10వ క్లాసు బాలికపై అమానుష దాడి: RGV చెప్పింది అక్షరాలా..!
ముఖ్యంగా రామాయణంలో సీతాపహరణాన్ని చూసి నేడు అపహరణలు పెరిగాయని అనడం ఎంత హాస్యాస్పదమో.. సినిమాల్లో హింసను చూసి నేరాలు పెరుగుతున్నాయనడం కూడా అంతే!
By: Sivaji Kontham | 1 Nov 2026 5:28 PM ISTసమాజంలో పెరిగిపోతున్న నేరాలు, హింసకు సినిమాలే కారణమనే వాదనపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మానవ ప్రవర్తన, మీడియా బాధ్యత, సమాజ నైతికత అనే మూడు ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. సినిమాలు కేవలం వినోద సాధనాలు మాత్రమేనా లేక సమాజ నైతికతను మార్చే శక్తివంతమైన మాధ్యమాలా? అనే ప్రశ్నపై నెటిజన్లు రకరకాల వ్యంగ్యాత్మక.. ఆలోచనాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రామాయణంలో సీతాపహరణాన్ని చూసి నేడు అపహరణలు పెరిగాయని అనడం ఎంత హాస్యాస్పదమో.. సినిమాల్లో హింసను చూసి నేరాలు పెరుగుతున్నాయనడం కూడా అంతే! అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించడం ఈ చర్చకు మరింత ఊపునిచ్చింది. అలాగే సినిమాలు రాకముందు మానవ చరిత్రలో అసలు నేరాలే జరగలేదా అని ప్రశ్నిస్తూ... నేర ప్రవృత్తి అనేది చారిత్రకంగా మానవ స్వభావంలోనే ఉందనే ప్రాథమిక సత్యాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. నేరాలు- మాఫియా కథలతో సినిమాలు తీసినా కానీ దర్శకుడు ఆర్జీవీ ఏనాడూ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోలేదు. అతడి విశ్లేషణ లాజికల్ గా ఉంటుంది గనుకనే ఇప్పటికీ గౌరవం అందుకుంటున్నాడు. ఇప్పుడు రాప్తాడు (అనంతపురం) పదో తరగతి విద్యార్థిని ఘటన నేపథ్యంలో ``సినిమాలదే ఈ నేరం` అని నెపం వేస్తున్న వారిని తలంటుతున్నాడు ఆర్జీవీ. ఒక రకంగా అతడి ఖండన సరైనదేనని ఇప్పుడు నెటిజనులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆర్జీవీ చెప్పినది కరెక్టే కదా! అని కొందరు మద్ధతు పలుకుతున్నారు.
మరొకవైపు భారతీయ సినిమాల కంటెంట్ - వాటి సందేశాన్ని విశ్లేషిస్తే.. సమాజంపై వాటి ప్రభావం ఎంతవరకు ఉందనేది స్పష్టమవుతుంది. మన దేశంలో వచ్చే 99 శాతం సినిమాల్లో చివరికి ``అధర్మంపై ధర్మం విజయం సాధించడం``...``చెడు చేసిన విలన్ శిక్షించబడటమే`` ప్రధాన కథాంశంగా ఉంటుంది. ఒకవేళ ప్రజలు నిజంగా సినిమాలనే గుడ్డిగా అనుకరిస్తే... మంచిని భోధించే సినిమాల దృష్ట్యా.. సమాజంలో అసలు నేరాలే ఉండకూడదు కదా అన్నది ఇక్కడ లేవనెత్తిన బలమైన పాయింట్. ప్రతి కథలోనూ మంచి విజయం సాధిస్తున్నప్పుడు.. ప్రజలు ఆ మంచిని వదిలేసి కేవలం ప్రతికూల అంశాలను మాత్రమే ఎందుకు స్వీకరిస్తారనేది వ్యక్తిగత మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. విచక్షణ జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి సినిమాలో చూపించే హింసను కేవలం వినోదంగా మాత్రమే చూస్తాడు తప్ప... దాన్ని నిజ జీవితంలో వర్తింపజేయడు. ఆర్జీవీ కూడా దీనినే ఫాలో అవుతున్నాడు.
అయితే నేరాలకు సినిమాలతో సంబంధం లేదని పూర్తి బాధ్యత నుండి మీడియా తప్పుకోలేదు. ఊరి నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ తప్పు సమయాన్ని చూపిస్తున్నప్పుడు ``ఎవరి చేతి గడియారం వారి వద్ద ఉంది కదా`` అని ఎలా సరిపెట్టుకోలేమో... సమాజంపై విపరీతమైన ప్రభావం చూపే సినిమా మాధ్యమం కూడా తన సామాజిక బాధ్యతను విస్మరించకూడదు. సినిమాల్లో నేరాన్ని, హింసను ఒక స్టైలిష్ లేదా మాస్ అంశంగా గ్లోరిఫై చేసి చూపించినప్పుడు.. పక్వత లేని యువత లేదా పిల్లలు దానికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. ఒకప్పుడు చెడుగా పరిగణించిడిన లక్షణాలను నేడు గ్రే-షేడ్స్ పేరిట కథానాయకులలో చూపిస్తూ గ్లోరిఫై చేయడం వల్ల... సమాజంలో మంచి- చెడు మధ్య ఉన్న నైతిక వ్యత్యాసం అస్పష్టంగా మారే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నేరాల నివారణలో వ్యక్తిగత ప్రవర్తన- నైతిక విలువల పాత్ర అత్యంత కీలకమైనదిగా మారుతుంది. పెరిగిన వాతావరణం.. తల్లిదండ్రుల పెంపకం.. మానసిక వైకల్యాలు ప్రధాన కారణమవుతాయి. చిన్ననాటి నుండి కుటుంబం, పాఠశాల, సమాజం ద్వారా లభించే నైతిక దిక్సూచి బలంగా ఉన్నంతవరకు ఏ సినిమా కూడా ఒక సామాన్య వ్యక్తిని నేరస్థుడిగా మార్చలేదు. విచక్షణ జ్ఞానం, మానసిక పరిపక్వత ఉన్నవారు స్వీకరించే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి నేర స్వభావానికి కేవలం సినిమాలను బలిపశువును చేయడం కంటే.. వ్యక్తిగత విచక్షణా రాహిత్యాన్ని.. కుటుంబ నైతిక పునాదుల్లో ఉన్న లోపాలను గుర్తించడం ఎంతో అవసరం.
సమాజంలో జరిగే నేరాలకు `సినిమాలు మాత్రమే కారణం` అనడం ఎంత అసంబద్ధమో, ``సినిమాలకు అసలు సంబంధమే లేదు`` అని కొట్టిపారేయడం కూడా అంతే పొరపాటు. సినిమా అనేది నేరానికి ప్రత్యక్ష కారణం కాకపోయినా.. బలహీనమైన నైతిక నిర్మాణం ఉన్న వ్యక్తులలో నేర ప్రవృత్తిని ప్రేరేపించే ఒక ఉత్ప్రేరకంగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి సమాజంలో నేరాలను అదుపు చేయడం లేదా సంస్కరించడం అనేది సినిమాలపై నిషేధాలు విధించడంతోనో లేదా వేళ్లు చూపిస్తూ నెపం నెట్టేయడంతోనో ముగిసేది కాదు. వ్యక్తిగత స్వీయ నియంత్రణ.. పటిష్టమైన నైతిక విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ.. మీడియా బాధ్యతాయుత ప్రవర్తన.. ఈ మూడూ సమన్వయంతో సాగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఆర్జీవీ బాటలోనే పలువురు సినీ ప్రముఖులు కూడా ఇండస్ట్రీకి మద్ధతుగా నిలుస్తూ సినిమాలతో నేరాలు జరగవని పేర్కొనడం చర్చగా మారుతోంది.
