పెళ్లయిన నిర్మాత నా తల్లి ముందే అసభ్యంగా..!
ఇండస్ట్రీలో ఇలాంటివి తిరస్కరించినప్పుడు ఆ నటీమణిని టార్గెట్ చేస్తారని రేణుక సహానే తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
By: Sivaji Kontham | 12 Nov 2025 5:00 AM IST``ఇండస్ట్రీలో పెళ్లయిన నిర్మాత అవకాశం పేరుతో అసభ్యకర ప్రపోజల్ చేసాడు. అతడి ఆఫర్‌ని అంగీకరిస్తే సహజీవనం చేయాల్సి ఉంటుందని అడిగాడు. ఆఫర్ ని తిరస్కరించగానే అతడు నన్ను బయటకు గెంటేసాడు`` అని ఆవేదనగా చెప్పుకొచ్చారు ప్రముఖ బాలీవుడ్ నటి రేణుక సహానే. సదరు నిర్మాత మా ఇంటికి వచ్చాడు. నా తల్లి ముందే నాకు ఇలాంటి ప్రపోజల్ పెట్టాడు. ఆఫర్ ఇస్తాను.. సహజీవనం చేయాలని కోరాడు. తాను బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తే, నాకు నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తానని, కలిసి జీవించాలని చెప్పాడు. అయితే ఆ ఆఫర్ ని వెంటనే తిరస్కరించాను. నేను నా తల్లి ఆ క్షణంలో ఏం చేయాలో తోచక ఒకరి కళ్లలోకి ఒకరు అలానే చూస్తూ ఉండిపోయామని సదరు నటీమణి తెలిపారు.
ఇండస్ట్రీలో ఇలాంటివి తిరస్కరించినప్పుడు ఆ నటీమణిని టార్గెట్ చేస్తారని రేణుక సహానే తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ అనుభవం నా ఒక్కరిదే కాదు. చాలా మంది నటీమణుల అనుభవం ఇది. వారు గుంపుగా ఏర్పాడతారు. ముఠాలు కడతారు. మరింత నష్టం కలగజేస్తారని అన్నారు. అతడు నాకు పాపులర్ బ్రాండ్ చీరకు ప్రచారకర్తగా కాంట్రాక్ట్ ఇస్తానని ఆఫర్ చేసాడు. కానీ సహజీవనం చేయాలని కండిషన్ పెట్టడంతో తిరస్కరించానని తెలిపారు.
వ్యక్తిగతంగా తనకు వినోదపరిశ్రమలో ఎలాంటి హాని జరగకపోయినా చాలా మంది నటీమణులు ఇలాంటివి ఎదుర్కొంటారని రేణుక సహాని తెలిపారు. బాధితురాలిని మరింతగా బలిపశువును చేయడానికి గ్రూపులు కడతారని చెప్పారు. నటి రేణుక హిందీ, మరాఠా చిత్రరంగంలో ప్రముఖ నటి. హమ్ ఆప్కే హై కౌన్, సర్కస్ లాంటి చిత్రాలలో చిరస్మరణీయ పాత్రలతో హృదయాలను గెలుచుకున్నారు.
సర్కస్ చిత్రంలో తన నటనతో మెప్పించిన రేణుక దూరదర్శన్ షో `సురభి`కి సహ-హోస్ట్‌గాను మెప్పించారు. ఈ షో తన ఇంటి పేరుగా మారింది. బాలీవుడ్ క్లాసిక్ హిట్ `హమ్ ఆప్కే హై కౌన్..!`లో లవ్వబుల్ సిస్టర్ పూజ పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు రేణుక. ఆ తర్వాత చాలా హిందీ, మరాఠా హిట్ చిత్రాలలోను సహాయక పాత్రలలో నటించారు. కాజోల్, తన్వి అజ్మీ, మిథిలా పాల్కర్ నటించిన `త్రిభంగా` (2021)తో నిర్మాతగాను తనదైన ముద్ర వేసారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ `దుపాహియా`లో కనిపించారు. రేణుక నటనకు విమర్శకులు సహా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
ఇలాంటి అనుభవాలు కేవలం హిందీ చిత్రసీమలోనే కాదు, ఇతర పరిశ్రమల్లోను నటీమణులు ఎదుర్కొనేవే. కానీ చాలా మంది బయటపడరు. కొందరు మీటూ ఉద్యమ సమయంలో తమకు జరిగిన వేధింపుల ప్రహసనాలను బయటపెట్టేందుకు వెనకాడలేదు. కానీ కొన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా విచారణల దశలో నీరుగారిపోయాయి.
