రేణూ బ్రెయిన్‌లో లాంగ్వేజ్ మిక్సీ
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా భాషల మేళవింపుతో కూడిన తన పెరుగుదల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 April 2026 5:00 AM ISTతెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపును సంపాదించుకున్న రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా భాషల మేళవింపుతో కూడిన తన పెరుగుదల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె తల్లి రాజస్థానీ, తండ్రి గుజరాతీ కావడంతో కుటుంబంలో భిన్న సంస్కృతుల సమ్మేళనం కనిపించేదని తెలిపారు. అయితే, ఇద్దరికీ ఒకరి భాష మరొకరికి రాకపోవడంతో వారు హిందీలో సంభాషించుకునేవారని చెప్పారు. అదే సమయంలో ఇంట్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు మాత్రం మరాఠీనే ఉపయోగించేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. పూణేలో పుట్టి పెరిగిన రేణు దేశాయ్, తనను తాను మహారాష్ట్ర అమ్మాయిగా భావిస్తానని చెప్పడం గమనార్హం. ఈ బహుభాషా వాతావరణం తన వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని, తన ఆలోచనల్లోనే భాషల మిక్సింగ్ సహజంగా జరుగుతుందని ఆమె వివరించారు.
ఈ భాషా మేళవింపే తనకు ఒక ప్రత్యేకతగా మారిందని రేణు అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, మార్వాడీ.. ఈ ఐదు భాషల్లో తాను సులభంగా మాట్లాడగలగడం తనకు ఒక అదనపు బలం అని పేర్కొన్నారు. అయితే, ఏ సందర్భంలో ఏ భాష మాట్లాడాలో నిర్ణయించుకోవడం కొన్నిసార్లు తనకు సవాలుగా మారుతుందని ఆమె సరదాగా చెప్పారు. ఈ అనుభవం తన వ్యక్తిగత జీవితంతో పాటు తన నటనా ప్రయాణంలో కూడా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా భిన్న ప్రాంతాల ప్రేక్షకులతో కనెక్ట్ కావడంలో ఈ బహుభాషా పరిజ్ఞానం తనకు ఉపయోగపడిందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భాషలు మాత్రమే కాదు, వివిధ సంస్కృతులపై అవగాహన కూడా ఆమె వ్యక్తిత్వాన్ని మరింత సమృద్ధిగా మలిచిందని చెప్పాలి.
ఇక ఆమె సినీ ప్రయాణం విషయానికి వస్తే, హీరోయిన్‌గా ఒక దశలో మంచి గుర్తింపు పొందిన రేణు దేశాయ్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెరపై కనిపించాలని ప్రయత్నించారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, ఆమె రీఎంట్రీపై ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించిన ఫలితం కారణంగా, ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆమె నుంచి కొత్త ప్రాజెక్టులపై స్పష్టమైన అప్‌డేట్స్ లేకపోవడం, ఆమె మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతారా అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
మొత్తంగా చూస్తే, రేణు దేశాయ్ వ్యక్తిగతంగా ఎంతో సమృద్ధిగా, అనుభవాలతో నిండిన జీవితం గడిపినా, సినీ రంగంలో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సరైన కథ, సరైన అవకాశం లభించకపోతే ఈ ప్రయాణం ఇక్కడే ఆగిపోతుందా అనే సందేహం కూడా కలుగుతోంది. భవిష్యత్తులో రేణు దేశాయ్ తీసుకునే నిర్ణయాలే ఆమె సినీ ప్రయాణానికి దిశానిర్దేశం చేయనున్నాయి.
