Begin typing your search above and press return to search.

రవితేజ తులాభారం.. ఆరంభంలోనే క్రేజీ క్రేజీగా..

ఇటీవలే ఇరుముడి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్న రవితేజ, ఇప్పుడు తన లైనప్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకున్నాడు.

By:  M Prashanth   |   11 Oct 2026 11:58 AM IST
రవితేజ తులాభారం.. ఆరంభంలోనే క్రేజీ క్రేజీగా..
X

ఇటీవలే ఇరుముడి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్న రవితేజ, ఇప్పుడు తన లైనప్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ కోసం మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ డాక్యుమెంటరీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తోంది.

రెగ్యులర్ గా ఒక పోస్టర్ వదిలేసి టైటిల్ చెప్పేయకుండా, వివేక్ ఆత్రేయ తన స్టైల్ లో ఒక క్రియేటివ్ వీడియోను డిజైన్ చేశాడు. ఈ డాక్యుమెంటరీలో సినిమాలో నటించే ప్రధాన తారాగణం అంతా కూర్చుని టైటిల్ ఏది పెడితే బాగుంటుంది అని చర్చించుకోవడం చాలా కొత్తగా అనిపిస్తుంది. రాజనీతి, పద్మవ్యూహం లాంటి పేర్లు అనుకుని ఫైనల్ గా తులాభారం అనే టైటిల్ ను లాక్ చేసిన విధానం ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని పెంచుతోంది.

ఈ అనౌన్స్ మెంట్ లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం రవితేజ ఇమేజ్ మేకోవర్. దశాబ్దాలుగా మాస్ మహారాజాగా అభిమానులను అలరిస్తున్న అతన్ని, ఇందులో క్రైమ్ మహారాజాగా పరిచయం చేయడం ఒక ఆసక్తికరమైన ప్రయోగం. వీడియోలో కుర్చీలో కూర్చుని రవితేజ కనిపించిన స్టైలిష్ లుక్ చూస్తుంటే, వివేక్ ఆత్రేయ మార్క్ డార్క్ కామెడీతో కూడిన ఒక పక్కా క్రైమ్ డ్రామా చూడబోతున్నామని అర్థమవుతోంది.

ఈ క్రైమ్ డ్రామాకు తగ్గట్టుగానే క్యాస్టింగ్ కూడా చాలా బలంగా కనిపిస్తోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్, అనశ్వర రాజన్ లాంటి వాళ్లను కీలక పాత్రల కోసం ఎంచుకున్నారు. వీడియోలో వీళ్లందరినీ పరిచయం చేసిన తీరు చూస్తే, కథలో ప్రతి క్యారెక్టర్ కు ఒక ప్రాధాన్యత ఉంటుందని, కేవలం హీరో చుట్టూ మాత్రమే తిరిగే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని తెలుస్తోంది.

ఇక ఇలాంటి క్వీర్కీ క్రైమ్ కామెడీలకు వివేక్ సాగర్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. లక్ష్మణ్, శ్రీనివాసరావు భారీ నిర్మాణ విలువల మధ్య ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. 2026 బాక్సాఫీస్ రేసులో ఇలాంటి ఒక డిఫరెంట్ జానర్ సినిమా రావడం ట్రేడ్ వర్గాలకు కూడా కొంత ఆసక్తిని కలిగించే విషయమే. బడ్జెట్ రికవరీ విషయంలో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు సాధారణంగా సేఫ్ జోన్ లో ఉంటాయి.

ఎప్పుడూ ఒకే తరహా మాస్ ఎంటర్టైనర్స్ తో వచ్చే రవితేజ, ఇరుముడి లాంటి కమర్షియల్ హిట్ తర్వాత ఇలాంటి ప్రయోగానికి ఓకే చెప్పడం మంచి విషయం. దర్శకుడి ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈ క్రైమ్ మహారాజా పాత్రను పర్ఫెక్ట్ గా పండిస్తే మాత్రం, తులాభారం కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఒక సాలిడ్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. మరి ఈ ఫ్రెష్ కాంబినేషన్ థియేటర్లలో ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలి.