Begin typing your search above and press return to search.

అల్లు వారి పెళ్లి ఫ్రేమ్‌లో CM రేవంత్ రెడ్డి

మెగా- అల్లు కుటుంబాల కలయికతో హైదరాబాద్‌లో జరిగిన అల్లు శిరీష్ వివాహ వేడుక ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది.

By:  Sivaji Kontham   |   7 March 2026 9:21 AM IST
అల్లు వారి పెళ్లి ఫ్రేమ్‌లో CM రేవంత్ రెడ్డి
X

మెగా- అల్లు కుటుంబాల కలయికతో హైదరాబాద్‌లో జరిగిన అల్లు శిరీష్ వివాహ వేడుక ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. మార్చి 6న అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహం అత్యంత వైభవంగా జరగగా.. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన హేమాహేమీలు తరలివచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక అపురూప దృశ్యం వైరల్‌గా మారింది. అది మరేదో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ వివాహ వేడుకకు హాజరై సందడి చేయడం.





ఈ పెళ్లి వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగమనం ప్రత్యేక చర్చకు తావిచ్చింది. రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి.. మెగా-అల్లు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన ఈ వేడుకకు విచ్చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నూతన వధూవరులైన శిరీష్- నైనికలను ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించడం అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. వధూవరులతో కలిసి ఆయన దిగిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సాన్నిహిత్యంగా ముచ్చటించడం ఈ వేడుకలో హైలైట్‌గా నిలిచింది. గతంలో జరిగిన సంధ్య థియేటర్ ఇష్యూ వంటి కొన్ని వివాదాలను కూడా పక్కన పెట్టి.. ముఖ్యమంత్రి ఇలా పెళ్లికి విచ్చేసి ఆత్మీయంగా క‌ల‌వ‌డం గమనార్హం. అల్లు అర్జున్ - రేవంత్ రెడ్డి ఒకరినొకరు పలకరించుకుంటూ.. చిరునవ్వుతో సంభాషించుకోవడం చూస్తుంటే వారి మధ్య ఉన్న గౌరవపూర్వక రిలేష‌న్ అంద‌రినీ ఆక‌ర్షించింది.

ఈ వేడుకలో కేవలం ఆశీర్వచనాలకే పరిమితం కాకుండా.. అల్లు అరవింద్, అల్లు అర్జున్... శిరీష్ ఇత‌ర కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు సరదాగా సమయం గడిపారు. అల్లు అరవింద్‌తో ఆయన జరిపిన సంభాషణలు.. కుటుంబ సభ్యులందరితో కలిసి ఫోటోలకు పోజులివ్వడం వంటి దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకర్షించాయి. రాజకీయ నాయకుడిగా కాకుండా.. ఒక ఆత్మీయ అతిథిగా ఆయన పలకరింపులు వేడుకలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

అల్లు శిరీష్ వివాహం కేవలం ఒక కుటుంబ వేడుకగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు , సినీ దిగ్గజాల కలయికకు వేదికైంది. రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా హాజరుకావడం విశేషం. ఇలా అగ్ర నాయకులందరూ ఒకే చోట చేరి నూతన దంపతులను ఆశీర్వదించడం అల్లు కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవంగా భావించవచ్చు.

అల్లు శిరీష్ - నైనికల వివాహ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందడి చేయడం ద్వారా ఈ పెళ్లి వేడుక మరింత గుర్తుండిపోయేలా మారింది. అంద‌రూ పండుగ వాతావరణంలో గడపడం ఈ వేడుక ప్రత్యేకత. ఈ అపురూప దృశ్యాలు అల్లు - మెగా అభిమానులకు సోషల్ మీడియాలో ఒక పెద్ద విందుగా మారాయి.