ఈ దుర్వార్త వినగానే 99వ సినిమా సెట్లో ఉలిక్కిపడ్డ విశాల్ టీమ్
ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
By: Sivaji Kontham | 5 May 2026 11:35 PM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి ఉదయపూర్ సమీపంలో జరిగిన ఒక ఘోర కారు ప్రమాదంలో కన్నుమూశారనే వార్త పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
అయితే అకస్మాత్తుగా యాక్సిడెంట్ వార్త వినగానే సెట్లో ఉన్న విశాల్ బృందం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారని సమాచారం. ఈరోజు సాయంత్రం తమ చిత్ర నిర్మాతకు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలయ్యాయనే వార్త అందరినీ కలవరపాటుకు గురి చేసింది. ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లో విశాల్ హీరోగా 99వ చిత్రం `మకుటం` నిర్మాణంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా చౌదరి మరణవార్త తెలియడంతో చిత్ర యూనిట్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. షూటింగ్ సెట్‌లో వెంటనే సంతాప సభను నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం షూటింగ్ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మృతికి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
ఇంకా ప్రమాదానికి కారణాలేమిటో తెలియలేదు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇతర వ్యక్తుల పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చౌదరి మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లో `సూపర్ గుడ్ ఫిలింస్` బ్యానర్‌ను స్థాపించి సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన చౌదరి విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన `పుదు వసంతం` చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తమిళనాడు రాష్ట్ర అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత కె.ఎస్. రవికుమార్ తొలి చిత్రం `పురియాద పుదిర్`కు నిర్మాతగా మద్ధతునిచ్చారు. సూర్యవంశం, పూవే ఉనక్కాగా, నట్టమై, నందనం, జిల్లా వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. ఇటీవల ఆయన `మరీసన్` చిత్రాన్ని కూడా తెరకెక్కించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోను ఆర్.బి. చౌదరి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్ వంటి అగ్ర హీరోలతో పనిచేసి రాజా, నువ్వు వస్తావని, స్నేహం కోసం, పండగ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆయనతో కలిసి పనిచేసిన నిర్మాత ఎన్.వి. ప్రసాద్ చౌదరిని ఒక `దైవ సమానుడు` అని, తాను చూసిన అత్యంత క్రమశిక్షణ గల నిర్మాత అని కొనియాడారు. ఆర్.బి.చౌదరి మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో స్నేహం కోసం, గాడ్ ఫాదర్ (ఎన్.వి. ప్రసాద్‌తో కలిసి 2022లో ) వంటి చిత్రాలను ఆర్.బి. చౌదరి నిర్మించారు. ఒక నిర్మాత కేవలం డబ్బు పెట్టుబడిగా పెట్టడమే కాకుండా సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం .. దర్శకులను ప్రోత్సహించడం ద్వారా సినిమా విజయంలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తారో ఆర్.బి. చౌదరి సినీ ప్రస్థానం వెల్లడిస్తుంది.
సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో వస్తున్న 99 వ చిత్రం `మకుటం` ప్రస్తుతం సెట్స్ లో ఉంది. ఇంకా పలు చిత్రాలను నిర్మించేందుకు చౌదరి గారు మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. అయితే ఇంతలోనే ప్రమాదం ఆయనను కానరాని లోకాలకు తీసుకుని వెళ్లింది.
