తులున్నా నిరాడంబర జీవితాన్ని గడిపే రియల్ సెలబ్రిటీలు!

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి `కాంతారా` చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి కోట్లకు పడగెత్తారు. అయినా? తన మూలాలను ఎప్పుడూ మరువలేదు.

By:  Srikanth Kontham   |   10 Oct 2026 7:00 PM IST
డబ్బున్నా దర్జా వద్దు: కోట్ల ఆస్తులున్నా నిరాడంబర జీవితాన్ని గడిపే రియల్ సెలబ్రిటీలు!
X

కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ కార్లు, బంగ్లాలు ఉన్నా? అవేవి తమ తలను తిప్పలేవని నిరూపించే కొందరి జీవితాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. గ్లామర్ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ ఏ మాత్రం ఆర్భాటాలకు పోకుండా అత్యంత సాధార‌ణంగా జీవించే కొద్దిమంది సెలబ్రిటీలు మన చుట్టూ ఉన్నారు. ధనం, హోదా మనుషులను గర్విష్టులుగా మారుస్తాయనే నానుడిని తమ నిరాడంబర జీవనశైలితో పూర్తిగా తిరస్కరిస్తున్న అలాంటి కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈ కోవలో ముందుగా గుర్తుకువచ్చే పేరు నేచురల్ స్టార్ నాని. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే అగ్ర హీరో అయినా? నాని సాధారణ మధ్యతరగతి మనిషిలాగే కనిపిస్తారు. పెద్దగా హడావుడి లేకుండా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాధారణ బట్టలు ధరిస్తూ జనాల్లో సాధారణ వ్యక్తిలా తిరగడానికి ఇష్టపడతారు. ఆయన ఆలోచనలు, జీవన విధానం ఎంత సింపుల్‌గా ఉంటాయో? ఆయన చేసే సినిమాలు, మాట్లాడే మాటలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. విలాసాలకు దూరంగా, కష్టపడే తత్వమే ముఖ్యం అని నమ్మే నిజాయితీపరుడైన నటుడిగా నానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఇదే కోవకు చెందుతారు. ఆయన వద్ద కోట్లలో సంపద, అత్యాధునిక కార్లు ఉన్నా? ఆయన వ్యక్తిగత జీవితం ఎంత సింపుల్‌గా ఉంటుందో తెలిసిందే. చాలాకాలం పాటు ఆమిర్ ఖాన్ ఎలాంటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ వాడ‌లేదు. సాధారణ ఫోన్‌ను ఉప‌యోగించారంటే? ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటారో ఊహించొచ్చు. పబ్లిసిటీ హడావుడికి, అనవసరమైన పార్టీలకు దూరంగా ఉంటూ సినిమాలపై, కుటుంబంతో గడపడంపైనే నాని పూర్తి దృష్టి పెడుతుంటారు.

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి `కాంతారా` చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి కోట్లకు పడగెత్తారు. అయినా? తన మూలాలను ఎప్పుడూ మరువలేదు. సాధారణ గ్రామాల్లో ఉండే ఆచారాలు, సంస్కృతిని గౌరవిస్తూ ఎలాంటి స్టార్‌డమ్ బిల్డప్‌లు లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన సాధారణ దుస్తులు, మాట్లాడే పద్ధతి చూస్తే ఆయనకు ఉన్న క్రేజ్‌కు, ఆయన జీవన శైలికి ఎంత పొంతన లేదో తెలిసిపోతుంది. విజయం తలకెక్కకుండా ఉండటానికి నిరాడంబరతే అసలైన ఆయుధమని రిషబ్ నిరూపిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కీవ్ రీవ్స్ లాంటి హాలీవుడ్ సూపర్‌స్టార్స్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. `మాట్రిక్స్` లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో వందల కోట్లు సంపాదించినా? ఆయన ఇప్పటికీ సాధారణ మెట్రో రైళ్లలో ప్రయాణించడం, రోడ్డు పక్కన సాధారణ బెంచ్‌లపై కూర్చుని ఆహారం తినడం లాంటివి చేస్తూ కని పిస్తుంటారు. తన సంపాదనలో సింహభాగాన్ని క్యాన్సర్ రీసెర్చ్ , దానధర్మాలకు విరాళంగా ఇచ్చే కీవ్ రీవ్స్ ఎలాంటి గర్వం లేకుండా సాధారణ పౌరుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

చివరిగా డబ్బు, హోదా మనిషి బాహ్య జీవితాన్ని నిర్ణయించగలవు. కానీ అతని అంతఃసౌందర్యాన్ని .. వ్యక్తిత్వాన్ని మార్చలేవు. సెలబ్రిటీల జీవితాలు చెప్పే సత్యం ఒక్కటే. ఎంత ఎత్తుకు ఎదిగినా ? ఒదిగి ఉండటం, హడావుడికి పోకుండా సామాన్య జీవితాన్ని ఆస్వాదించడంలోనే అసలైన ఆనందం దాగి ఉంటుంది. విలాసాలు తాత్కాలికం, నిరాడంబరతే శాశ్వతమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అనడానికి వీరే సజీవ సాక్ష్యం.