చెప్పే ధైర్యం లేక..భారం మోయలేక పరిశ్రమకు దూరంగా!
ముఖ్యంగా బాలనటులు ఎదుర్కొనే మానసిక ..శారీరక వేధింపులకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుండి అప్పుడప్పుడు దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటకు వస్తుంటాయి.
By: Srikanth Kontham | 26 Aug 2026 3:00 AM ISTపరిశ్రమలో వెలుగుల వెనుక దాగివున్న చీకటి కోణాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ముఖ్యంగా బాలనటులు ఎదుర్కొనే మానసిక ..శారీరక వేధింపులకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుండి అప్పుడప్పుడు దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటకు వస్తుంటాయి. తాజాగా ప్రముఖ మాజీ బాలనటుడు రవి వాలేచా చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే తాను చిత్ర పరిశ్రమలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని బహిరంగంగా వెల్లడించారు.
దిగ్గజ దర్శకుడు శేఖర్ కపూర్ రూపొందించిన `మాసూమ్` (1983) చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రవి వాలేచా ఆ తర్వాతి కాలంలో సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరిశ్రమలో అప్పట్లో కొందరు వ్యక్తుల ప్రవర్తన అత్యంత హేయంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలో తనపై జరిగిన వేధింపుల గురించి ఇంట్లో చెప్పే ధైర్యం లేక, ఆ భారాన్ని గుండెల్లోనే దాచుకుని ఎంతగానో కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అనుభవాలు బాల్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు.
అలాంటి సున్నితమైన వయసులో ఎదురైన చేదు జ్ఞాపకాలు తన మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయని రవి వాలేచా వెల్లడించారు. నటనపై ఆసక్తి ఉన్నా? మరోవైపు పరిశ్రమలోని వాతావరణం తనకు తీవ్ర భయాన్ని కలిగించిందన్నారు. ఆ భయం .. అభద్రతాభావం కారణంగానే తాను పూర్తిస్థాయిలో నటుడిగా కొనసాగలేకపోయానని క్రమంగా సినిమా రంగానికి పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చిందని వివరించారు.
ఇండస్ట్రీలో ప్రవేశించే ప్రతి చిన్నారికి సురక్షితమైన ..రక్షణతో కూడిన వాతావరణం కల్పించడం ఎంతైనా అవసరమని అభిప్రాయపడ్డారు. పెద్ద నటీనటుల రక్షణే కాకుండా తెర వెనుక నలిగిపోయే బాలనటుల భద్రత కోసం చిత్ర నిర్మాణ సంస్థలు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని పిలుపునిచ్చారు. అప్పట్లో చిన్నపిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చే వ్యవస్థ లేకపోవడం వల్ల తాము ఎంతో మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నామని గుర్తు చేసుకున్నారు.
నేటి కాలంలో సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటికీ పరిశ్రమలోని ఇంకా అనేక చీకటి కోణాలు బయటకు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రవి వాలేచా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి బాలనటుల హక్కులు .. రక్షణ అంశాలపై చర్చకు దారితీస్తున్నాయి. ఒక మాజీ బాలనటుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మౌనాన్ని వీడి జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా బయటపెట్టడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఉదంతం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. చలనచిత్ర రంగానికి చెందిన నైతికతను ప్రశ్నించే అంశంగా మారింది. భవిష్యత్తులో చిన్నపిల్లలు ఎలాంటి వేధింపులకు గురికాకుండా చిత్ర పరిశ్రమ కఠినమైన మార్గదర్శకాలను పాటించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
