Begin typing your search above and press return to search.

నాకు 60 ఏళ్లు.. ఇంకో 10 ఏళ్లు మీ అందరినీ వాడేస్తా: RGV బోల్డ్ ఫిలాసఫీ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఏది మాట్లాడినా అదొక సంచలనమే.

By:  Sivaji Kontham   |   2 Nov 2026 9:30 AM IST
నాకు 60 ఏళ్లు.. ఇంకో 10 ఏళ్లు మీ అందరినీ వాడేస్తా: RGV బోల్డ్ ఫిలాసఫీ
X

నాకు 60 ఏళ్లు ఇంకో 10ఏళ్లు మీ అంద‌రినీ వాడేస్తా.. అంద‌రినీ భ‌య‌పెట్టి .. మీ చావు మీరు చావండి.. నా చావు నేను చ‌స్తాను! అంటూ త‌న ఫిలాస‌ఫీని ఎంతో అందంగా చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఏది మాట్లాడినా అదొక సంచలనమే. సమాజపు సంప్రదాయ చట్రాలను పక్కనబెట్టి.. అత్యంత స్వార్థపూరితంగా..స్పష్టంగా జీవితాన్ని ఆస్వాధించాలని చెప్పే ఆయన ఫిలాసఫీ ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఇటీవల నటుడు రాజా రవీంద్రతో జరిపిన ఒక ప్రత్యేక చిట్ చాట్‌లో ఆర్జీవీ మాట్లాడుతూ ``నాకు 60 ఏళ్లు.. ఇంకో 10 ఏళ్లు మీ అందరినీ నా అవసరాల కోసం వాడేస్తా.. అందరినీ భయపెట్టి నా దారిలో నేను పోతాను. మీ చావు మీరు చావండి.. నా చావు నేను చస్తాను!`` అంటూ తనదైన శైలి నగ్నసత్యాన్ని త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించారు.

రాజా రవీంద్రతో ఇంట‌ర్వ్యూలో వర్మ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా `జెన్ జీ`లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజం ఏమనుకుంటుందో అనే భయం లేకుండా.. ఇతరుల అభిప్రాయాలకు లొంగకుండా బ్రతకాలనే ఆర్జీవీ ఆలోచనా విధానాన్ని నేటి తరం ఎంతగానో ఇష్టపడుతోంది. అయితే ఆర్జీవీని అనుసరిస్తూనే.. నేటి యూత్ కెరీర్ - చదువుల విషయంలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తోంది. చదువును, భవిష్యత్తును విస్మరించకుండానే.. ఆర్జీవీ చెప్పినట్లు జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి నేటి తరం సిద్ధపడుతుండటం విశేషం.

జీవితం, మనస్తత్వాల గురించి రామ్ గోపాల్ వర్మ ప‌లు ఇంటర్వ్యూలలో చెప్పిన నగ్నసత్యాలు నెటిజన్లను ఆలోచింపజేస్తుంటాయి. ``జీవితంలో గతం అనేది లేదు.. భవిష్యత్తు అనేది అబద్ధం.. ఉన్నదల్లా ఈ వర్తమాన క్షణమే`` అని వర్మ గట్టిగా నమ్ముతారు. ప్రేమ, బంధాలు, బాధ్యతల పేరుతో మనుషులు తమను తాము మోసం చేసుకుంటున్నారని.. నిజాయితీగా తమ కోసం తాము బ్రతకడమే అసలైన స్వేచ్ఛ అని ఆయన అంటారు. ఇతరుల మెప్పు కోసం కాకుండా తన ఆనందం కోసం బ్రతకడమే గొప్ప జీవితమని.. చావు గురించి భయపడకుండా ప్రతి రోజూ స్వేచ్ఛగా జీవించడమే తన సైకాలజీ అని ఆర్జీవీ అనేక సందర్భాల్లో స్ప‌ష్ఠంగా చెప్పారు.

ఆలోచనల్లో ఎంత భోళాగా ఉంటారో.. సినిమా మేకింగ్‌లోనూ వర్మ అంతే వేగంగా ఉంటారు. ప్రస్తుతం వర్మ తన సొంత ఆర్జీవీ డెన్ బ్యానర్‌పై విభిన్నమైన ప్రాజెక్ట్‌లు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. క్రైమ్ డ్రామాలు, పొలిటికల్ సెటైర్ డ్రామాలను ఓటీటీలు, యూట్యూబ్ కోసం తెరకెక్కిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త నటీనటులను తక్కువ బడ్జెట్‌లో వాడుకుంటూ క్రైమ్-థ్రిల్లర్ సినిమాలను, రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించే వెబ్ కంటెంట్‌ను రూపొందించడంలో ఆయన నిరంతరం బిజీగా గడుపుతున్నారు.

ఒకవైపు తన వైవిధ్యమైన సినిమాలతో చ‌ర్చ‌ల్లో నిలుస్తూనే.. మరోవైపు తన బోల్డ్ ఇంటర్వ్యూలు- ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. సమాజంలోని రొటీనిటీని అనుస‌రించ‌కుండా 60 ఏళ్ల వయసులో కూడా అంతే ఉత్సాహంతో ఎవరికీ జవాబుదారీ కాకుండా జీవిస్తున్న వర్మ మార్క్ లైఫ్‌స్టైల్.. అభిమానులకు, యూత్‌కు ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంది.