Begin typing your search above and press return to search.

మార్వ‌ల్ డిస్నీలా 'జియో స్టూడియోస్' ప్ర‌ణాళికలు?

భారతీయ వినోద రంగంలో రిలయన్స్ జియో స్టూడియోస్ హవా ఇటీవ‌ల‌ సరికొత్త పుంతలు తొక్కుతోంది.

By:  Sivaji Kontham   |   29 March 2026 9:00 AM IST
మార్వ‌ల్ డిస్నీలా జియో స్టూడియోస్ ప్ర‌ణాళికలు?
X

భారతీయ వినోద రంగంలో రిలయన్స్ జియో స్టూడియోస్ హవా ఇటీవ‌ల‌ సరికొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం టెలికాం రంగంలోనే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడారంగాల్లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. అదే స‌మ‌యంలో సినిమా రంగాన్ని రిలయన్స్ కబలిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్‌లో పంపిణీ, నిర్మాణ రంగంలో జియో స్టూడియోస్ అనుసరిస్తున్న వ్యూహాలు బాక్సాఫీస్ లెక్కలను మారుస్తున్నాయి. ఇటీవల `దురంధర్` సిరీస్‌తో సంచలనాలు సృష్టించిన ఈ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలపై కూడా దృష్టి సారించడం విశేషం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన `పెద్ది` టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో చరణ్ పహిల్వాన్ గా కనిపిస్తున్న రగ్గడ్ లుక్ .. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆఫ్-స్క్రీన్ జరిగిన అతిపెద్ద పరిణామం ఏమిటంటే.. ఈ చిత్ర ఉత్తరాది పంపిణీ హక్కులను జియో స్టూడియోస్ సొంతం చేసుకోవడం. ఒక భారీ టాలీవుడ్ సినిమాను జియో స్టూడియోస్ నేరుగా హిందీ బెల్ట్‌లో ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఈ పరిణామం నేపథ్యంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థపై అభిమానుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. హాలీవుడ్‌లో వార్నర్ బ్రదర్స్, డిస్నీ, మార్వెల్ (MCU), డిసి (DC) వంటి దిగ్గజ సంస్థలు తమ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే ప్రమోట్ చేస్తాయో.. రిలయన్స్ కూడా భారతీయ సినిమాను అదే స్థాయికి తీసుకెళ్లాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. భారతదేశంలోని టాప్ 20 పాన్ ఇండియా స్టార్లకు రిలయన్స్ వంటి సంస్థలు వెన్నుముకగా నిలిచి భారీ ఫండింగ్ అందిస్తే మన సినిమాలకు గ్లోబల్ మార్కెట్‌లో తిరుగుండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

`పెద్ది` సినిమాతో రిల‌య‌న్స్ పెద్ద అడుగు ద‌క్షిణాదికి ప్ల‌స్ కానుంది. దాంతో పాటు మే 1న విడుదలవుతున్న `రాజా శివాజీ` చిత్రానికి కూడా జియోనే మద్దతు ఇస్తుండటం విశేషం. రెండు పెద్ద సినిమాలు ఒకే సమయంలో వస్తున్నా కానీ.. జియో తన బలమైన నెట్‌వర్క్‌తో స్క్రీన్ల కేటాయింపును సమర్థవంతంగా నిర్వహించగలదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. `పెద్ది` చిత్రానికి హిందీ మార్కెట్‌లో కనీసం రూ. 8 నుంచి 10 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని పాజిటివ్ టాక్ వస్తే `పుష్ప 1` రికార్డులను కూడా అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి రిలయన్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు సినిమా రంగంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించడం వల్ల మేకింగ్ స్టాండర్డ్స్ పెరగడమే కాకుండా... మార్కెటింగ్ పరంగా భారతీయ సినిమా స్థాయి అమాంతం పెరిగేందుకు ఛాన్సుంది. ప్రాంతీయ భాషా చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి చేరవేసే క్రమంలో జియో స్టూడియోస్ ఒక శక్తివంతమైన వేదికగా మారుతోంది. భవిష్యత్తులో భారతీయ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వార్నర్ బ్రదర్స్ సినిమాలకు గట్టి పోటీనిచ్చేలా రిల‌య‌న్స్ భ‌రోసానిస్తుంద‌నే అంద‌రూ భావిస్తున్నారు.