Begin typing your search above and press return to search.

సోదరుడి కొడుక్కి మాస్ మహారాజా ఆశీస్సులు.. ఊరి మూలాల‌తో ర‌స్టిక్ మూవీ చేశావంటూ..!

ఇక తన సోదరుడి కొడుకు.. చిత్ర కథానాయకుడు మాధవ్ గురించి మాట్లాడుతూ రవితేజ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

By:  Sivaji Kontham   |   6 Sept 2026 12:11 PM IST
సోదరుడి కొడుక్కి మాస్ మహారాజా ఆశీస్సులు.. ఊరి మూలాల‌తో ర‌స్టిక్ మూవీ చేశావంటూ..!
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన సోదరుడు రఘు రాజు కుమారుడైన మాధవ్ భూపతిరాజు కథానాయకుడిగా పరిచయమవుతున్న `మారెమ్మ` చిత్రానికి త‌న పూర్తి మద్దతునిస్తున్నారు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రవితేజ యంగ్ టీమ్‌ని అభినందిస్తూ.. తన సోదరుడి కొడుకు మాధవ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు. వేదికపై రవితేజ మాట్లాడిన మాటలు, చూపించిన ఆప్యాయత అభిమానులతో పాటు సినీ వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. `మారెమ్మ` సినిమాను తాను గత నెలలోనే చూశానని.. ఈ చిత్రం అత్యంత `రూటెడ్ అండ్ రస్టిక్`గా రూపుదిద్దుకుందని ప్రశంసించారు. తెలంగాణలోని మహేశ్వరం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపారు. ఒక సాధారణ కుర్రాడికి- బర్రెకి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని.. కథాంశం ఎంతో సహజంగా ఉండి తనను ఎంతగానో ఆకట్టుకుందని ర‌వితేజ‌ పేర్కొన్నారు.

సాంకేతిక నిపుణులను, తోటి నటీనటులను రవితేజ ప్రత్యేకంగా అభినందించారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయని అన్నారు. డీఓపీ ప్రశాంత్, ఫైట్ మాస్టర్ నటరాజ్, `హనుమాన్` ఫేమ్ ఎడిటర్ సాయిబాబుల పనితనాన్ని కొనియాడారు. తమిళ నటి అయి ఉండి కూడా తెలంగాణ యాస నేర్చుకుని అద్భుతంగా నటించిన హీరోయిన్ దీపను.. అలాగే నటుడు వికాస్ పెర్ఫార్మెన్స్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. తొలి సినిమానే అయినా ఇంత మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకుని తెరకెక్కించిన దర్శకుడు నాగరాజును అభినందిస్తూ.. నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకున్నారు.

ఇక తన సోదరుడి కొడుకు.. చిత్ర కథానాయకుడు మాధవ్ గురించి మాట్లాడుతూ రవితేజ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ``తమ్ముడు మాధవ్.. బాగున్నావు రా! మంచి ఒడ్డు పొడుగు.. గడ్డం.. నీ మేకోవర్.. ట్రాన్స్‌ఫార్మేషన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. వేదికపై కూడా బాగా మాట్లాడుతున్నావ్.. అలవాటైనట్లే ఉంది`` అని సరదాగా వ్యాఖ్యానిస్తూ అతనికి మంచి ఫ్యూచర్ ఉండాలని ఆశీర్వదించారు. పెద తండ్రి స్థానంలో ఉండి మాధవ్‌కు అందించిన ఈ ఆశీస్సులు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

సరికొత్త కథాంశంతో.. యువ ప్రతిభతో రూపుదిద్దుకున్న `మారెమ్మ` చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ టాలెంట్ అంతా కలిసి కష్టపడి చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించి...పెద్ద సక్సెస్ చేయాలని మాస్ మహారాజా రవితేజ పిలుపునిచ్చారు. ఈ వేడుకతో చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడటమే కాకుండా... మాధవ్ సినీ ప్రయాణానికి బలమైన పునాది పడిందని సినీ ప్రియులు భావిస్తున్నారు.

`మారెమ్మ` ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న చిత్రయూనిట్ - కాస్టింగ్ విషయానికి వస్తే.. మాస్ మహారాజా రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతుండగా.. అత‌డి మేకోవర్ - నటనపై ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో తమిళ నటి దీప కథానాయికగా నటించగా.. ఆమె తెలంగాణ యాసను నేర్చుకుని మరీ ఎంతో సహజంగా నటించారని వేదికపై ప్రశంసించారు. అలాగే `ముఖచిత్రం` ఫేమ్ వికాస్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించగా.. అత‌డి పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నూతన దర్శకుడు నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం, ప్రశాంత్ డీఓపీ, `హనుమాన్` ఫేమ్ సాయిబాబు ఎడిటింగ్ .. నటరాజ్ ఫైట్స్ అందించగా, మయూరా రెడ్డి - కుశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.