Begin typing your search above and press return to search.

చెంప వాచిపోయినా బామ్ రాసుకుని మ‌రీ త‌న్నులు తిన్నాడు!

'పద్మావత్' సినిమాలో అలావుద్దీన్ ఖిల్జీ పాత్ర కోసం రణ్‌వీర్ సింగ్ చూపిన అంకితభావాన్ని నటుడు రజా మురాద్ ప్రశంసించారు. ఓ సన్నివేశం సహజంగా రావడం కోసం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 24 రీటేకులు తీసుకోగా, రజా మురాద్ రణ్‌వీర్‌ను నిజంగానే 24 సార్లు కొట్టారట. దీంతో ఆయన చెంప వాచిపోయినా రణ్‌వీర్ సీన్ పూర్తి చేశారని గుర్తుచేసుకున్నారు.

By:  Srikanth Kontham   |   25 Nov 2026 8:00 PM IST
చెంప వాచిపోయినా బామ్ రాసుకుని మ‌రీ త‌న్నులు తిన్నాడు!
X

పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడే నటులలో రణ్‌వీర్ సింగ్ ముందుంటారు. ఎలాంటి పాత్ర‌లోనైనా అవ‌లీల‌గా ఓదిగిపోయే న‌టుడు. తాజాగా `పద్మావత్` లో అలావుద్దీన్ ఖిల్జీ పాత్ర కోసం ర‌ణ‌వీర్ పడిన శ్రమ గురించి ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి 21 రోజుల పాటు ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా గడిపినట్లు రణ్‌వీర్ గతంలో వెల్లడించారు. తాజాగా ర‌ణ‌వీర్ సహనటుడు రజా మురాద్ షూటింగ్ సమయంలో జరిగిన మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

`పద్మావత్` చిత్రంలోని ఓ సన్నివేశం కోసం తన చేతితో రణ్‌వీర్ సింగ్‌కు ఏకంగా 24 సార్లు నిజమైన దెబ్బలు కొట్టాల్సి వచ్చిందని రజా మురాద్ తెలిపారు. తెరపై ఆ సన్నివేశం మరింత సహజంగా.. ప్రభావవంతంగా కనిపించాలని భన్సాలీ భావించడంతో రీటేకులు తీసుకున్నారట. అన్నిసార్లు దెబ్బలు తగిలినా రణ్‌వీర్ ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా? ఓపికగా ఆ సీన్‌ను పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు.

24 దెబ్బలూ నిజంగానే కొట్టానని స్పష్టం చేశారు. ఆశించిన స్థాయిలో శబ్దం.. ప్రభావం రాకపోవడంతో భన్సాలీ 24 రీటేకులు తీసుకున్నారని రణ్‌వీర్ ఎలా ఫీలవుతారనే విషయాన్ని పట్టించుకోకుండా `రజా.. కొట్టండి.. ఇంకోసారి కొట్టండి` అంటూ పదేపదే చెప్పారని వివరించారు. చివరికి రణ్‌వీర్ చెంప బాగా వాచిపోయిందని కేవలం ఆత్మస్థైర్యంతోనే నిలబడినట్లు ఆయనే స్వయంగా చెప్పారన్నారు.

షూటింగ్ సమయంలో రణ్‌వీర్ చూపించిన‌ అంకితభావాన్ని రజా మురాద్ ప్రత్యేకంగా ప్రశంసించారు. చాలా వినయంగా.. సరదాగా ఉండే రణ్‌వీర్.. షూటింగ్ జరుగుతున్నంత సేపు మాత్రం ఎవరితోనూ మాట్లాడరన్నారు. బోనులో ఉన్న సింహంలా పాత్రలోనే లీనమై తిరుగుతుంటారని.. షాట్ ఇచ్చే సమయంలో కంటి చూపు పరిధిలో ఎవరూ ఉండకుండా జాగ్రత్త తీసుకుంటారని.. హిందీ సినిమా చరిత్రలో అలాంటి ప్రతిభావంతులైన నటులు చాలా అరుదని కొనియాడారు.

2018లో విడుదలైన `పద్మావత్` చిత్రంలో దీపికా పదుకొణె రాణి పద్మావతిగా.. షాహిద్ కపూర్ మహారావల్ రతన్ సింగ్‌గా నటించగా.. రణ్‌వీర్ సింగ్ అలావుద్దీన్ ఖిల్జీ పాత్రలో కనిపించారు. మాలిక్ ముహమ్మద్ జయసీ రాసిన `పద్మావత్` కావ్యం ఆధారంగా రూపొందిన చారిత్రక చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే.