Begin typing your search above and press return to search.

సినీకార్మికుల‌కు సీఎం రేవంత్ వరాలు

ఆయ‌న మాట్లాడుతూ... సినీకార్మికుల పిల్ల‌ల‌కు కార్పొరెట్ స్థాయి పాఠ‌శాల నిర్మించి, న‌ర్స‌రీ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ ఉచిత చ‌దువులు చ‌దివిస్తామ‌ని ప్ర‌క‌టించారు.. అలాగే కార్మికుల పిల్ల‌ల‌కు ఉచిత వైద్యం అంద‌జేస్తామ‌ని తెలిపారు.

By:  Sivaji Kontham   |   28 Oct 2025 9:04 PM IST
సినీకార్మికుల‌కు సీఎం రేవంత్ వరాలు
X

హైద‌రాబాద్ లో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న‌వంతు సహాయ‌స‌హ‌కారాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. టికెట్ రేట్ల పెంపు స‌హా చాలా విష‌యాల‌లో ఆయ‌న ప‌రిశ్ర‌మ విన్న‌పాలు ప‌రిశీలించి స‌హ‌క‌రిస్తున్నారు. ప్ర‌స్తుత ఎఫ్‌.డి.సి అధ్య‌క్షుడు దిల్ రాజు ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళుతుంటే ధీటుగా స్పందిస్తున్నారు.

ఇంత‌కుముందు సినీకార్మికుల జీత‌భ‌త్యాల స‌మ‌స్య ప‌రిష్కారంలోను రేవంత్ రెడ్డి చొర‌వ చూపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సినీ కార్మికుల‌కు ఉచిత‌ ఇళ్ల స్థ‌లాలతో పాటు, వారి పిల్ల‌ల‌కు ఉచిత విద్య, వైద్యం అందిస్తామ‌ని సీఎం రేవంత్ ప్ర‌క‌టించారు. సినీకార్మికుల స‌మాఖ్య (ఫెడ‌రేష‌న్) ఆధ్వ‌ర్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డికి స‌న్మానం జ‌రిగింది. హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జ‌రిగిన ఈ స‌న్మానంలో రేవంత్ సినీకార్మికుల సంక్షేమం కోసం వ‌రాలు కురిపించారు.

ఆయ‌న మాట్లాడుతూ... సినీకార్మికుల పిల్ల‌ల‌కు కార్పొరెట్ స్థాయి పాఠ‌శాల నిర్మించి, న‌ర్స‌రీ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ ఉచిత చ‌దువులు చ‌దివిస్తామ‌ని ప్ర‌క‌టించారు.. అలాగే కార్మికుల పిల్ల‌ల‌కు ఉచిత వైద్యం అంద‌జేస్తామ‌ని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం 10కోట్ల నిధిని బ్యాంకులో డిపాజిట్ చేస్తామ‌ని, సినీకార్మికుల‌కు ఉచిత‌ ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో సినీప‌రిశ్ర‌మ‌కు ప్రాధాన్య‌త‌నిస్తామ‌ని, ఐటీ- ఫార్మా త‌ర‌హాలోనే దీనిని కూడా గుర్తిస్తామ‌ని తెలిపారు.

నిజానికి సినీ కార్మికుల క‌ష్టాలు తెలియ‌కుండా మేము లేము. వారికి అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తాము. గ‌ద్ద‌ర్ పేరుతో ప్ర‌భుత్వం త‌ర‌పున‌ సినీ అవార్డుల‌ను అందిస్తున్నాం. ఈ రంగాన్ని ఐటీ, ఫార్మా ప‌రిశ్ర‌మ‌ల్లానే అభివృద్ధి చేస్తామ‌ని సీఎం మాటిచ్చారు. హైద‌రాబాద్ సినీప‌రిశ్ర‌మ‌కు ప్ర‌ధాన హ‌బ్. హాలీవుడ్ ని కూడా హైద‌రాబాద్ కి తెస్తాను.. హైద‌రాబాద్ స‌హా రామోజీ ఫిలింసిటీలో షూటింగులు జ‌రిగేలా చూస్తాను.. ఆ బాధ్య‌త త‌మ ప్ర‌భుత్వానికి ఉంద‌ని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు.