హాలీవుడ్ నటి లో ఊర్మిళను చూసుకున్న రామ్ గోపాల్ వర్మ!
ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ లిమిటెడ్ సిరీస్ `అబ్సెషన్` చూసిన వర్మ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
By: Srikanth Kontham | 8 Jun 2026 7:00 PM ISTసైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ చిత్రాలలో 1999లో రిలీజ్ అయిన `కౌన్` ఒకటి. ఊర్మిళా మాతోండ్కర్, మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రల్లో ఒకే ఒక్క ఇంట్లో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది. ముఖ్యంగా ఊర్మిళ నటన, అమె పలికించిన సైకో హావభావాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ అంతర్జాతీయ సిరీస్ చూసి ఆనాటి `కౌన్` జ్ఞాపకాలను, ఊర్మిళ నటనను గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ లిమిటెడ్ సిరీస్ `అబ్సెషన్` చూసిన వర్మ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సిరీస్‌లో లీడ్ రోల్ పోషించిన హాలీవుడ్ నటి ఇన్డే నవరెట్ అద్భుతమైన నటనను ఆయన ఎంతగానో అభినందించారు. ఆమె పలికించిన విలక్షణమైన హావభావాలు, నటనలోని తీవ్రత చూస్తుంటే పాతికేళ్ల క్రితం తన `కౌన్` సినిమాలో ఊర్మిళా మాతోండ్కర్ చేసిన నటనే తనకు కళ్లముందు కనిపించిందని వర్మ పేర్కొన్నారు. నటి ఇన్డే నవరెట్ నటనను ప్రశంసిస్తూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
`అబ్సెషన్ సిరీస్‌లో ఇన్డే నవరెట్ అసాధారణమైన నటనను కనబరిచింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ముఖ కవళికలు నన్ను పూర్తిగా ఆకట్టుకున్నాయి. సినిమా క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ ఆమె నటన చూస్తుంటే `కౌన్` చిత్రంలో ఊర్మిళ చేసిన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది` అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఒక హాలీవుడ్ నటిని అభినందిస్తూనే తన ఆల్-టైమ్ ఫేవరెట్ నటి ఊర్మిళ ప్రతిభను ఆయన మరోసారి కొనియాడారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి ఊర్మిళా మాతోండ్కర్ కాంబినేషన్‌లో శివ, రంగీలా, సత్యా, దౌడ్, భూత్ , కౌన్ వంటి ఎన్నో సంచలన చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్‌లో ఊర్మిళను ఒక గ్లామర్ ఐకాన్‌గా మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో అద్భుతంగా చూపించిన ఘనత వర్మకే దక్కుతుంది. ముఖ్యంగా `కౌన్` చిత్రంలో డైలాగ్స్ పెద్దగా లేకుండా కేవలం బాడీ లాంగ్వేజ్, కళ్లలోనే భయాన్ని , సైకో తత్వాన్ని పలికించడంలో ఊర్మిళ చూపిన ప్రతిభను నేటికీ విశ్లేషకులు బెంచ్‌మార్క్‌గా భావిస్తారు.
సినిమా మేకింగ్ శైలి మారినా? దశాబ్దాల కాలం గడిచినా? కొన్ని పాత్రలు, వాటిలోని నటన ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయనడానికి ఈ పరిణామమే ఉదాహరణ. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు వెబ్ సిరీస్‌లు, డిజిటల్ కంటెంట్‌పై దృష్టి పెట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న వైవిధ్యమైన సినిమాలను వీక్షిస్తూ వాటిని విశ్లేషిస్తూ నిరంతరం అప్‌డేట్‌గా ఉంటుంటారు. ఒక అంతర్జాతీయ స్థాయి నటిని మెచ్చుకుంటూనే భారతీయ నటీనటుల ప్రతిభను అంతకంటే గొప్పగా ఆవిష్కరించడం వర్మ మార్క్ శైలిని ప్రతిబింబిస్తోంది.
