Begin typing your search above and press return to search.

చిరంజీవితో కల నెరవేరినా రజనీతో నెరవేరలేదు.. నెరవేరే లోగానే..!

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దిగ్గజ నిర్మాత ఆర్‌బీ చౌదరి ఆక‌స్మిక‌ మరణం సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   7 May 2026 11:00 PM IST
చిరంజీవితో కల నెరవేరినా రజనీతో నెరవేరలేదు.. నెరవేరే లోగానే..!
X

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దిగ్గజ నిర్మాత ఆర్‌బీ చౌదరి ఆక‌స్మిక‌ మరణం సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగ‌తి తెలిసిందే. నాలుగు దశాబ్దాలకు పైగా `సూపర్ గుడ్ ఫిలిమ్స్` బ్యానర్‌పై వందలాది మందికి ఉపాధినిచ్చి.. ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన ఆయన ప్రస్థానం ఒక అద్భుతం. అయితే తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఇద్దరు లెజెండరీ హీరోలతో సినిమాలు తీయాలన్న ఆయన కలల్లో ఒకటి నెరవేరినా.. మరొకటి అసంపూర్తిగానే మిగిలిపోవడం విచారకరం.

మెగాస్టార్ చిరంజీవితో ఉన్న స్నేహంతో ఆయన `స్నేహం కోసం`, `గాడ్ ఫాదర్` వంటి చిత్రాలను నిర్మించి తన ముచ్చట తీర్చుకున్నారు కానీ తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఒక్క సినిమా కూడా నిర్మించలేకపోయాననే వెలితి ఆయనలో ఎప్పుడూ ఉండేది. తన 100వ సినిమాను రజనీకాంత్‌తోనే తీసి ఆ అపురూప మైలురాయితో చిత్ర పరిశ్రమ నుండి గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలని ఆయన బలంగా ఆశించారు. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ చౌదరి గారి అంతిమ సంస్మరణ సభలో ఎంతో భావోద్వేగంతో వెల్లడించారు.

`జైలర్ 2` షూటింగ్ సమయంలో ఆర్‌బీ చౌదరి స్వయంగా రజనీకాంత్‌ను కలిసి తన మనసులోని మాటను చెప్పారు. ``నేను ఇప్పటివరకు 99 సినిమాలు నిర్మించాను.. నా 100వ సినిమా మీతో చేసి రిటైర్ అవుతాను`` అని ఆయన కోరగా రజనీ ఏమాత్రం ఆలోచించకుండా ``తప్పకుండా 100 శాతం మీతో ఆ సినిమా చేస్తాను`` అని మాటిచ్చారు. ఆ అద్భుత క్షణం కోసం ఇద్దరూ ఎదురుచూస్తుండగానే రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆర్‌బీ చౌదరిని అర్థాంతరంగా ప‌రిశ్ర‌మ‌కు దూరం చేసింది. పశువులు అడ్డు రావడంతో జరిగిన కార్ క్రాష్ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలారు.

ఇక ఆర్‌బీ చౌదరి గురించి మాట్లాడిన రజనీకాంత్.. ఆయన నిర్మాతగానే కాదు, షూటింగ్ సెట్స్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా అందరినీ కూల్‌గా నడిపించే అరుదైన వ్యక్తిత్వమని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే స్వయంగా రంగంలోకి దిగి ఎంతో నింపాదిగా కాఫీ తాగుతూ సమస్యలను పరిష్కరించే చౌద‌రి గారి శైలి ఎందరికో ఆదర్శం అని గుర్తు చేసారు. త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ఆల్ టైమ్ హిట్స్ అందించిన ఆర్.బి.చౌద‌రి తన బ్యానర్ లో వేలాది మంది టెక్నీషియన్లకు ఉపాధి కల్పించి `దర్శకుల గాడ్ ఫాదర్`గాను పేరు తెచ్చుకున్నారు. సీనియ‌ర్ నిర్మాత చౌద‌రి కృషిని గౌరవిస్తూ భారీ సన్మానం చేయాలని ప‌రిశ్ర‌మ భావించినా అది సాకారం కాకముందే ఈ విషాదం చోటుచేసుకుంది.

నిర్మాతగా ఆర్‌.బి.చౌద‌రి ప్రస్థానం 99 చిత్రాల వద్దే నిలిచిపోయింది. కానీ ఆయన అందించిన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, క‌మ‌ల్ హాస‌న్ వంటి అగ్ర హీరోలు ఆయన మృతికి నివాళులర్పించగా.. మమ్ముట్టి, ధనుష్, విజయ్ వంటి దక్షిణాది అగ్ర నటులందరూ తరలిరావడం ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న గౌరవానికి నిదర్శనం. రజనీకాంత్‌తో సినిమా చేయాలన్న ఆ చివరి కల నెరవేరకుండానే ఆయన వెళ్లిపోవడం సినీ చరిత్రలో ఒక తీరని వెలితిగా మిగిలిపోతుంది.