మాస్ జాతర.. కాప్ పాత్రలో కొత్త ఎలిమెంట్ అదే
తాజాగా ఈ ప్రశ్నకు దర్శకుడు భాను భోగవరపు సమాధానం చెప్పారు. రవితేజను ఈ చిత్రంలో కాప్ పాత్రలో చూపిస్తున్నా కానీ అతడిలో మునుపెన్నడూ చూడని పోలీస్ కనిపిస్తాడని ధీమాను వ్యక్తం చేసారు.
By: Sivaji Kontham | 28 Oct 2025 9:56 PM ISTకాప్ డ్రామాలు కొత్తేమీ కాదు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. భారతీయ తెరపై అన్ని సినీపరిశ్రమల్లోను పోలీస్ కథలతో దర్శకులు చాలా ప్రయోగాలు చేసారు. సందీప్ రెడ్డి వంగా తదుపరి స్పిరిట్ లో ప్రభాస్ ని కాప్ పాత్రలోనే చూపించబోతున్నారు. అందువల్ల ఇప్పుడు ఎవరైనా కాప్ డ్రామా తెరకెక్కించాలంటే, పాత్ర చిత్రణ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఇంతకుముందులా ఎప్పుడూ చూపించే పోలీస్ నే మళ్లీ మళ్లీ తెరపై చూపిస్తామంటే జనం థియేటర్లకు వస్తారా? అన్నది సందేహమే. అందుకే మాస్ మహారాజా రవితేజను `మాస్ జతార`లో కాప్ పాత్రలో చూపిస్తున్నారనే టాక్ వచ్చినప్పుడు ఈ పాత్రలో కొత్తదనం ఏం ఉంటుంది? అనే ప్రశ్న ఎదురైంది.
తాజాగా ఈ ప్రశ్నకు దర్శకుడు భాను భోగవరపు సమాధానం చెప్పారు. రవితేజను ఈ చిత్రంలో కాప్ పాత్రలో చూపిస్తున్నా కానీ అతడిలో మునుపెన్నడూ చూడని పోలీస్ కనిపిస్తాడని ధీమాను వ్యక్తం చేసారు. రవితేజ ఈ చిత్రంలో `రైల్వే కాప్`గా కనిపిస్తాడు. వాస్తవానికి పోలీస్ కథను చూపించాలి అనుకున్నప్పుడే ఇప్పటివరకూ భారతీయ స్క్రీన్ పై రాని విధంగా, మునుపెన్నడూ చూడని కొత్త పోలీస్ ని చూపించాలనుకున్నాను. దీనికోసం రైల్వే పోలీస్ పాత్రను ఎంచుకున్నాను. కొందరు రైల్వే పోలీసులను కలిసి వారు ఎలా ఉంటారో తెలుసుకున్నాను అని దర్శకుడు తెలిపారు.
రవితేజ ఇప్పటికే మాస్ పోలీసుగా నిరూపించారు. కానీ నేను అతడి పాత్రకు కొత్త కోణాన్ని జోడించాలనుకున్నాను. దానికోసం `రైల్వే కాప్` పాత్రను ఎంచుకున్నాను`` అని తెలిపారు. దీనిని ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు! అని కూడా అన్నారు. అంతేకాదు కాప్ విధులను వేరే కోణం నుంచి చూపిస్తుండడం కొత్తగా ఉంటుంది. రైల్వే పోలీసుల ఆధారంగా చక్కని స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి, దానికి వాణిజ్యపరమైన మలుపు ఇచ్చామని కూడా వెల్లడించారు.
రవితేజ - శ్రీలీల జంట కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్‌లో చిరంజీవి - విజయశాంతి జోడీని గుర్తు చేస్తారని దర్శకుడు భాను తెలిపారు. అక్టోబర్ 31 సాయంత్రం నుండి థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. గ్యాంగ్ లీడర్‌తో రవితేజ పోలిక సరే కానీ, థియేటర్లలోకి మాస్ రాజా రాకకోసం వేచి చూస్తున్న ప్రేక్షకులు నిరాశపరచకుండా ఏం చూపిస్తారో కాస్త ఆగి చూడాలి.
