Begin typing your search above and press return to search.

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

దీపావళి సందర్భంగా అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో టపాసులు పేల్చడంపై నటి రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రాత్రి 11 గంటలైనా బాణసంచా కాల్చడంపై సోషల్ మీడియాలో స్పందించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాత్రి 10 గంటల తర్వాత టపాసులు ఆపాలని కోరారు.

By:  M Prashanth   |   10 Nov 2026 9:20 AM IST
ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్
X

పండుగల సమయంలో టపాసులు కాల్చడం మామూలే. కానీ అర్ధరాత్రి వరకు పెద్ద పెద్ద సౌండ్స్ తో టపాసులు పేలుస్తుంటే చుట్టుపక్కల వాళ్ల పరిస్థితి ఏంటని నటి రేణు దేశాయ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో రాత్రి 11 గంటలైనా భారీ శబ్దాలతో టపాసులు కాలుస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పండుగ చేసుకోవడాన్ని తప్పుపట్టడం లేదని, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరారు.

నిన్న మాట్లాడి ఉంటే తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసేవారని, అందుకే మౌనంగా ఉన్నానని రేణు పేర్కొన్నారు. అయితే రాత్రి 11 గంటలకు కూడా ఇంత పెద్ద శబ్దాలతో టపాసులు కాల్చడానికి ఏ పండుగ ఉందని ప్రశ్నించారు. వృద్ధులు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవాళ్ల గురించి కనీసం ఆలోచించడం లేదని మండిపడ్డారు. తమ ఆనందం కోసం ఇతరులు ఇబ్బంది పడినా పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదన్నారు.

టపాసులు కాల్చాలనుకునేవాళ్లు రాత్రి 9 గంటలలోపు కాల్చుకోవచ్చని రేణు సూచించారు. కనీసం 10 గంటలకైనా పూర్తి చేయాలని కోరారు. మూడు రోజులుగా రాత్రి ఒంటి గంట, రెండు గంటలు, చివరకు మూడు గంటలకు కూడా టపాసులు పేలుస్తున్నారని తన స్నేహితులు చెప్పినట్లు వివరించారు. తన బెడ్‌రూమ్ సౌండ్‌ప్రూఫ్ కావడంతో ఆ శబ్దాల ఇబ్బంది తనకు నేరుగా తెలియడం లేదని కూడా తెలిపారు.

ఇక టపాసుల వల్ల కాలుష్యం గురించి మాట్లాడటం అనవసరమని రేణు అభిప్రాయపడ్డారు. ఏడాదంతా వాహనాలు, పరిశ్రమల వల్ల కాలుష్యం ఉంటుందని, ఒక్కరోజు టపాసులతో పెద్దగా తేడా ఉండదని భావించేవాళ్లు కూడా ఉన్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. దీపాల పండుగను శబ్దాల పోటీగా మార్చుకున్నా కనీసం రాత్రి 10 గంటల తర్వాత ఆపాలని కోరారు.

ముఖ్యంగా వృద్ధులు, అప్పుడే పుట్టిన పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు రాత్రిపూట ప్రశాంతంగా ఉండేలా చూడాలని రేణు విజ్ఞప్తి చేశారు. పండుగ పేరుతో పక్కవాళ్లను ఇబ్బంది పెట్టకుండా కాస్త మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాలను కాస్త ఘాటుగానే ప్రస్తావించారు.