సౌత్ నుంచి వచ్చానని తక్కువగా చూశారు
సౌత్ నుంచి వచ్చిన నటిగా తనను కొందరు వేరేలా చూశారని, తన నేపథ్యాన్ని తక్కువ చేసి చూసిన సందర్భాలు కూడా ఎదురయ్యాయని రెజీనా తెలిపారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Feb 2026 1:20 PM ISTసౌత్ సినీ ఇండస్ట్రీలో పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా సత్తా చాటాలని చాలా మంది నటీనటులు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీకి వెళ్లినప్పుడు ఎవరికైనా అక్కడి పరిస్థితులు, పని చేసే విధానం, వాతావరణం ఎప్పుడూ సులభంగా అనుకూలించవు. ఈ నేపథ్యంలోనే సౌత్ నుంచి నార్త్ కు వెళ్లిన వాళ్లు పలు ఇబ్బందులు పడుతుంటారు.
2019లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా
బాలీవుడ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇప్పటికే పలువురు కామెంట్స్ చేయగా, తాజాగా రెజీనా కసాండ్రా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడి చర్చల్లో నిలిచారు. దశాబ్దానికి పైగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన రెజీనా, 2019లో ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా అనే సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ లో తన ప్రయాణం తాను ఊహించినంత సులభంగా సాగలేదని, హిందీ భాషపై తాను పూర్తి పట్టు కలిగి ఉన్నా, మాట్లాడటంతో పాటూ హిందీ రాయగలిగినా, వేరే సినిమాల్లో ఇతర హీరోయిన్లలాగా తాను డబ్బింగ్ ఆర్టిస్టులను వినియోగించుకోకపోయినా, తన డబ్బింగ్ తానే స్వయంగా చెప్పుకున్నప్పటికీ, బాలీవుడ్ లో తాను పూర్తిగా కలిసిపోయాననే ఫీలింగ్ కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బయటి వ్యక్తిలా అనిపించేది
సౌత్ నుంచి వచ్చిన నటిగా తనను కొందరు వేరేలా చూశారని, తన నేపథ్యాన్ని తక్కువ చేసి చూసిన సందర్భాలు కూడా ఎదురయ్యాయని రెజీనా తెలిపారు. కొందరి ప్రవర్తన, మాట్లాడే తీరు తనను అసౌకర్యానికి గురి చేసిందని, అవన్నీ తనను ఒక బయటి వ్యక్తిలా చూపించేవని, వేరే పరిశ్రమ నుంచి వచ్చానని భావించి కొందరు తనను దూరంగా పెట్టారని కూడా రెజీనా వ్యాఖ్యానించారు.
అందరూ ఒకేలా ఉండరు
అయితే బాలీవుడ్ మొత్తం అలాంటిదే కాదని కూడా రెజీనా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అందరూ ఒకేలా ఉండరని, తనకు మద్దతుగా నిలుస్తూ, గౌరవించిన వాళ్లు కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. కొత్త వాతావరణం, కొత్త పని విధనం, కొత్త వ్యక్తులతో కలిసి వర్క్ చేయడం మొదట్లో భయాన్ని, టెన్షన్ ను కలిగించిందని చెప్పిన రెజీనా, పని చేసిన ప్రతీ ఇండస్ట్రీలోనూ తాను సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
అనుభవాలు ఎన్నో నేర్పాయి.
ఒకసారి ఒక రకమైన పాత్రలో కనిపిస్తే, అదే ఇమేజ్ పడిపోతుందని, ఇండస్ట్రీలో మహిళల విషయంలో ఇదెక్కువగా కనిపిస్తుందని, అందుకే కమర్షియల్ సినిమాలకే పరిమితమవకుండా, విభిన్న పాత్రలు చేయాలనే తపన తనలో ఎప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు. 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన రెజీనా, ఇప్పుడు 35 ఏళ్ల వయసులో తన అనుభవాలతో ఎంతో నేర్చుకున్నట్టు చెప్తున్నారు. ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదని, తాను చాలా కూల్ పర్సన్ అయినప్పటికీ కొన్నిసార్లు మనసులోని అనుభవాలు మనపై ప్రభావం చూపుతాయని, నేర్చుకుంటూ, మర్చిపోతూ, మళ్లీ నేర్చుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నానని రెజీనా చెప్పుకొచ్చారు. మొత్తానికి రెజీనా ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, టాలెంట్ కు లిమిట్స్ ఉండవని ప్రూవ్ చేస్తున్నారు.
