నీ బయోపిక్ నేనే తీస్తా.. రవితేజతో తెర వెనుక నిజాలు చెప్పిన సిద్ధూ!
అంతేకాదు ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఒకరికొకరు తమ సినిమాలను ప్రమోషన్స్ చేసుకోవడమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడం జరిగింది.
By: Madhu Reddy | 12 Oct 2025 9:37 AM ISTఈ మధ్యకాలంలో చిత్ర బృందాలు ప్రమోషన్స్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ సినిమాను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. కొంతమంది పబ్లిక్ లో స్టంట్ లు చేసి సినిమాపై అంచనాలు పెంచితే.. మరికొంతమంది ఈ - కామర్స్ వెబ్సైట్లో డెలివరీ బాక్స్ లపై తమ సినిమా పోస్టర్లను అతికించి మరీ ప్రమోషన్స్ చేశారు. ఇంకొంతమంది పలు షోలకు హాజరై తమ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే అబ్బో.. ఒక్కటేమిటి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఎలాగైనా సరే తమ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లి.. థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఇద్దరు హీరోలు చేసిన ప్రమోషన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఒక సినిమా విడుదలవుతోంది అంటే ఆయా చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్లు ,చిత్ర బృందాలు మాత్రమే ప్రమోషన్స్ మొదలుపెడతాయి. కానీ ఇప్పుడు దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న చిత్రాలకు సంబంధించిన హీరోలు ఉమ్మడిగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అసలే పక్కోడి సినిమా హిట్ అవ్వకూడదు.. మా సినిమా హిట్ అవ్వాలి అని కోరుకునే రోజుల్లో కూడా ఇలా ఉమ్మడిగా ప్రమోషన్స్ చేయడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా, రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తెలుసు కదా' . దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. మరొకవైపు అక్టోబర్ 31న రవితేజ, శ్రీ లీలా కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'మాస్ జాతర'. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో 'ధమాకా' సినిమా వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా కూడా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అటు సిద్దు జొన్నలగడ్డ ఇటు రవితేజ విడివిడిగా ప్రమోషన్స్ చేపట్టకుండా ఉమ్మడిగా ప్రమోషన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అంతేకాదు ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఒకరికొకరు తమ సినిమాలను ప్రమోషన్స్ చేసుకోవడమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే సిద్దు జొన్నలగడ్డ తన అభిప్రాయాన్ని రవితేజతో చెప్పి ఆయనని ఆశ్చర్యపరిచారు.విషయం విన్న రవితేజ అభిమానుల ఆనందానికైతే అవధులు లేవనే చెప్పాలి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్వ్యూలో భాగంగా సిద్దు మాట్లాడుతూ.. "కృష్ణ అండ్ హిస్ లీల విడుదలైన తర్వాత నీ బయోపిక్ తీయాలని అనుకున్నాను. దాదాపు రెండు నెలలు దానికోసం పనిచేశాను" అంటూ సిద్దు చెప్పగా.. రవితేజ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏంటి నిజమా? అని ప్రశ్నించగా.. అవును సీరియస్ గానే చెబుతున్నాను అంటూ తెలిపారు. భవిష్యత్తులో కచ్చితంగా నీ బయోపిక్ నేనే తీస్తాను అంటూ కూడా తెలిపారు.
దీనికి రవితేజ స్పందిస్తూ.. నేను కూడా ఒక బయోపిక్ తీయాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ ప్రస్తుతానికి ఆ వివరాలు గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను." అని తెలిపారు. అలాగే బయోపిక్ గురించి మాట్లాడుతూ.. బయోపిక్ లో ఒక వ్యక్తిని సానుకూల లేదా ప్రతికూల వైపు చూపించాలనే తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఒక బయోపిక్ ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని అన్వేషించాలి అంటూ స్పష్టం చేశారు. మొత్తానికి అయితే రవితేజ బయోపిక్ తీయాలని సిద్దు ఆలోచన.. అటు రవితేజ కూడా ఇంకొకరి బయోపిక్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
