రవితేజను బెదిరించిన కృష్ణవంశీ.. అసలేం జరిగిందంటే?
రవితేజ మాట్లాడుతూ.." నేను ఇండస్ట్రీలోకి నటుడు కావాలనే వచ్చాను. కానీ కెరియర్ ఆరంభంలో చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు.
By: Madhu Reddy | 12 Oct 2025 6:00 PM ISTమాస్ మహారాజా రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో కష్టపడి పేరు తెచ్చుకున్న హీరోగా రికార్డ్ సృష్టించారు రవితేజ. అలాంటి ఈయన ఇప్పుడు నటిస్తున్న చిత్రం 'మాస్ జాతర'. అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు.
ఒకవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకవైపు చిత్ర బృందం ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అందులో భాగంగానే హీరో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. మాస్ మహారాజా రవితేజ కూడా తన సినిమా మాస్ జాతర ప్రమోషన్స్ కోసం కంబైన్డ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగానే తనను డైరెక్టర్ కృష్ణవంశీ బెదిరించారు అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి రవితేజ చెప్పిన ఉద్దేశం ఏమిటి? ఎందుకు అలా అనాల్సి వచ్చింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
రవితేజ మాట్లాడుతూ.." నేను ఇండస్ట్రీలోకి నటుడు కావాలనే వచ్చాను. కానీ కెరియర్ ఆరంభంలో చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ముఖ్యంగా వరుస రిజెక్షన్లు ఎదురయ్యాయి .దీనికి తోడు రెకమెండేషన్ వల్ల అర్హత లేని వాళ్ళకి కూడా మంచి పాత్రలు ఇచ్చేవాళ్లు. దాంతో నటుడిగా ప్రయత్నించడం ఆపేసి , అసిస్టెంట్ డైరెక్టర్గా మారాను. అయితే నిన్నే పెళ్లాడతా సినిమాకి నేను ఏడిగా పని చేస్తున్నప్పుడే సింధూరం సినిమాలో నాకు హీరోగా అవకాశం ఇస్తానని కృష్ణవంశీ మాట ఇచ్చారు. కానీ అప్పటికే తగిలిన ఎదురు దెబ్బల వల్ల కృష్ణవంశీ మాటలు నేను నమ్మలేదు. అందుకే నిన్నే పెళ్లాడతా సినిమాలో ఒక పాత్ర చేయమని కృష్ణవంశీ నన్ను అడిగితే నేను చేయను అని చెప్పాను.. దీంతో ఈ సినిమాలో నటిస్తావా లేక సింధూరం సినిమా నుంచి తీసేయమంటావా అని నన్ను కృష్ణవంశీ బెదిరించాడు.
ఇక పదేపదే సింధూరం సినిమాలో నటించడం గురించి నాతో మాట్లాడడంతో.. నిజంగానే నాతో సినిమా తీస్తాడనే నమ్మకం కలిగి నిన్నే పెళ్లాడతా సినిమాలో చేశాను. ఈ సినిమా తర్వాతే నాకు సింధూరం సినిమాలో కృష్ణవంశీ హీరోగా అవకాశం ఇచ్చి.. మాట నిలబెట్టుకున్నాడు" అంటూ చెప్పుకొచ్చారు రవితేజ మొత్తానికైతే ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు ఆయనను ఎంతలా మార్చేసాయో అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ.
రవితేజ తదుపరి చిత్రం విషయానికి వస్తే.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి #RT 76 అనే టైటిల్ తో సినిమా రూపొందిస్తున్నారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ ఉంటాయని ఇటీవలే మేకర్స్ స్పష్టం చేశారు. ఇక సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
