Begin typing your search above and press return to search.

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

సెలబ్రిటీల జీవితాలు బయటికి ఎంతో విలాసవంతంగా కనిపించినా, వారి వైవాహిక బంధాల్లోనూ ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. కెరీర్ బిజీతో కలిసి గడిపే సమయం తగ్గడం, ఇగో, ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియా ట్రోల్స్, రూమర్లు, పబ్లిక్ ప్రెజర్ వంటివి విభేదాలకు కారణమవుతున్నాయని చర్చ జరుగుతోంది. ఇష్టం లేని బంధంలో కొనసాగడం కంటే పరస్పర గౌరవంతో విడిపోవడమే మేలని కొందరు భావిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   18 Nov 2026 6:00 PM IST
అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!
X

బయటి నుంచి చూసేవారికి సెలబ్రిటీల జీవితాలు ఎంతో కలర్‌ఫుల్‌గా ఏ లోటూ లేని స్వర్గంలా కనిపిస్తాయి. కోట్ల రూపాయల సంపాదన.. విలాసవంతమైన బంగ్లాలు.. దేశవిదేశాల్లో విహారయాత్రలు.. ఇవన్నీ చూసి వీరికేం తక్కువ! ఎంతో సంతోషంగా ఉన్నార‌ని సామాన్యులు అనుకుంటారు. కానీ ఆ మెరుపుల వెనుక ఉన్న అసలు నిజం వేరుగా ఉంటోంది. ఎంతో ప్రేమించుకుని అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఎందరో స్టార్ జంటలు.. కొన్నేళ్లకే విడిపోతున్నామంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తుంటారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు విడాకుల ట్రెండ్ పెరగడం వెనుక అసలు కారణాలు ఏమై? ఉంటాయి అన్న దానిపై ప్రేక్ష‌కుల్లో నిత్యం చ‌ర్చ జ‌రుగుతుంటుంది. అందుకు గ‌ల కార‌ణాలు వ్య‌క్తిగ‌త‌మే అయినా? వాటి గురించి ఆలోచించాల్సిన అవ‌సరం అంతే ఉంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

సెలబ్రిటీల వైవాహిక జీవితంలో విభేదాలు రావడానికి ప్రధాన కారణం సమయం లేకపోవడం. ఇద్దరూ కెరీర్లలో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు షూటింగ్‌లు.. ప్రమోషన్లు.. టూర్ల అంటూ ఏడాదిలో సగం రోజులు వేర్వేరు ప్రాంతాల్లో గడపాల్సి వస్తుంది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే తీరిక కూడా దొరకని పరిస్థితుల్లో ఆ బంధంలో ఆత్మీయత మెల్లమెల్లగా తగ్గుతుంది. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుగా లేనప్పుడు వారి మధ్య తెలియకుండానే పెద్ద అగాధం ఏర్పడుతోంది.

రెండో ముఖ్యమైన అంశం ఇగో ..ఆర్థిక స్వాతంత్రం. నేటి తరం హీరోయిన్లు.. మహిళా సెలబ్రిటీలు ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటున్నారు. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకపోవడంతో చిన్నపాటి సర్దుబాట్లు చేసుకోవడానికి కూడా సిద్ధపడటం లేదు. ఇద్దరికీ సమానమైన ఫేమ్, డబ్బు ఉన్నప్పుడు నా మాటే నెగ్గాలనే ధోరణి పెరుగుతోంది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే పెద్దలు కూర్చుని సర్దిచెప్పేవారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో ఎవరి దారి వారు చూసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.

దీనికి తోడు సోషల్ మీడియా .. పబ్లిక్ ప్రెజర్ కూడా బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న‌ది అంతే నిజం. సెలబ్రిటీలు ఏం చేసినా? ఎవరితో మాట్లాడినా? వెంటనే గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్.. రూమర్లు అనుమానాలకు దారితీస్తున్నాయి. నిజానిజాలు తెలుసుకునే లోపే బయటి వ్యక్తుల మాటలు వారి మనసుల్లో విషం నింపుతున్నాయి. సామాన్యుల ఇంట్లో గొడవ జరిగితే నాలుగు గోడల మధ్యే ముగుస్తుంది. కానీ స్టార్స్ విషయంలో అది బ్రేకింగ్ న్యూస్ అవ్వడంతో వారు మరింత ఒత్తిడికి గురవుతున్నారు.

మారుతున్న జీవనశైలి ..ఆలోచనా విధానం కూడా విడాకులకు దారితీస్తోంది. ఇష్టం లేని బంధంలో బలవంతంగా కొనసాగుతూ మానసిక క్షోభ అనుభవించడం కంటే గౌరవప్రదంగా విడిపోయి ఎవరి జీవితాన్ని వారు సంతోషంగా గడపడం మేలని నేటి స్టార్స్ భావిస్తున్నారు. ప్రేమతో మొదలైన ప్రయాణం అభిప్రాయ భేదాలతో ముగిసిపోవడం అభిమానులకు బాధ కలిగించినా? వ్యక్తిగత ప్రశాంతత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది కాదనలేని వాస్తవం.