రవితేజ నాన్ స్టాప్ స్పీడ్.. ఇదే ప్లాన్ ఫాలో అయితే..
ఒక సినిమా హిట్ అయ్యిందా.. ఫ్లాప్ అయ్యిందా అనే లెక్కల్లో ఎక్కువగా పడకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లే హీరోల్లో ముందుంటారు మాస్ మహారాజా రవితేజ.
By: M Prashanth | 26 Jun 2026 7:00 PM ISTఒక సినిమా హిట్ అయ్యిందా.. ఫ్లాప్ అయ్యిందా అనే లెక్కల్లో ఎక్కువగా పడకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లే హీరోల్లో ముందుంటారు మాస్ మహారాజా రవితేజ. రిజల్ట్స్ ఎలా ఉన్నా తన స్పీడ్ ను మాత్రం ఎప్పుడూ తగ్గించరు. అదే ఇప్పుడు ఆయన కెరీర్ లో మరోసారి కనిపిస్తోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూడు, నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం రవితేజ దర్శకుడు శివ నిర్వాణతో ఇరుముడి చిత్రం చేస్తున్నారు. తండ్రీకూతుళ్ల రిలేషన్ ప్రధానంగా సాగే ఆ సినిమా ఎమోషన్స్ కు పెద్దపీట వేస్తుందని సమాచారం. ఆ చిత్రంతో రవితేజ మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ సినిమా పూర్తికాకముందే రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం విశేషం.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కొత్త కథలు, కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. అదే ఆ ప్రాజెక్ట్ లోనూ కనిపిస్తోందని అంటున్నారు. అంతేకాదు, వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా రవితేజతో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎంటర్టైన్మెంట్ తోపాటు ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసే కథలు చెప్పడంలో వివేక్ ఆత్రేయకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే రవితేజను కొత్త తరహా పాత్రలో చూసే అవకాశం ఉంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు మరోవైపు తమిళ దర్శకుడు హరి పేరు కూడా రవితేజ లైనప్‌లో వినిపిస్తోంది. మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో సినిమాలు తెరకెక్కించే హరి.. రవితేజ కోసం ఓ పవర్ ఫుల్ కథ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా దర్శకుడు మారుతి కూడా రవితేజకు కథ వినిపించినట్లు సమాచారం. ఇటీవల పలు హీరోలతో చర్చలు జరిగినా ప్రాజెక్ట్ లు ముందుకు సాగకపోవడంతో ఆ కథ ఇప్పుడు రవితేజ వద్దకు వచ్చినట్లు వినికిడి. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలా చూస్తే రవితేజ ప్రస్తుతం ఒకే తరహా దర్శకులతో కాకుండా విభిన్న శైలిలో సినిమాలు తీసే దర్శకులను ఎంపిక చేసుకుంటున్నారు.
అయితే రవితేజ వరుసగా సినిమాలు అంగీకరించడం వెనుక మరో కారణం ఉందని చర్చ జరుగుతోంది. భారీ పారితోషికం కంటే లాభాల్లో వాటా తీసుకునే విధానానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు కొత్త దర్శకులు కూడా ఆయనతో పని చేయడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా రవితేజ ప్లాన్ క్లియర్ గా కనిపిస్తోంది. అవకాశాలు వచ్చినప్పుడల్లా సినిమాలు చేయడం, విభిన్న దర్శకులతో చేతులు కలపడం, కొత్త కథలకు ప్రాధాన్యం ఇవ్వడం.. ఆ ప్లాన్ కు మంచి విజయాలు తోడైతే.. మాస్ మహారాజా మార్కెట్ మళ్ళీ పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
