స్పీల్ బర్గ్ - క్రిస్టోఫర్ నోలాన్ ఆశ్చర్యపోతారు: ఆర్జీవీ
హాలీవుడ్ దిగ్గజ దర్శకులకే సవాల్ విసిరేలా `దురంధర్ 2` స్క్రీన్ ప్లే ఉంటుందని హైలైట్ చేస్తున్నారు ఆర్జీవీ.
By: Sivaji Kontham | 20 March 2026 7:52 PM ISTహాలీవుడ్ దిగ్గజ దర్శకులకే సవాల్ విసిరేలా `దురంధర్ 2` స్క్రీన్ ప్లే ఉంటుందని హైలైట్ చేస్తున్నారు ఆర్జీవీ. ఈ గురువారం నాడు విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా చూసి స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ వంటి మేధావులే ఆశ్చర్యపోతారని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. జురాసిక్ పార్క్, ఇంటర్ స్టెల్లార్ వంటి అద్భుతాలు సృష్టించిన వారికే ఈ సినిమా కొత్త పాఠాలు నేర్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వర్మ చేసిన ఈ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. ఇది `షోలే` కంటే వంద రెట్లు పవర్ ఫుల్ సినిమా అని ఆయన కొనియాడారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఎంతగా ఫిదా అయ్యారంటే.. ఏకంగా సినిమానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని తనదైన శైలిలో వర్మ ట్వీట్ చేశారు. ఈ ఒక్క మాటతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్‌లో ఒక కొత్త సినిమాటిక్ శకానికి ఇది నాంది అని ఆయన జోస్యం చెప్పారు.
కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మార్చి 18న నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే దాదాపు 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ సినిమా సుమారు 1500 నుంచి 2000 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందని వర్మ అంచనా వేశారు. ఆదిత్య ధర్ పనితీరును ఆకాశానికెత్తుతూ.. హాలీవుడ్ దర్శకులు సైతం ఈ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆయన సూచించారు.
సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్.. కథలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతున్నాయి. రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించడం వల్ల కథలో సహజత్వం, భారీతనం అద్భుతంగా కుదిరాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాల హవా నడుస్తున్న తరుణంలో.. బాలీవుడ్ సత్తాను ఈ చిత్రం మరోసారి చాటిచెప్పింది. భారీ బడ్జెట్ సినిమాలను ఎలా నిర్మించాలో ఈ సినిమా నిరూపించిందని వర్మ విశ్లేషించారు. ఆర్జీవీ ప్రకారం.. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ వంటి దర్శకుల లీగ్ లో మూడు నాలుగు సినిమాల ఆదిత్యాధర్ కూడా చేరారనే నమ్మకం స్పష్ఠంగా కనిపిస్తోంది.
మొత్తానికి `దురంధర్ 2` ఒక బలమైన ఫ్రాంచైజీగా భారతీయ సినీ పరిశ్రమలో తన ముద్ర వేసుకుంటోంది. ఆదిత్య ధర్ సాధించిన ఈ విజయం తోటి దర్శకులకు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఈ చిత్రం వర్మ చెప్పినట్లుగా వెయ్యి కోట్ల రికార్డులను తిరగరాస్తుందో లేదో వేచి చూడాలి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
