రవితేజతో ఆ డైరెక్టర్ ప్రయోగం చేస్తున్నాడా?
మాస్ మహారాజ రవితేజ నుంచి రీసెంట్ గా మాస్ జాతర అనే సినిమా రాగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 16 Nov 2025 4:00 PM ISTమాస్ మహారాజ రవితేజ నుంచి రీసెంట్ గా మాస్ జాతర అనే సినిమా రాగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మూవీలో మాస్ కంటెంట్ ఉన్నప్పటికీ రొటీన్ స్టోరీ అవడంతో ఆడియన్స్ మాస్ జాతరను చూడ్డానికి ఆసక్తి చూపించలేదు. అయితే సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా రవితేజ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తారనే సంగతి తెలిసిందే.
సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ..
మాస్ జాతర సెట్స్ పై ఉన్నప్పుడే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసి దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన రవితేజ, ఆ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ మహారాజా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి కసితో ఉన్నారు. కాగా రవితేజ ఈ మూవీ తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
శివ నిర్వాణతో రవితేజ మూవీ
భర్త మహాశయులకు విజ్ఞప్తి తర్వాత రవితేజ నెక్ట్స్ మూవీని శివ నిర్వాణతో చేయనున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా శివ నిర్వాణ చెప్పిన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మాస్ మహారాజాకు బాగా నచ్చిందని, అందుకే వెంటనే ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాకైపోయిందని, నవంబర్ ఎండింగ్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవనుందని అంటున్నారు.
అయితే శివ నిర్వాణకు క్లాసిక్ కథల డైరెక్టర్ గా ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. నిన్ను కోరి, మజిలీ, ఖుషీ లాంటి లవ్ స్టోరీలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శివ నిర్వాణ గతంలో నానితో టక్ జగదీష్ మూవీతో డిఫరెంట్ గా ట్రై చేసినా ఫలితం లేకపోయింది. అలాంటి శివ నిర్వాణ ఇప్పటివరకు టచ్ చేయని క్రైమ్ థ్రిల్లర్ తో రవితేజతో ప్రయోగం చేయబోతున్నారు. మరి ఈ ప్రయత్నమైనా శివ నిర్వాణకు కలిసొచ్చి, రవితేజకు సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.
