Begin typing your search above and press return to search.

రేఖ‌తో బ‌ల‌వంత‌పు ముద్దు స‌న్నివేశం!

సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు.. నాటి షూటింగ్ సంస్కృతి నేటి ఆధునిక కాలంలో తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి.

By:  Srikanth Kontham   |   15 Jun 2026 3:00 PM IST
రేఖ‌తో బ‌ల‌వంత‌పు ముద్దు స‌న్నివేశం!
X

సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు.. నాటి షూటింగ్ సంస్కృతి నేటి ఆధునిక కాలంలో తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. ముఖ్యంగా పూర్వపు రోజుల్లో మహిళా నటీమణుల పట్ల సెట్స్‌పై జరిగిన కొన్ని వ్యవహారాలు.. నేటి మీటూ .. మహిళల హక్కుల చైతన్య యుగంలో తీవ్ర విమర్శలకు గురవు తున్నాయి. గతంలో పబ్లిసిటీ కోసమో లేదా సీన్‌లలో సహజత్వం కోసమో నటీనటుల ప్రమేయం, అనుమతి లేకుండా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్నాయి.

అలాంటి ఓ సంచలన పాత వివాదం బాలీవుడ్ దిగ్గజ నటి రేఖ - సీనియర్ నటుడు బిస్వజీత్ ఛటర్జీల మధ్య జరిగిన ముద్దు సన్నివేశానికి సంబంధించింది. `అంజనా సఫర్` చిత్ర షూటింగ్ సమయంలో అప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ నటి రేఖకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బిస్వజీత్ ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకున్నారనే ఆరోపణ ఉంది. ఈ సంఘటన రేఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. సెట్స్‌లోనే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

దీనిపై తాజాగా బిస్వజీత్ కుమార్తె ప్రిమా ఛటర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి సంఘటనలో తన తండ్రి ప్రవర్తనను పూర్తిగా సమర్థించకుండా.. నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా ఆమె మాట్లాడారు. నటి రేఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోకపోవడం ఖచ్చితంగా తప్పేనని అంగీకరించారు. ఏ రంగంలోనైనా? ఏ కాలంలోనైనా? మహిళకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని.. వ్యక్తిగత అనుమతిని గౌరవించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారానికి తన తండ్రిని మాత్రమే ఒంటరిగా బాధ్యుడిని చేయడం సరికాదని ప్రిమా అభిప్రా యపడ్డారు. ఆ రోజుల్లో దర్శకుడే సెట్స్‌పై సర్వాధికారిగా ఉండేవారని.. దర్శకుడు రాజా నవాతే ఇచ్చిన కఠినమైన ఆదేశాల మేరకే బిస్వజీత్ ఆ సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. నటి నుండి సహజమైన హావభావాలు రాబట్టడానికి దర్శకుడు పన్నిన వ్యూహంలో తన తండ్రి ఒక భాగస్వామి మాత్రమేనని కాబట్టి పూర్తి తప్పు ఆయనదే అనడం స‌రి కాదని వాదించారు.

ఆనాటి బాలీవుడ్ పరిశ్రమలో పని వాతావరణం, నటీనటుల మధ్య సరిహద్దులు నేటిలా స్పష్టంగా ఉండేవి కావు. ఒక నటి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కథ డిమాండ్ పేరుతో, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమో ఇలాంటి పనులు చేసే ధోరణి ఎక్కువగా ఉండేది. నేటి ఆధునిక సినిమాల్లో ఇంటిమసీ కోఆర్డినేట‌ర్లు ఉంటూ శృంగార లేదా ముద్దు సన్నివేశానికి ముందు నటీనటుల రాతపూర్వక అనుమతి తీసుకుంటున్న విధానాన్ని చూస్తే ఇండస్ట్రీ ఎంతగా మారిందో అర్థమవుతుంది.

గతంలో జరిగిన తప్పులను నేటి సామాజిక ప్రమాణాలతో పూర్తిగా తప్పుపట్టలేనప్పటికీ వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం అవసరం. నటుడు బిస్వజీత్ కుమార్తె చేసిన వ్యాఖ్యలు పాత తరం ఇండస్ట్రీలోని లోపాలను ఒప్పుకుంటూనే.. బాధ్యతను కేవలం నటుడిపైనే కాకుండా నాటి వ్యవస్థపై కూడా నెట్టే ప్రయత్నాన్ని చూపి స్తున్నాయి. ఏదేమైనా? చలనచిత్ర పరిశ్రమలో సృజనాత్మకత పేరిట నటీనటుల ఆత్మగౌరవాన్ని, హక్కులను తాకట్టు పెట్టకూడదనే స్పృహ పెరగడం శుభపరిణామం.