టాప్ స్టోరి: సుక్కూకి చరణ్ ఎందుకు అంత ఎలివేషన్ ఇస్తున్నారు?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ల బంధం కేవలం ఒక హీరో-డైరెక్టర్ అనే బంధం కంటే చాలా పెద్దదనే విషయం మరోసారి స్పష్టమైంది.
By: Sivaji Kontham | 24 Jun 2026 12:45 PM ISTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ల బంధం కేవలం ఒక హీరో-డైరెక్టర్ అనే బంధం కంటే చాలా పెద్దదనే విషయం మరోసారి స్పష్టమైంది. తాజాగా జరిగిన ఒక వేదికపై చరణ్ మాట్లాడుతూ..``నేను నాన్నగారికి కూడా చెప్పలేని ఎన్నో విషయాలను... మనసులోని మాటలను సుక్కూ సార్‌తో షేర్ చేసుకుంటాను`` అంటూ సుకుమార్‌కు భారీ ఎలివేషన్ ఇచ్చారు. దీంతో అసలు చరణ్ అప్పటి నుండి సుక్కూకు అంతలా ఎందుకు కనెక్ట్ అయిపోయారు? ఆయనకు ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు? అనే చర్చ టాలీవుడ్‌లో జోరందుకుంది. దీని వెనుక ప్రధాన కారణం సుకుమార్‌కు నటులలోని ఉత్తమ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లగల సామర్థ్యం ఉండటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చరణ్ ఒక నటుడిగా కెరీర్ పరంగా ఒడిదుడుకుల్లో ఉన్నా సుకుమార్ సలహా తీసుకుంటానని తెలిపారు.
నిజానికి, సుకుమార్ ఒక నటుడిని ఎంత గొప్పగా ఆవిష్కరించగలరో చెప్పడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీరే నిదర్శనం. ఆర్య, ఆర్య 2 చిత్రాలతోనే అల్లు అర్జున్‌ను నేషనల్ లెవెల్ నటుడి రేంజ్‌లో సుక్కూ ప్రెజెంట్ చేశారు. ఆ తర్వాత `రంగస్థలం` చిత్రంతో రామ్ చరణ్‌లోని జాతీయ ఉత్తమ నటుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ సినిమాలో చరణ్ నటనకు నేషనల్ అవార్డు కచ్చితంగా వస్తుందని సుకుమార్ సహా ఆడియెన్ కూడా భావించారు. కానీ దురదృష్టవశాత్తూ అప్పట్లో అది మిస్ అయింది. అయితే ఇప్పుడు తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ `RC17`తో ఎలాగైనా రామ్ చరణ్‌లోని ఆ ఉత్తమ నటుడిని జాతీయ స్థాయిలో ఎలివేట్ చేసి తీరాలనే పట్టుదలతో సుకుమార్ ఉన్నట్లు అర్థమవుతోంది.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ల నటనకు జాతీయ పురస్కారాలు దక్కకపోవడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. `ఆర్య` రోజుల నుండి `రంగస్థలం` వచ్చే వరకు... `ఆర్య`కు పూర్వం ఎందరో దిగ్గజ నటులు ఏలిన రోజుల్లోనూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి కూడా కేంద్రంలోని అవార్డు జూరీలు తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలతో రాజకీయ సాన్నిహిత్యం, స్నేహం సరిగ్గా ఉండి ఉంటే.. మన నటులకు ఎప్పుడో అవార్డులు పుట్టుకొచ్చేవనే వాదన కూడా ఉంది. ఒక ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఢిల్లీ వేదికలపై దశాబ్దాలుగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను స్వేచ్ఛగా ప్రశ్నించిన తర్వాతే కేంద్రంలోని పాలకులకు అసలు విషయం అర్థమైంది.
చిరంజీవి గళం విప్పిన తర్వాతే కేంద్రంలో కదలిక వచ్చి ఆయనను `పద్మవిభూషణ్` పురస్కారంతో గౌరవించారు. ఆ తర్వాతే `పుష్ప` సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌ను వెతుక్కుంటూ `జాతీయ ఉత్తమ నటుడు` అవార్డు దక్కింది. టాలీవుడ్‌కు జాతీయ స్థాయిలో `పురస్కారాల్లో ప్రాధాన్యతా గుర్తింపు`ను తేవడంలో చిరంజీవి చేసిన ప్రయత్నం... సుకుమార్ చూపించిన ప్రతిభ (పుష్ప చిత్రంలో నటనకు గాను బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ దక్కింది) ఎంతో కీలకపాత్ర పోషించాయి. మునుముందు కూడా టాలీవుడ్ నుండి ప్రముఖ నటీనటులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలతో మెప్పించేందుకు పోటీపడుతుండటంతో కేంద్రం నుండి మనవాళ్లు మరిన్ని పురస్కారాలు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం `RC17`తో రామ్ చరణ్ కూడా ఈ నేషనల్ అవార్డ్ రేసులోకి బలంగా దూసుకొస్తున్నారు. అందుకే చరణ్ కి సుకుమార్ అంటే అంత నమ్మకం.. ప్రత్యేక గౌరవం. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన RC17 గురించి లీకులు ఇవ్వమని ఫ్యాన్స్ ఎంతగా అడుగుతున్నా.. `చెప్పను గాక చెప్పను` అంటూ సుకుమార్ మొండికేస్తున్నారు. పైగా `మీరే ఊహించుకోండి!` అంటూ `పెద్ది` సక్సెస్ వేదికపై ఫ్యాన్స్‌ను అదే పనిగా టీజ్ చేశారు. ఏదేమైనా 2026-27 సీజన్‌లో చరణ్ - సుకుమార్ ల కాంబినేషన్ మూవీ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది.. ఈ దశలో జాతీయ అవార్డు రేంజ్ సినిమాను ప్రేక్షకులు ఆశించవచ్చని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
