దురంధర్‌పై RGV పొగడ్తల వెనక అసలు సంగతి?
ఇటీవల X లో ఆర్జీవీ ఇలా రాసాడు. బాలీవుడ్ పై దక్షిణాది దండయాత్ర అనే అగ్నిగోళాన్ని ఆదిత్య ధర్ తిప్పికొట్టాడు.
By: Sivaji Kontham | 2 Jan 2026 4:27 PM ISTఇటీవలి కాలంలో ఆర్జీవీ పోకడ చాలా విచిత్రంగా మారిపోయింది. ఆయన ఇటీవలి కాలంలో తనను గొప్పగా కదిలించిన సినిమా 'దురంధర్' అని డిక్లేర్ చేసారు. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్యాధర్‌ని ప్రశంసల్లో ముంచేస్తున్నాడు. అతడి పనితనాన్ని, వినయవిధేయాతలను కొనియాడిన ఆర్జీవీ.. దీనిని ఇంచుమించు మహాభారతంతో పోల్చేసాడు. ఇందులో పాత్రలు మహాభారతంలోని పాత్రలకు దగ్గరగా అటూ ఇటూగా ఇతిహాసంలా ఉన్నాయని కూడా అనేసాడు.
చాలా కాలంగా భారతీయ సినీపరిశ్రమలో దక్షిణాది హవా కొనసాగుతోంది. హిందీలో ఏవో కొన్ని సినిమాలు తప్ప, బాక్సాఫీస్ వద్ద మెజారిటీ హిందీ సినిమాలు విఫలం అవ్వడం.. అదే సమయంలో దక్షిణాది చిత్రాలు 1000 కోట్ల క్లబ్‌లతో సంచలనాలుగా మారడంతో దీనిపై చాలా చర్చ సాగుతోంది. బాలీవుడ్ వెనకబాటు గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దక్షిణాదినా పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది దురంధర్. ఈ సినిమా కూడా 1000 కోట్ల క్లబ్ ను అధిగమించింది.
దీంతో ఆర్జీవీ లాంటి ప్రముఖులు దురంధర్ విజయం వెనక కారణాలను, లాజిక్కులను విశ్లేషిస్తున్నారు.
ఇటీవల X లో ఆర్జీవీ ఇలా రాసాడు. బాలీవుడ్ పై దక్షిణాది దండయాత్ర అనే అగ్నిగోళాన్ని ఆదిత్య ధర్ తిప్పికొట్టాడు. నాకు తెలిసిన దాని ప్రకారం.. ''దురంధర్ ప్రజలను భయపెడితే, దురంధర్ 2 హడలెత్తిస్తుంది'' అని పొగిడేసారు. దక్షిణాది వాళ్లు ఉపయోగించే మసాలా టెంప్లేట్ ని ఆదిత్యాధర్ ఇంకా సౌందర్యపరంగా మరింత పెంచాడు! అని ఆర్జీవీ అన్నారు. ఇదేదో దక్షిణాది సినిమాను అణగదొక్కడానికి, రెండు పరిశ్రమల మధ్య విభేధాలు సృష్టించడానికి అనడం లేదని ఆర్జీవీ అన్నాడు. దక్షిణాదిన ఒక నిర్దిష్ట టెంప్లేట్‌ను అనుసరిస్తారు. కొరియన్ సినిమా దాని ప్రత్యేక శైలితో పాపులరైంది. అలాగే దక్షిణాది సినిమా కూడా. ఆదిత్య ధర్ అదే మసాలా టెంప్లేట్‌ను తీసుకున్నాడు.. కానీ దానిని మరింత బాగా గ్లామరైజ్ చేసాడు.. అదే అందరినీ కదిలించిందని ఆర్జీవీ అన్నాడు. అంతేకాదు ఇకపై దక్షిణాదిన కథలు చెప్పేవిధానం, అలాగే స్క్రిప్టింగ్ ని తిరిగి రీఇన్వెంట్ చేయాలని కూడా ఆర్జీవీ సూచించారు.
దురంధర్ చాలా పరిణతి చెందిన.. ప్రతిదీ డెప్త్ తో సూక్ష అంశాలను ఎలివేట్ చేసిందని, వాస్తవ విరుద్ధంగా అతిశయోక్తులు లేకుండా యాక్షన్ నమ్మదగినదిగా అనిపిస్తుందని వర్మ అన్నారు. సాంప్రదాయ మసాలా సినిమాలో ఆ స్థాయి పరిణతి, పాత్ర స్పష్టత చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది తరచుగా పనికిమాలిన సినిమాలా అనిపిస్తుందని ఆర్జీవీ విమర్శించారు. అంతేకాదు హీరోసామ్యంపై ఆధారపడి కథలు రాసే దక్షిణాది దర్శకరచయితలను కూడా ఆర్జీవీ సున్నితంగా హెచ్చరించారు. హీరో ఆరాధనా భావం నుంచి దూరంగా ఉండాలని కూడా వర్మ హైలైట్ చేశాడు.
దురంధర్‌లో రణ్‌వీర్ సింగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టడం ఎక్కడా దర్శకుడి ఉద్దేశ్యం కాదు. కథలో అదృశ్యమయ్యే పాత్రగా అతన్ని పూర్తిగా చూస్తారు. ప్రతి పాత్ర సమానంగా ముఖ్యమైనదిగా కనిపిస్తుందని ఆర్జీవీ విశ్లేషించారు. మీరు రణ్‌వీర్‌ను గుర్తుంచుకోరు.. ప్రతి పాత్రకు వారి హక్కు ఇవ్వడం చాలా అరుదు.. అని అన్నారు.దక్షిణాది సినిమా అవాస్తవికత, అపరిపక్వత గురించి వర్మ తీవ్రంగా విమర్శించారు. అతిగా ఆకర్షణీయంగా హీరోయిన్ పాత్రను చూపిస్తారని కూడా ఎద్దేవా చేసారు వర్మ. సినిమాలో సంబంధాలను ఎలివేట్ చేసే విధానాన్ని తూర్పారబట్టారు.
మలయాళ సినిమా తప్ప దక్షిణాది వారు మసాలా సినిమాలు తీయడం ఎప్పుడూ ఆపలేదు.. అందుకే ఈ పరిశ్రమల తారలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందారు. కానీ దక్షిణాదిన కథ చెప్పే సున్నితత్వం తరచుగా ఉత్తర భారత ప్రేక్షకులతో కనెక్ట్ కాలేదని కూడా ఆర్జీవీ విశ్లేషించారు. ధురంధర్ అదే యాక్షన్-మసాలా ఫార్ములాను ఉపయోగించినా కానీ, దానిని వాస్తవికతకు దగ్గరగా ఆదిత్యాధర్ చిత్రీకరించాడు. సంగీతం, సంభాషణలు, సినిమాటోగ్రఫీ, యాక్షన్ గురించి చర్చ జరుగుతోంది. దక్షిణాది సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి థియేటర్ ప్రేక్షకులను అలరించవచ్చు, కానీ ఆ తర్వాత చర్చించుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు! అని అన్నారు.
చివరిగా ఆర్జీవీ వైఖరిని పరిశీలిస్తే మనం ఒక విషయాన్ని స్పష్ఠంగా అర్థం చేసుకోవచ్చు. ఆర్జీవీ విశ్లేషణ చాలా బావుంది. కానీ దురంధర్ అతడిని ఇంతగా కదిలించడానికి కారణం.. ఆర్జీవీ తెరకెక్కించిన సత్య (1998) ... సర్కార్ (2005) చిత్రాలను పోలి ఉండటమే...! ఇదే విషయంపైనా అతడిని ప్రశ్నిస్తే, దానికి స్పందిస్తూ ఆర్జీవీ ఇలా అన్నాడు. ''మానవ సంఘర్షణ అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. అది అమెరికన్ మాఫియా అయినా, ముంబై అండర్‌వరల్డ్ అయినా, లేదా మరే ఇతర నేపథ్యం అయినా. ఆ సంఘర్షణను ఎలా చిత్రీకరించారన్నదే ముఖ్యం. ది గాడ్‌ఫాదర్ (1972) చిత్రం దాని నిర్మాణ శైలి వల్లే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాణంగా నిలిచింది. గొప్ప సినిమాగా నిలిచింది'' అని విశ్లేషించారు. ఇప్పుడు ఆదిత్యాధర్ పాకిస్తాన్ మాఫియా కథను అద్భుతంగా తెరకెక్కించడం వల్లనే ఆర్జీవీకి అంత బాగా నచ్చాడు!
