రవితేజ ఆ ట్యాగ్ కి దూరంగానా?
ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 11 Nov 2025 3:17 PM ISTమాస్ రాజా రవితేజకు కొంత కాలంగా సరైన సక్సెస్ పడని సంగతి తెలిసిందే. ఇబ్బడి ముబ్బడి సినిమాలైతే చేస్తున్నాడు గానీ, వాటి ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశనే మిగులుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన మాస్ సినిమాలేవి సక్సెస్ అవ్వలేదు. ఇటీవల రిలీజ్ అయిన `మాస్ జాతర` కూడా బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహ పరిచింది. రాజా సక్సెస్ అనే వాసన చూసి మూడేళ్లు అవుతుంది. ఈనేపథ్యంలో రవితేజ సంచలన నిర్ణయం తీసుకున్నాడా? అంటే అవుననే సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది.
కిషోర్ మార్క్ చిత్రమనేనా?
ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ ని బట్టి ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. రవితేజ మార్క్ కామెడీ ఎక్కడా మిస్ అవ్వకుండా కిషోర్ శైలిలో చిత్రం ఉండబోతుంది. కిషోర్ గత చిత్రాలన్నీ సెన్సిటివ్ గా ఉంటాయి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఆయన కథలుంటాయి. ఆయన గత సినిమా `ఆడవాళ్లు మీకు జోహార్లు` అంటూ ఫ్యామిలీ సినిమాతో అలరించారు. ఈ నేపథ్యంలో `భర్త మహాశయులు` టైటిల్ చూస్తుంటే? భార్యాభర్తల కథని ఎంటర్ టైనింగ్ వేలో చెప్పబోతున్నట్లు కనిపిస్తోంది.
మాస్ ట్యాగ్ వద్దనేసాడా?
ఆ కథకు రవితేజ శైలి హాస్యాన్ని జోడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది . ఈ నేపథ్యంలో రవితేజ టైటిల్ కార్స్డ్ లో `మాస్ మహారాజ్` అనే ట్యాగ్ ని వేయోద్దని చెప్పారుట. ముందుగా సినిమా టైటిల్ వేసి..ఆపై రవితేజ అంటూ వేసి టైటిల్స్ ను కొనసాగించాల్సిందిగా కోరాడుట. మరి ఈ నిర్ణయం కేవలం ఈ సినిమా వరకేనా? లేక తదుపరి సినిమాల విషయంలో కూడా ఇదే కొనసాగిస్తారా? అన్నది చూడాలి. తాను చేసిన మాస్ సినిమాలు హిట్ అవ్వకపోవడం కారణంగా కూడా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్నది మరికొంత మంది భావిస్తున్నారు.
రామ్ చరణ్ సైతం అలా:
మరి ఈ ప్రచారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది. `ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియా విజయం తర్వాత రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` టైటిల్ కార్స్డ్ లో గ్లోబల్ స్టార్ గా వేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకూ మెగా పవర్ స్టార్ గా టైటిల్ కార్స్డ్ లో పడేది. `ఆర్ ఆర్ ఆర్` తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ `గేమ్ ఛేంజర్` ప్లాప్ అయిన నేపథ్యంలో `పెద్ది`కి అదే ట్యాగ్ ని కొనసాగిస్తాడా? లేదా? అన్న సందేహం చాలా మందిలో ఉండనే ఉంది.
