Begin typing your search above and press return to search.

రాజాతో ఆత్రేయ: హారర్ జోనర్‌లో సరికొత్త బెంచ్‌మార్క్!

తెలుగు తెరపై తనదైన ఎనర్జీతో మాస్ రాజాగా ముద్ర వేసుకున్న రవితేజ రేర్ గా ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన జోనర్లలో ప్రయోగాలు చేస్తుంటారు.

By:  Srikanth Kontham   |   8 Oct 2026 9:11 AM IST
రాజాతో ఆత్రేయ: హారర్ జోనర్‌లో సరికొత్త బెంచ్‌మార్క్!
X

తెలుగు తెరపై తనదైన ఎనర్జీతో మాస్ రాజాగా ముద్ర వేసుకున్న రవితేజ రేర్ గా ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన జోనర్లలో ప్రయోగాలు చేస్తుంటారు. కమర్షియల్ మాస్ చిత్రాలతో పాటు కొత్తదనం ఉన్న కథలను ఎంచుకునే రాజా ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ ఓ సరికొత్త హారర్ థ్రిల్లర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇది ఎలాంటి హార‌ర్ థ్రిల్ల‌ర్ అనే చ‌ర్చ మొద‌లైంది.

ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. దెయ్యాలు, ఆత్మలు, పాత బంగ్లాలు, ప్రతీకారాలు వంటి రొటీన్ ఫార్ములాతో చాలా కథలు తెరకెక్కాయి. ఈ నేపధ్యంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఏ దర్శకుడికైనా సవాల్‌తో కూడుకున్న పనే. అయితే వివేక్ ఆత్రేయ తన సినిమాల్లో ఎప్పుడూ యూనిక్ నేపధ్యం, సరికొత్త పాయింట్‌ను ఎంచుకుంటారు. ఈసారీ హారర్ జోనర్‌కు తనదైన సైకలాజికల్ లేదా ఇన్వెస్టిగేటివ్ టచ్ ఇచ్చి, రొటీన్ చిత్రాలకు భిన్నంగా కథను మలచబోతున్నారనే చర్చ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

వివేక్ ఆత్రేయ బలమంతా ఆయన రాసే స్క్రీన్ ప్లే పైనే ఆధారపడి ఉంటుంది. ఆయన సినిమాలలో కథనం వేగంగా, బోర్ కొట్టించకుండా పరుగులు పెడుతుంది. పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు, అనుకోని మలుపులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చోబెడతాయి. తాజాగా రవితేజ లాంటి హై-ఎనర్జీ హీరో కోసం ఆయన రాస్తున్న హారర్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే ఏ రేంజ్‌లో ఉంటుందో? చెప్పనవసరం లేదు. కామెడీ, ఎమోషన్స్‌తో పాటు హారర్ థ్రిల్‌ను సమపాళ్లలో మిక్స్ చేసేలా స్క్రీన్ ప్లేను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రవితేజ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుది అన్న ఆస‌క్తి నెల‌కొంది. ఇప్పటివరకు ర‌వితేజ‌ చేసిన మాస్, యాక్షన్ పాత్రలకు ఇది పూర్తిగా భిన్నంగా సాగుతుంది. హారర్ నేపధ్యంలో సాగే కథలో రవితేజ పాత్రలో ఇంటెన్సిటీ, సస్పెన్స్‌ను ఛేదించే తీరు సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. వివేక్ ఆత్రేయ టేకింగ్ స్టైల్, రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ కలిసి తెరపై ఓ విజువల్ వండర్‌ను సృష్టిస్తాయని అభిమానులు నమ్ముతున్నారు.

సాధారణంగా హారర్ చిత్రాలంటే భయపెట్టే సన్నివేశాలే కాకుండా దాని వెనుక బలమైన భావోద్వేగం ..బలమైన కారణం ఉండాలి. వివేక్ ఆత్రేయ ప్రతి చిత్రంలోనూ ఎమోషనల్ కనెక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ హారర్ థ్రిల్లర్‌లో కూడా కేవ‌లం దెయ్యాల భయమే కాకుండా మానసిక అంశాలను ముడిపెడుతూ వినూత్నమైన పాయింట్‌ను టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రేక్షకులకు ఓ కొత్త సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడం ఖాయం.

మొత్తంగా చూస్తే మాస్ రాజా రవితేజ - వివేక్ ఆత్రేయల క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపడం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు. రొటీన్ కమర్షియల్ జోనర్‌కు భిన్నంగా వస్తున్న హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ ప్రయత్నం విజయవంతమైతే రవితేజ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడంలో ఎలాంటి సందేహం లేదు.