రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..
పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా విడాకుల వార్తల నేపథ్యంలో రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్నవారిని మరింత బాధపెట్టడం సరికాదని, ఇతరుల కన్నీళ్లతో వ్యూస్, డబ్బులు సంపాదించే మీడియా సంస్థలు, యూట్యూబర్లు మానవత్వంతో వ్యవహరించాలని ఆమె సూచించారు. అయితే తన పోస్ట్ ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని స్పష్టం చేశారు.
By: M Prashanth | 10 Nov 2026 6:19 PM ISTపవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో రేణు దేశాయ్ చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఇంకా విమర్శించడం సరైన పద్ధతి కాదంటూ ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. ఎవరినీ డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా, పవన్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్న సమయంలో ఈ పోస్ట్ పెట్టడంతో ఆయన గురించే రాశారా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఒక వ్యక్తి ఇప్పటికే కష్టాల్లో ఉంటే మరింత బాధపెట్టడం మానవత్వం కాదని రేణు పేర్కొన్నారు. ఎవరైనా సరే ఒకరికి బిడ్డగా, మరొకరికి తల్లిదండ్రులుగా, ఇంకొకరికి తోబుట్టువులుగా ఉంటారని గుర్తుచేశారు. ఎదుటివాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. మన ఇళ్లలో కూడా లోపాలు ఉంటాయని, అలాంటప్పుడు ఇతరుల ఇళ్లపై రాళ్లు వేయడం ఎందుకని ప్రశ్నించారు.
ముఖ్యంగా ఇతరుల బాధను ఉపయోగించుకుని వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించే మీడియా సంస్థలు, యూట్యూబర్లపై రేణు సీరియస్ గా స్పందించారు. ఒకరి కన్నీళ్లతో సంపాదించిన డబ్బు మంచిది కాదని, అలాంటి పనులకు కర్మఫలం తప్పదని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్లో ఓ వర్గం మీడియాను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఇక తన పోస్ట్ చూసి అనవసరమైన ఊహాగానాలు మొదలుపెట్టవద్దని రేణు ముందుగానే కోరారు.
తాను ఈ మాటలు చెప్పడానికి ఎవరూ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సమాజంలో మనుషులు ఒకరి పట్ల మరొకరు కాస్త దయతో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. కేవలం మానవత్వంతోనే ఈ విషయాలను ప్రస్తావించినట్లు ఆమె రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌తో గతంలో వివాహ బంధం ఉన్న రేణు దేశాయ్ ఆయన నుంచి విడిపోయిన తర్వాత తన పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.
గతంలో పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు రేణును కూడా సోషల్ మీడియాలో ప్రస్తావించిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్‌లో పవన్ పేరు గానీ, అన్నా లెజ్నెవా పేరు గానీ ఎక్కడా లేదు. మరోవైపు రేణు దేశాయ్ తన పోస్ట్‌తో పాటు చీరకట్టులో ఉన్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. ఆ పోస్టుకు వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. తర్వాత అదే పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ మీడియా, యూట్యూబర్లపై మరింత ఘాటుగా స్పందించారు.
