కేస్ స్టడీ సరే కానీ.. ఇలాంటి సినిమా తీసేదెపుడు ఆర్జీవీ?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్‌గా, ట్రెండ్ సెట్టర్‌గా వెలిగిన రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఇటీవలి కాలంలో పూర్తిగా సినిమా రేస్ నుంచి తప్పుకున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు.
By: Sivaji Kontham | 16 Jun 2026 5:04 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్‌గా, ట్రెండ్ సెట్టర్‌గా వెలిగిన రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఇటీవలి కాలంలో పూర్తిగా సినిమా రేస్ నుంచి తప్పుకున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఆర్జీవీ కంటే టెక్నికల్ గా చాలా వెనకబడి ఉన్న దర్శకులు కూడా హిట్లు కొట్టి రేసులోకి దూసుకుపోతుంటే ఆర్జీవీ మాత్రం ఇంకా ఇంకా వెనక్కి వెళుతున్నారు. కథ కంటెంట్ లేని నాశిరకం సినిమాలతో తన విలువైన సమయాన్ని, ప్రతిభను దుర్వినియోగం చేస్తున్నారనే కలత ఆయన అభిమానుల్లో ఉంది. శివ, సత్య, కంపెనీ వంటి క్లాసిక్స్‌ను అందించిన ఆర్జీవీ నుంచి ప్రేక్షకులు ఇప్పటికీ ఒక బలమైన కంబ్యాక్ చిత్రాన్ని ఆశిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఆర్జీవీ ఒక హాలీవుడ్ చిత్రంపై విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తూ వార్తల్లో నిలిచారు. కేవలం 7 కోట్ల రూపాయల (750,000 డాలర్లు) అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2000 కోట్ల రూపాయలకు (229.3 మిలియన్ డాలర్లు) పైగా వసూళ్లను సాధించిన హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం `అబ్సెషన్` కేస్ స్టడీతో వర్మ ప్రేమలో పడిపోయారు. ఇటీవలే ఆయన ఆదిత్యాధర్ దురంధర్, దురంధర్ 2 చిత్రాలకు బోలెడంత ప్రచారం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో `అబ్సెషన్` సినిమా సక్సెస్ ఫార్ములాను, దాని కలెక్షన్ల వివరాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉచిత ప్రచారం కల్పించడాన్ని సినీ వర్గాలు ఆసక్తిగా చర్చిస్తున్నాయి.
వర్మ షేర్ చేసిన `అబ్సెషన్` బడ్జెట్ కేస్ స్టడీ నిజంగానే అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సినిమాలో నటించిన ప్రధాన నటి ఇండే నవరెట్ కు కేవలం 19.07 లక్షలు, సహాయ నటీనటులకు 9.53 లక్షల లోపే పారితోషికం ఇచ్చారు. సాంకేతిక నిపుణుల విభాగంలో ఆర్ట్ డైరెక్టర్ శాలీ చోయ్ కి రోజుకు కేవలం రూ.28,605 చొప్పున మొత్తం 5.28 లక్షలు మాత్రమే చెల్లించారు. దర్శకుడు కర్రీ బార్కర్ సైతం ముందస్తుగా కనీస వేతనం మాత్రమే తీసుకుని,.. లాభాల్లో వాటా (ఈక్విటీ) ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన క్రూ మెంబర్స్, వాలంటీర్లకు కేవలం పెట్రోల్ అలవెన్సులు మాత్రమే ఇచ్చి ఈ సినిమాను పూర్తి చేయడం విశేషం.
ఈ లో-బడ్జెట్ చిత్రం సృష్టించిన బాక్సాఫీస్ లాభాల సునామీ హాలీవుడ్‌ను సైతం షేక్ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ `ఫోకస్ ఫీచర్స్` ఈ సినిమాను 143.03 కోట్లకు ఫ్లాట్ డీల్ కింద కొనుగోలు చేసి... థియేట్రికల్ రిలీజ్ ద్వారా సుమారు 1,192 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అలాగే ఈ ప్రాజెక్ట్‌ను నమ్మిన ఫైనాన్షియర్ క్యాప్‌స్టోన్‌కు 429 కోట్ల నుండి 476 కోట్ల వరకు... ప్రముఖ నిర్మాత జేసన్ బ్లమ్ (బ్లమ్‌హౌస్) కు 162.10 కోట్ల మేర లాభాలు వచ్చాయి. ఇక ముందస్తుగా తక్కువ మొత్తం తీసుకున్న దర్శకుడు కర్రీ బార్కర్‌కు బాక్స్ ఆఫీస్ బోనస్‌లు, ఫెస్టివల్ సేల్ కట్స్ అన్నీ కలుపుకుని దాదాపు 14.30 కోట్ల నుండి 38.14 కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరింది.
ఆర్జీవీ విశ్లేషించిన ఈ కేస్ స్టడీ వినడానికి - చదవడానికి అద్భుతంగా ఉన్నా.. ఆయన ఉత్సాహాన్ని అర్థం చేసుకున్న అభిమానులు మాత్రం వర్మను ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కేస్ స్టడీలను ప్రచారం చేయడం పక్కన పెట్టి.. ఆర్జీవీ స్వయంగా ఇలాంటి ఒక లో-బడ్జెట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను ఎప్పుడు తీస్తారని ప్రశ్నిస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు, అపారమైన అవగాహన ఉన్న ఆర్జీవీ లాంటి దర్శకుడు ఇకనైనా తన సమయాన్ని వృథా చేసుకోకుండా.. నాశిరకం కథలకు, వివాదాస్పద పబ్లిసిటీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. `అబ్సెషన్` తరహాలోనే ఒక వినూత్నమైన ప్రయోగాత్మక సినిమాను తీసి భారీ హిట్ కొట్టి తనేంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. అబ్సెషన్ బడ్జెట్ తో `ఐస్ క్రీమ్` లాంటి సినిమాలు తీయడం కాదు.. కచ్ఛితంగా `అబ్సెషన్` రేంజు సినిమానే తీయాలి ఆర్జీవీ అంటూ కౌంటర్లు కూడా వేస్తున్నారు.
