Begin typing your search above and press return to search.

50 ఏళ్లు ఇండస్ట్రీకి ఇచ్చిన నటుడికి 50 నిమిషాలు కేటాయించలేరా?

బాలివుడ్ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ (75) క్యాన్సర్ తో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసిన సంగ‌త తెలిసిందే.

By:  Srikanth Kontham   |   27 Sept 2026 6:00 PM IST
50 ఏళ్లు ఇండస్ట్రీకి ఇచ్చిన నటుడికి 50 నిమిషాలు కేటాయించలేరా?
X

బాలివుడ్ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ (75) క్యాన్సర్ తో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసిన సంగ‌త తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు రాజ్‌పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా, అను కపూర్, రజత్ బేడీ, సులభా ఆర్య, అనీస్ బజ్మీ వంటి పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు హాజరై నివాళు లర్పించారు.

అయితే ఈ కార్యక్రమానికి పరిశ్రమలోని అగ్ర నటులు, పెద్ద స్టార్లు ఎవరూ రాకపోవడం తీవ్ర చర్చనీ యాంశమైంది.

ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు రజా మురాద్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను పంచుకుంటూ బాలివుడ్ అగ్ర తారల వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఆప్తమిత్రుడైన ముష్తాక్ ఖాన్‌కు చివరి సాగనంపు ఇవ్వడానికి ఎందరో సహనటులు వచ్చినా? స్టార్లు అని పిలిపించుకునే ప్రముఖులెవరూ రాకపోవడం తీవ్ర విచారకరమని వాపోయారు. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్లతో కలిసి పనిచేసిన ముష్తాక్ ఖాన్‌ను చివరిసారి చూడటానికి ఒక్క పెద్ద నటుడు కూడా రాకపోవడంపై మండిపడ్డారు.

`ఏదైనా పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడి పెళ్లి ఉంటే మాత్రం వీరంతా హాజరుకావడమే కాకుండా అక్కడ వడ్డించే వెయిటర్లలా సేవలు చేయడానికి కూడా వెనుకాడరు. లేదా ఏదైనా రాజకీయ పార్టీ పిలుపునిస్తే వెంటనే అక్కడ వాలిపోతారు. కానీ చిత్ర పరిశ్రమకే త‌న‌ జీవితంలో 50 సంవత్సరాల కాలాన్ని ధారపోసిన ఒక నటుడికి కనీసం 50 నిమిషాల సమయాన్ని కూడా కేటాయించలేకపోయారా? అని నిలదీశారు.

ముష్తాక్ ఖాన్ ఎవరినీ కాకా పట్టకుండా స్వయంకృషితోనే పరిశ్రమలో గొప్ప పేరు తెచ్చుకున్నారని రజా మురాద్ గుర్తుచేశారు. తన నటన, ప్రతిభ ఆధారంగానే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, జీవితంలో కానీ, మరణంలో కానీ ఆయనకు ఎవరి మద్దతు అవసరం లేద‌న్నారు. అయినా? ఆయనతో కలిసి నటించిన స్టార్లు ఎవరూ చివరి చూపుకు రాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అగ్ర నటులను ఉద్దేశించి రజా మురాద్ ఓ హెచ్చరిక కూడా చేశారు.

ఈ రోజు మీకున్న పేరు, ప్రఖ్యాతులు, సంపాదించిన డబ్బు ఏవీ శాశ్వతం కావని, ఏదో ఒక రోజు అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయని గుర్తు చేశారు. తోటి కళాకారులకు గౌరవం ఇవ్వలేని హోదా వ్యర్థమని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు.