13 ఏళ్ల వయసులోనే ఒంటరిగా ముంబై ప్రయాణం
రేఖ తండ్రి జెమిని గణేషన్ దక్షిణ భారత దేశంలో ప్రముఖ నటుడు కాగా, ఆమె తల్లి కూడా నటియే. చాలామంది నటీనటులు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చామని చెబుతుంటారు.
By: Srikanth Kontham | 20 Sept 2026 12:26 PM ISTభారతీయ సినీ యవనికపై తనదైన ముద్రతో దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానులను అలరించిన దిగ్గజ నటి రేఖ. అయితే వెండితెరపై ఎంతోమందికి కలల రాణిగా వెలిగిన రేఖ చిన్నతనంలో నటి కావాలనే ఆశ అసలు లేదనే విషయం ఎంతమందికి తెలుసు? 1986లో ఓ పాత ఇంటర్వ్యూలో రేఖ సినీ ప్రయాణ ప్రారంభం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తానెప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదని, పరిస్థితుల ప్రభావంతో బలవంతంగానే పరిశ్రమలోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని తెలిపారు.
రేఖ తండ్రి జెమిని గణేషన్ దక్షిణ భారత దేశంలో ప్రముఖ నటుడు కాగా, ఆమె తల్లి కూడా నటియే. చాలామంది నటీనటులు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చామని చెబుతుంటారు. కానీ రేఖ విషయంలో అది పూర్తిగా భిన్నంగా జరిగింది. మూడేళ్ల ఏళ్ల వయసులోనే రేఖ బాలనటిగా పరిచయం అయ్యారు. తన తల్లి కోరిక మేరకే తాను సినిమాల్లోకి రావాల్సి వచ్చిందని.. బలవంతంగా కొట్టి మరీ నటిని చేశారని రేఖ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇక హిందీ చిత్రసీమలో అడుగుపెట్టే నాటికి రేఖకు 13 ఏళ్ల వయసు మాత్రమే ఉంది. చెన్నై నుంచి ఇద్దరు వ్యక్తులు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. హిందీ అస్సలు రాని రేఖను చూసి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. తల్లి ఆరోగ్యం బాగోకపోవడంతో ఏమాత్రం పరిచయం లేని ముంబై నగారానికి 13 ఏళ్ల పిన్న వయసులోనే ఒంటరిగా రేఖ ప్రయాణమయ్యారు. హిందీ భాష తెలియకపోయినా? నటనపై ఆసక్తి లేకపోయినా? విధి తరిమిన దారిలోనే హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టానని తెలిపారు.
సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో డబుల్ షిఫ్టుల్లో పనిచేస్తూ రేఖ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రేఖ నటించిన తొలి హిందీ చిత్రం `సావన్ భాదో` ఘనవిజయం సాధించడంతో రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. రేఖ స్కూల్ సహచరులు సినిమా చూసి మెచ్చుకుంటుంటే? ఎంతో గర్వంగా ఉందనిపించినా? ఆ సమయంలో తాను ఏం చేస్తున్నానో కూడా తనకే సరిగ్గా అర్థమయ్యేది కాదని రేఖ పేర్కొన్నారు. మొదటి 6-7 సంవత్సరాల పాటు నటన ఎంతమాత్రం నచ్చలేదని స్పష్టం చేశారు. రేఖ జీవితంలో, ఆలోచనా విధానంలో అసలైన మార్పు 1975 నాటి `ఘర్` చిత్రంతోనే వచ్చింది.
ఆ చిత్రంలో తన పాత్రలోని సహజత్వాన్ని గ్రహించిన రేఖ తొలిసారి నటనపై నిజమైన ఆసక్తిని పెంపొం దించుకున్నారు. అప్పటివరకు ఒక ఉద్యోగంలా మాత్రమే చూసిన నటన ఆ సినిమా తర్వాత కళగా గౌరవించడం, ఆస్వాదించడం ప్రారంభించారు. ప్రారంభంలో విధిలేక చిత్ర పరిశ్రమలోకి వచ్చి నటనను అసహ్యించుకున్న రేఖ అటుపై దానినే జీవిత పరమావధిగా మార్చుకున్నారు. `హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదన్న నా జీవితంలో, ఇప్పుడు నటన మాత్రమే ఏకైక నిజమైన అంశంగా మారింది.. దీనిని నేను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను` అని రేఖ చెప్పిన మాటలు, ఆమె సాధించిన పరిణతికి నిదర్శనంగా చెప్పొచ్చు.
