Begin typing your search above and press return to search.

అంతా కోల్పోయినా ఇంకా ఆశ‌తో తూనీగ రియా చ‌క్ర‌వ‌ర్తి

బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంతో ముడిప‌డిన అన్ని కేసుల నుంచి రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె కుటుంబం బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   5 Oct 2025 10:20 AM IST
అంతా కోల్పోయినా ఇంకా ఆశ‌తో తూనీగ రియా చ‌క్ర‌వ‌ర్తి
X

బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంతో ముడిప‌డిన అన్ని కేసుల నుంచి రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె కుటుంబం బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ సింగ్ మ‌ర‌ణానంత‌రం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఈడీ, సిట్ సహా ప‌లు ద‌ర్యాప్తు సంస్థ‌లు అప్ప‌టి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు సోవిక్ చ‌క్ర‌వ‌ర్తిని అరెస్ట్ చేసి విచారించాయి. కానీ అన్ని కేసుల నుంచి రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు నిర‌ప‌రాధులుగా బ‌య‌ట‌ప‌డ్డారు.

మీడియాలో చాలా క‌థ‌నాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని దోషిగా ప్ర‌క‌టించ‌గా, దానిపై ఇప్ప‌టికీ రియా సెటైర్లు వేస్తూనే ఉంది. ఒక నేరంపై విచార‌ణ తేల‌క ముందే సోష‌ల్ మీడియాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని అప‌రాధిని చేసాయి. అయితే ఈ కేసులో నాలుగేళ్ల పోరాటం ఫలించి చివ‌రికి నిర‌ప‌రాధిగా నిరూపించుకుని రియా బ‌య‌ట‌ప‌డింది.

అయితే రియా చ‌క్ర‌వ‌ర్తి అన్ని కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత కూడా త‌న వ‌ద్ద నుంచి లాక్కున్న పాస్ పోర్ట్ ని తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎట్ట‌కేల‌కు సంబంధిత అధికారుల నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చింది. రియా చ‌క్ర‌వ‌ర్తి చేతికి పాస్ పోర్ట్ అందిందని తెలుస్తోంది. ఇక‌పై రియా స్వేచ్ఛ‌గా తూనీగ‌లా విదేశాల‌కు కూడా ఎగిరిపోవ‌చ్చు. అన్ని బంధ‌నాల‌ను తెంచుకుని తాను ఇప్పుడు స్వేచ్ఛ‌గా ఉన్నాన‌ని రియా ఆనందం వ్య‌క్తం చేసింది. ఐదు సంవ‌త్స‌రాలు ఎంతో ఓపిగ్గా ఉన్నాను. `ఓపిక నా నిజ‌మైన పాస్ పోర్ట్` అని రియా చ‌క్ర‌వ‌ర్తి వ్యాఖ్యానించింది.

ఐదేళ్ల క్రితం రియా చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన చిత్రం చెహ్రే. ప్ర‌స్తుతం రియా తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించడానికి ఉత్సాహంగా వేచి చూస్తోంది. అయితే నిర‌ప‌రాధి అని నిరూపించుకున్న త‌ర్వాత కూడా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ భామ‌కు అవ‌కాశాలివ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఈ ప్ర‌శ్న‌కు ఇంకా స‌మాధానం లేదు. అంతా కోల్పోయినా కానీ ఇంకా ఆశ‌తో ఉన్నాన‌ని రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతోంది. ఈ భామ ఎం.ఎస్.రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `తూనీగ తూనీగ` చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.