RC17 మ్యూజిక్ మారితే.. సుకుమార్ టేకింగ్ మారినట్టే!
RC17 సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ వర్క్ చేయకపోవచ్చనే ప్రచారం కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 13 Sept 2026 4:00 AM ISTసుకుమార్ సినిమా అంటే కథ, పాత్రలు, స్క్రీన్‌ప్లేతో పాటు సంగీతానికి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా సాంగ్స్ ను కథలో భాగంగా మలచడం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సీన్స్ ఇంపాక్ట్‌ను పెంచడం ఆయన సినిమాల్లో కనిపించే స్పెషాలిటీ. ఈ విషయంలో సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లోప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆర్యతో మొదలైన వీరి ప్రయాణం 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప2 వరకు ఎన్నో మ్యూజికల్ హిట్స్‌ను అందించింది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్‌తో సుకుమార్ తెరకెక్కించనున్న RC17 విషయంలో మ్యూజిక్ టీమ్‌పై జరుగుతున్న డిస్కషన్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
RC17 సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ వర్క్ చేయకపోవచ్చనే ప్రచారం కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే ఈ టాక్ నిజమైతే మాత్రం మారేది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ పేరు మాత్రమే కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సుకుమార్ సినిమాల్లో సంగీతం అనేది ప్రత్యేకంగా బయట నుంచి జత చేసే అంశం కాదు. కథలోని ఎమోషన్, పాత్రల స్వభావం, సన్నివేశాల టెంపోకు అనుగుణంగా మ్యూజిక్ కూడా ఆయన మేకింగ్‌లో భాగంగానే కనిపిస్తుంది. పైగా నేను ఇంత బాగా సినిమా తీస్తున్నా అంటే, దాంట్లో తన ఫ్రెండ్ దేవీశ్రీ ప్రసాద్ కు మేజర్ క్రెడిట్ దక్కుతుందనే విషయాన్ని సుకుమార్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.
పుష్ప, పుష్ప2తో సుకుమార్ సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత ఆయన మ్యూజిక్ ట్రీట్‌మెంట్‌పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. కానీ పుష్ప2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీరికార్డింగ్ విషయంలో సుక్కు- దేవీశ్రీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే ఎన్ని వార్తలొచ్చినా, పుష్ప2 సక్సెస్ మీట్ లో దేవీని మళ్లీ సుకుమార్ పొగిడి రూమర్లకు చెక్ పెట్టారు.
ఇప్పుడదే నేపథ్యంలో RC17 మ్యూజిక్ విషయంలో మార్పు ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ వాస్తవానికి దేవీశ్రీ ప్రస్తుతం తాను హీరోగా పరిచయమవుతూ ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైమ్ లో వేరే భారీ సినిమాలను ఒప్పుకుంటే ఎల్లమ్మ ఆలస్యమయ్యే అవకాశమున్నందున సుకుమార్, దేవీశ్రీ ఇద్దరూ మాట్లాడుకుని ఫ్రెండ్లీగా డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే దేవీశ్రీ ప్లేస్ లో ఎవరొస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా సినిమాల్లో సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో అనిరుధ్ రవిచందర్ పేరు ఇప్పటికే అభిమానుల డిస్కషన్స్ లో కనిపిస్తోంది. ఫైనల్ డెసిషన్ ఏదైనా, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తో సుకుమార్ తన మేకింగ్‌ను ఎంతవరకు మార్చుకుంటారన్నదే అసలు ప్రశ్న. రంగస్థలం తర్వాత చరణ్‌తో మరోసారి కలుస్తున్న సుకుమార్.. ఈసారి కథకు తగ్గ కొత్త సౌండ్‌ను మాత్రమే కాదు, తన సినిమాను చూపించే విధానంలోనూ కొత్త అనుభూతిని తీసుకురాబోతున్నారా అన్న ఆసక్తి నెలకొంది.
