రామ్ గోపాల్ వర్మ డైరీలో ఆ ఇద్దరే!
పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది.
By: Srikanth Kontham | 26 March 2026 1:00 AM ISTపరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. సాధారణంగా ఏ దర్శకుడిని లేదా ఏ సినిమాను అంత సులభంగా మెచ్చుకోరు. ఒకవేళ ఎవరినైనా పొగిడారంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకప్పుడు తన శిష్యుడు పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్‌కు, ఆయన రాసే డైలాగులకు వర్మ ఫిదా అయిపోయేవారు. పూరి సినిమా వస్తుందంటే వర్మ ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా ఉండేవి కావు. కానీ గత కొంతకాలంగా పూరి వరుస వైఫల్యాల్లో ఉండటంతో వర్మ తన ఫోకస్‌ను కొత్త తరం దర్శకుల వైపు మళ్లించినట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆర్జీవీ డైరీలో ఇద్దరు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే సందీప్ రెడ్డి వంగా , ఆదిత్య ధర్. ఈ ఇద్దరు దర్శకుల మేకింగ్ విధానం, వారు కథను తెరకెక్కించే తీరు వర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ రొటీన్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా, తమదైన ముద్ర వేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటమే వర్మ వారి గురించి ఎక్కువగా మాట్లాడటానికి ప్రధాన కారణం. వీరిద్దరి మేకింగ్‌లో ఉన్న రానెస్ , బోల్డ్‌నెస్ వర్మలోని పాత దర్శకుడిని మళ్ళీ తట్టిలేపుతున్నాయా? అనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా గురించి వర్మ ఇప్పటికే పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు.
`అర్జున్ రెడ్డి` నుండి మొన్నటి `యానిమల్` వరకు సందీప్ చూపించిన క్యారెక్టరైజేషన్లు వర్మకు బాగా నచ్చాయి. సినిమా అంటే ఇలా ఉండాలి. ఎవరికీ భయపడకుండా తన విజన్‌ను తెరపై చూపించే మొనగాడు సందీప్ అని వర్మ కితాబు ఇచ్చారు. సందీప్ మేకింగ్‌లో ఒక రకమైన తిరుగుబాటు కనిపిస్తుందని, అది తన పాత సినిమాల్లోని ఇంటెన్సిటీని గుర్తుకు తెస్తుందని వర్మ బాహాటంగా అన్నారు. మరో దర్శకుడు ఆదిత్య ధర్ విషయంలోనూ వర్మ అంతే ఆసక్తిగా ఉన్నారు. `ఉరి` చిత్రంతో నేషనల్ లెవెల్ గుర్తింపు పొందిన ఆదిత్య తాజాగా `ధురందర్ 2` తో సృష్టించిన సంచలనం వర్మను ఎంతో ఆశ్చర్యపరిచింది.
ఒక దేశభక్తి చిత్రాన్ని కమర్షియల్ హంగులతో, టెక్నికల్‌గా అంత హై స్టాండర్డ్స్‌లో తీయడం ఆదిత్యకు మాత్రమే సాధ్యమైందని వర్మ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కాకుండా కేవలం ప్రతిభ ఉన్న నటులనే ఎంచుకుని హిట్ కొట్టిన ఆదిత్య ధర్ గట్స్ కు వర్మ ఫిదా అయ్యారు. వర్మ తన వ్యక్తిగత డైరీలో లేదా తన ఆలోచనల్లో ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా నోట్స్ రాసుకున్నారని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో సినిమా మేకింగ్ అనేది వీరిద్దరి చుట్టూనే తిరుగుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. పూరి జగన్నాథ్ వంటి దర్శకులు ప్రస్తుతం వెనకబడిపోయిన తరుణంలో వర్మకు సందీప్ రెడ్డి వంగా , ఆదిత్య ధర్ లలో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి.
వీరు తీసే సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా ప్రేక్షకుడికి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఇస్తాయని వర్మ విశ్లేషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ వంటి మేధావి ఓ దర్శకుడి గురించి ఇంత గొప్పగా చెబుతున్నారంటే? ఆ దర్శకుడిలో ఏదో ఒక స్పార్క్ ఉన్నట్లే లెక్క. సందీప్ రెడ్డి వంగా , ఆదిత్య ధర్ లు బాలీవుడ్ , టాలీవుడ్ సరిహద్దులను చెరిపేస్తూ గ్లోబల్ రేంజ్ సినిమాలు తీస్తుండటం వర్మను విశేషంగా ఆకర్షిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకులు భవిష్యత్తులో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో? వర్మ తన డైరీలో ఇంకెన్ని పేజీలు వీరి కోసం కేటాయిస్తారో వేచి చూడాలి.
