సల్లూ భాయ్‌తో సీఎం... మ్యాటర్ ఏంటో?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టాలీవుడ్ స్టార్స్ భేటీ అయితే పెద్దగా విశేషం ఏమీ ఉండదు.
By: Ramesh Palla | 31 Oct 2025 11:21 AM ISTతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టాలీవుడ్ స్టార్స్ భేటీ అయితే పెద్దగా విశేషం ఏమీ ఉండదు. సినిమా ఇండస్ట్రీ గురించి ఏమైనా మాట్లాడి ఉంటారని, సాధారణంగానే భేటీ జరిగి ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ తెలుగు స్టార్స్ కేంద్ర స్థాయి నాయకులు, ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో భేటీ అయితే ఖచ్చితంగా మ్యాటర్ ఉందని, చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో భేటీ కావడం చర్చనీయాంశం అయింది. ఇటీవల ముంబైలో వీరి భేటీ జరిగింది. వీరిద్దరు క్యాజువల్‌గా కలిసి ఉంటారా లేదంటే ముందస్తు ప్లాన్ చేసి మరీ వీరిద్దరు కలిసి ఉంటారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ఖాన్‌తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సుశీల్ కుమార్ శిండే మనవరాలి పెళ్లిలో...
తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు పలువురు జాతీయ స్థాయి నాయకులు, కాంగ్రెస్ నాయకులు ముంబైలో జరిగిన కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలి పెళ్లికి హాజరు అయ్యారు. అదే వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం జరిగింది. సుశీల్ కుమార్ శిండే కాంగ్రెస్ వ్యక్తి కనుక, ఆయనతో గతంలో ఉన్న అనుబంధం ఇతర కారణాల వల్ల ఆ పెళ్లికి రేవంత్ రెడ్డి వెళ్లి ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కలిశాడు అనేది మాత్రం తెలియడం లేదు. పలువురు పలు రకాలుగా ఈ విషయమై చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మొదటి సారి ఒక బాలీవుడ్ స్టార్ ను కలవడం, ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా చర్చలు జరుగుతున్నాయి.
రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ ఫోటో...
సోషల్ మీడియా కథనాల అనుసారం... సుశీల్ కుమార్ శిండే మనవరాలి వివాహంకు సల్మాన్ ఖాన్ సైతం హాజరు అయ్యి ఉంటాడని, ఆ సమయంలోనే సల్మాన్, రేవంత్ రెడ్డి ఎదురు పడి ఉంటారని అంటున్నారు. అంతే తప్ప ఈ భేటీ ముందస్తుగా ప్లాన్ చేసింది కాదు, ముందు నుంచి అనుకున్నది అసలే కాదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సల్మాన్ ఖాన్ ను కలిసిన సమయంలో తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి చెప్పాడని, తెలంగాణ రైజింగ్ ప్రోగ్రాం గురించి సల్మాన్ ఖాన్‌కి వివరించి ఉంటాడని కూడా వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సైతం తెలంగాణ రైజింగ్ నినాదంను తనదైన శైలిలో ముందుకు తీసుకు వెళ్లేందుకు తనవంతు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చాడట. మొత్తానికి కొన్ని నిమిషాల వీరిద్దరి కలయిక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు తెర తీసింది. సీఎం ఆఫీస్ నుంచి మాత్రం ఈ భేటీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రష్మిక మందన్న నటించిన సికిందర్ మూవీ...
ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాదిలో సికిందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సికిందర్ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. కమర్షియల్‌గా సికిందర్ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఏ మాత్రం ఆకట్టుకోలేదు అంటూ విమర్శలు ఎదుర్కొంది. దాంతో దర్శకుడు మురుగదాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ సమయానికి షూటింగ్ కు రాకపోవడం వల్ల సినిమా ఫలితం మారిందని ఆయన అన్నాడు. అయితే దర్శకుడి వ్యాఖ్యలకు సల్మాన్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. మొత్తానికి సల్మాన్ సికిందర్ తో మరో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సల్లూ భాయ్ సాలిడ్ కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. బాలీవుడ్ లో ఆయన క్రేజ్ అంతకంతకు తగ్గుతుంది. ఇతర హీరోలతో పోల్చితే పోటీలో వెనక పడ్డట్లుగా అనిపిస్తుందని సల్మాన్ ఖాన్ అభిమానులు స్వయంగా అంటున్నారు. బిగ్‌బాస్ నుంచి కూడా సల్మాన్ ఖాన్ ను తప్పించే యోచనలో నిర్వాహకులు ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
