Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం 'భజ గోవిందం'.. ఉన్నంతలో బతికితే అదే సుఖం

ఈ పాటకు ప్రాణం పోసింది ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మి గాత్రం. ఆమె పలికించిన సాంప్రదాయ శైలి ఆలాపన పాటకు ఒక ప్రత్యేకమైన ఎట్రాక్షన్ ను తెచ్చిపెట్టింది.

By:  M Prashanth   |   22 Oct 2026 6:47 PM IST
కిరణ్ అబ్బవరం భజ గోవిందం.. ఉన్నంతలో బతికితే అదే సుఖం
X

హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టాడు. స్వయంగా కథ రాసి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ డ్రామా 'రియాలిటీ'. మధ్యతరగతి జీవితాల్లో ఉండే సున్నితమైన భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా 'భజ గోవిందం' అనే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు.

ఉదయాన్నే హోటల్ షట్టర్లు తెరుచుకోవడం, సాంబారు పొగలు, అరటి ఆకుల చప్పుడుతో మొదలయ్యే ఈ పాట పక్కా లోకల్ జీవన విధానాన్ని హైలెట్ చేస్తోంది. 'ఆనందం వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్' లో కిరణ్ అబ్బవరం భోజనం వడ్డిస్తూ కనిపించే సన్నివేశాలు చాలా సహజంగా కుదిరాయి. ఆర్భాటాలు లేని సాధారణ రోజువారీ జీవితాన్ని తెరపై చూపిస్తూనే, ఆ రొటీన్ లో ఉండే చిన్న చిన్న సంతోషాలను ఈ విజువల్స్ ద్వారా ఎలివేట్ చేశారు.

ఈ పాటకు ప్రాణం పోసింది ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మి గాత్రం. ఆమె పలికించిన సాంప్రదాయ శైలి ఆలాపన పాటకు ఒక ప్రత్యేకమైన ఎట్రాక్షన్ ను తెచ్చిపెట్టింది. సనారే అందించిన సాహిత్యం కూడా నేటి పోటీ ప్రపంచంలో పరుగులు తీసే వారికి ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది. "ఉన్నంతలో మనకున్నంతలో బతికితే అదే సుఖము.. చాలీ చాలని ఆశల నడుమన చాల్లే అని చూడు" అంటూ రాసిన లైన్స్ మధ్యతరగతి తృప్తిని తెలియజేస్తూ ఆలోచింపజేస్తున్నాయి.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ట్యూన్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. భారీ డ్రమ్స్ జోలికి వెళ్లకుండా శాస్త్రీయ అంశాలతో పాటు స్థానిక వాయిద్యాలను కలగలిపి స్వరపరిచిన విధానం వినగానే నచ్చేలా ఉంది. కథలోని సహజత్వాన్ని దెబ్బతీయకుండా, విజువల్స్ కు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా ఆయన కంపోజిషన్ తోడ్పడింది.

నటన పరంగా కిరణ్ అబ్బవరం తన పరిధిలో చాలా ఈజ్ తో కనిపించాడు. స్నేహితులతో సరదాగా గడపడం, ఇంట్లో పనులు చూసుకోవడం లాంటి క్యారెక్టరైజేషన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది. దేవికా భట్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటిసారి డైరెక్షన్ వైపు అడుగులేసిన కిరణ్, ఎమోషన్స్ ను ఎంతవరకు గ్రిప్పింగ్ గా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ 'భజ గోవిందం' పాట సినిమాపై ఒక పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చింది. పాట క్యాచీగా ఉండటంతో పాటు ఒక ప్రశాంతమైన ఫీల్ ను అందించడంలో సక్సెస్ అయింది. రాబోయే డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.