Begin typing your search above and press return to search.

10 ఏళ్ల తర్వాత వర్మ సిన్సియర్‌ ప్రయత్నం..!

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో రూపొందిన 'శివ' సినిమా ఈనెల 15న రీ రిలీజ్ కాబోతున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   12 Nov 2025 2:00 AM IST
10 ఏళ్ల తర్వాత వర్మ సిన్సియర్‌ ప్రయత్నం..!
X

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో రూపొందిన 'శివ' సినిమా ఈనెల 15న రీ రిలీజ్ కాబోతున్న విషయం తెల్సిందే. 36 ఏళ్ల క్రితం వచ్చిన శివ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం మాత్రమే కాకుండా, ట్రెండ్‌ సెట్టర్ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. అందుకే శివ సినిమా ఇన్నాళ్ల తర్వాత కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. శివ రీ రిలీజ్ అనగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ మొత్తం ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి కొత్త దారి చూపించాడు అంటూ అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా వారు మాట్లాడుతూ ఉండేవారు. శివ మాత్రమే కాకుండా వర్మ నుంచి ఎన్నో గొప్ప పొలిటికల్‌ డ్రామాలు, థ్రిల్లర్‌ సినిమాలు వచ్చాయి. ఆయన బాలీవుడ్‌లోనూ మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడిగా నిలిచాడు. కానీ గత పదేళ్ల కాలం గా ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ఏ ఒక్కటి మినిమం కూడా ఆడలేదు.

రామ్ గోపాల్ వర్మ శివ సినిమా రీ రిలీజ్‌..

వర్మ సినిమాలను లైట్‌ తీసుకుని, వివాదాలకు ఎక్కువ శ్రద్ద పెట్టాడు. సోషల్‌ మీడియాలో నోటికి వచ్చినట్లు మాట్లాడటం, ఏదో ఒక వివాదంలో తల దూర్చడం అనేది గత పదేళ్ల కాలం గా వర్మ చేస్తున్న పని. ఆయన నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఏ ఒక్కటి ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవని చెప్పక తప్పదు. వర్మ తీసిన శివ, రంగీల, సత్య, కంపెనీ, సర్కార్‌ ఇలా చెప్పుకుంటూ పోతే 1990, 2000 లలో తీసిన సినిమాలు ఎవర్‌ గ్రీన్ అన్నట్లుగా నిలిచాయి. అమితాబ్‌ బచ్చన్ వంటి సూపర్ స్టార్‌ వర్మ వల్లే తన కెరీర్ ఇలా ఉందని చెప్తాడు అంటే వర్మ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వర్మ తన ప్రతిభను వినియోగించడం లేదా అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మ నుంచి మళ్లీ అలాంటి సినిమాలు చూడాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.

పోలీస్‌ స్టేషన్‌ లో దెయ్యం సినిమాతో వర్మ...

వివాదాల వర్మ రామ్‌ గోపాల్‌ వర్మ గత ఏడాది కాలంగా చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు. ఆయన గతంతో పోల్చితే హడావిడి చేయడం మానేశాడు. ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వర్మలో చాలా మార్పు కనిపిస్తుంది అని చాలామంది అంటున్నారు. ఆ మధ్య వర్మను అరెస్ట్‌ చేస్తారనే వార్తలు వచ్చాయి. వర్మను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వెళ్లారు అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో ఆయన అరెస్ట్‌ కాలేదు. ఇదే సమయంలో వర్మ పోలీస్‌ స్టేషన్ లో దెయ్యం సినిమాను రూపొందిస్తున్నాడు. హిందీలో రూపొందుతున్న ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. మనోజ్‌ బాజ్‌పాయి, జెనీలియా ముఖ్య పాత్రల్లో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించి వర్మ మాట్లాడుతూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జనాలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు.

త్వరలో విడుదల కానున్న వర్మ థ్రిల్లర్‌ మూవీ

తాజాగా శివ సినిమా రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ లో వర్మ మాట్లాడుతూ తాను గత పదేళ్ల కాలంలో సిన్సియర్‌గా చేస్తున్న మూవీ పోలీస్‌ స్టేషన్‌లో దెయ్యం సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఒకింత ఆసక్తి మొదలైంది. మీడియాలోనూ ఇంతకు ముందు తో పోల్చితే ఈ సినిమా గురించి ఇప్పుడు చర్చ ఎక్కువ అయింది. ప్రేక్షకులు సైతం ఈ సినిమా బాగుంటుంది అని నమ్మితే కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం శివ సినిమా రీ రిలీజ్ పనిలో ఉన్న వర్మ త్వరలోనే పోలీస్‌ స్టేషన్‌ లో దెయ్యం సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. వర్మ అన్నట్లుగానే పూర్తి ఫోకస్‌ తో సినిమాను తీస్తే కచ్చితంగా ఆయన సినిమాలను అభిమానించే వారు మాత్రమే కాకుండా అందరికీ సినిమా నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి నిజంగానే వర్మ ఈ సినిమాను సిన్సియర్‌గా చేసి ఉంటాడా అనేది తెలియాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.