Begin typing your search above and press return to search.

శోభన్ బాబు పట్టుబట్టడంతో కురుక్షేత్రం వర్సెస్ డీవీఎస్ కర్ణ

అప్పట్లోనే మద్రాస్ నుంచి రాజస్థాన్ కి 80 వేల రూపాయలతో ప్రత్యేక రైలుని వేసి మొత్తం ఆర్టిస్టులను తీసుకుని కురుక్షేత్రం క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు అన్నది గొప్పగా చెప్పుకున్నారు.

By:  Satya P   |   20 March 2026 4:00 PM IST
శోభన్ బాబు పట్టుబట్టడంతో కురుక్షేత్రం వర్సెస్ డీవీఎస్ కర్ణ
X

ఇప్పటికి దాదాపు యాభై ఏళ్ళ క్రితం 1977 జనవరి 14న ఒకే డేట్ న అటు ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ, ఇటు సూపర్ స్టార్ క్రిష్ణ నట భూషణుడు శోభన్ బాబు మల్టీస్టారర్ కురుక్షేత్రం రిలీజ్ అయి తెలుగు నాట సినీ యుద్ధానికి దారి తీశాయి. ఈ యుద్ధం చాలా ఉత్కంఠగా సాగింది. విజేతగా దాన వీర శూర కర్ణ నిలిచినా టెక్నికల్ పరంగా కురుక్షేత్రానికి మంచి పేరు వచ్చింది. ఆ రోజులలో ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా క్రిష్ణ ఈ మూవీని నిర్మించారు. ఇక కర్ణుడు పాత్రలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ మూవీలో ఆనాటి సినీ రంగానికి చెందిన వారు అంతా ఉన్నారు. అప్పట్లోనే మద్రాస్ నుంచి రాజస్థాన్ కి 80 వేల రూపాయలతో ప్రత్యేక రైలుని వేసి మొత్తం ఆర్టిస్టులను తీసుకుని కురుక్షేత్రం క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు అన్నది గొప్పగా చెప్పుకున్నారు.

పోటీ పడాలనుకోలేదు :

ఇదిలా ఉంటే 2022 లో దివంగతులైన క్రిష్ణ అంతకు ముందు వివిధ టీవీ చానళ్ళకు తన కురుక్షేత్రం మూవీ గురించి వివరిస్తూ అనేక విషయాలు పంచుకున్నారు. తాను ఈ సినిమా తీయలేదని ఏ ఎస్ ఆర్ ఆంజనేయులు అనే నిర్మాత వచ్చారని క్రిష్ణ చెప్పారు. అంతకు ముందే శోభన్ బాబుని క్రిష్ణ పాత్రకు ఆయన తీసుకున్నారు, అర్జునుడి వేషానికి నన్ను అడిగారు అని క్రిష్ణ చెప్పారు. ఓకే అని తాను చెప్పాను అని క్రిష్ణ అన్నారు. ఇంతలో ఎన్టీఆర్ నుంచి కృష్ణకు కబురు వచ్చింది. దాన వీర శూర కర్ణ మూవీ తాను తీస్తున్నాను అని కురుక్షేత్రం మూవీ కధ కూడా అదే కావడంతో ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఎన్టీఅర్ క్రిష్ణను కోరారట. దానికి సరేనన్న క్రిష్ణ నిర్మాత ఆంజనేయులుతో ఈ సంగతి చెప్పారు, అయితే క్రిష్ణ పాత్రధారిగా అంగీకరించిన శోభన్ బాబు మాత్రం తాను ఈ మూవీ చేస్తానని గట్టిగా పట్టుబట్టారని క్రిష్ణ చెప్పుకొచ్చారు. చేసేది లేక సినిమా తీయాలని ముందుకు సాగామని క్రిష్ణ చెప్పారు.

నిర్మాతగా మారాల్సి వచ్చింది :

ఇక ఈ సినిమా నాలుగు రీళ్ళు పూర్తి చేశాక నిర్మాత ఆంజనేయులు ఆర్థిక ఇబ్బందులతో ఉండడంతో తాను నిర్మాతగా మారి మొత్తం సినిమా తీయాల్సి వచ్చింది అని క్రిష్ణ చెప్పారు. అలా ఈ సినిమా తీసి దాన వీర శూర కర్ణ మీద పోటీ పెట్టాలని తాను అనుకోలేదని పరిస్థితులు అలా వచ్చాయని క్రిష్ణ చెప్పారు. అయినా తమ సినిమాకు తెలుగు నాట తప్పించి మిగిలిన దక్షిణ భారత దేశంలో అంతటా మంచి పేరు వచ్చిందని అన్నారు.

అక్కడే మైనస్ అని :

ఇక తెలుగు నాట రాయబార పద్యాలకు ఎంతో పాపులర్ అని ఆ పద్యాల రైట్స్ అన్నీ ఎన్టీఆర్ వద్ద ఉన్నాయని వాటిని దాన వీర శూర కర్ణలో వాడారని, అందుకే ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని క్రిష్ణ చెప్పారు. తమ సినిమాకు కొత్తగా పద్యాలు రాయించి పాడించినా అది జనాలకు పెద్దగా ఎక్కలేదని అన్నారు. ఏది ఏమైనా కురుక్షేత్రం మంచి ప్రయోగంగా క్రిష్ణ ఆనాటి ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు ఇక ఈ మూవీలో కృష్ణుడుగా పూర్తి స్థాయి పాత్ర వేసిన శోభన్ బాబు తన కోరిక తీర్చుకున్నారు. ఆయన అంతకు ముందు బుద్ధిమంతుడు మూవీలో కొంత సేపు క్రిష్ణ పాత్రలో కనిపిస్తారు. ఎన్టీఆర్ తరువాత పౌరాణిక పాత్రలకు న్యాయం చేసిన ఆర్టిస్టులలో శోభన్ బాబునే ముందు చెప్పుకుంటారు. మార్చి 20న శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా ఆయన గురించి అభిమానులు తలచుకుంటూ పాత విషయాలను మననం చేసుకుంటున్నారు.