Begin typing your search above and press return to search.

రవితేజ.. ఇక నెక్స్ట్ ఇలా ఉండదేమో..

మాస్ మహారాజా రవితేజకు ఈ మధ్య టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. ఆయన బలం, బలగం అయిన 'మాస్' జానరే ఆయనకు పెద్ద దెబ్బ కొడుతోంది.

By:  M Prashanth   |   6 Nov 2025 11:13 AM IST
రవితేజ.. ఇక నెక్స్ట్ ఇలా ఉండదేమో..
X

మాస్ మహారాజా రవితేజకు ఈ మధ్య టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. ఆయన బలం, బలగం అయిన 'మాస్' జానరే ఆయనకు పెద్ద దెబ్బ కొడుతోంది. పోలీస్ క్యారెక్టర్స్ తో ఇంతకుముందు మంచి సక్సెస్ అందుకున్నారు. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. రీసెంట్‌గా రిలీజైన 'మాస్ జాతర' సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది.

రొటీన్, అవుట్‌డేటెడ్ కంటెంట్‌తో వస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపించాయి. వరుస ఫ్లాపులతో ఆయన మార్కెట్ పూర్తిగా డల్ అయిపోయిందని, ఇక రవితేజ స్పీడుకు బ్రేకులు పడ్డాయనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ, రవితేజ మాత్రం తన స్పీడ్ ఎక్కడా తగ్గించడం లేదు. ఫ్లాపులతో సంబంధం లేకుండా, ఆయన వరుసగా సినిమాలు సైన్ చేసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే ఆయన చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. లైనప్‌ను లోతుగా చూస్తే, అసలు స్ట్రాటజీ ఇప్పుడు అర్థమవుతోంది. ఇలాంటి రొటీన్ సినిమాలు ఇంక ఉండవేమో అన్నట్లుగా తన రూట్ మార్చేశారు. ఆయన సైన్ చేస్తున్నవి రొటీన్ సినిమాలు కావు, అన్నీ జానర్లను మార్చి కొడుతున్నవే. ఇది సినిమా సినిమాకూ గ్యాప్ ఇవ్వడం కాదు, జానర్ జానర్‌కూ గ్యాప్ ఇచ్చే కొత్త ప్లాన్.

ప్రస్తుతం మాస్ రాజా చేతిలో ఉన్న 'RT76' సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది పక్కా 'ఫ్యామిలీ కామెడీ డ్రామా'. 'భర్తమహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్‌తో, 2026 సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ యాక్షన్ సినిమా కాదు. ఆ తర్వాత లైనప్ ఇంకా ఆసక్తికరంగా ఉంది. 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి క్లాస్ లవ్ స్టోరీలు తీసిన శివ నిర్వాణతో 'RT77' చేస్తున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, శివ నిర్వాణ కూడా తన జానర్ మార్చి, రవితేజతో ఒక 'థ్రిల్లర్' చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, రవితేజను కొత్త కోణంలో చూపించడం ఖాయం.

ఈ రెండు మాత్రమే కాదు, 'RT78' ఏకంగా ఒక 'సూపర్ హీరో డ్రామా'. 'MAD' ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు డైరెక్టర్. ఇక ఫైనల్‌గా, 'బింబిసార' లాంటి విజువల్ వండర్ ఇచ్చిన వశిష్టతో ఒక 'సైన్స్.ఫిక్షన్' డ్రామా కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ కథ మొదట రామ్ చరణ్ కోసం రాసుకున్నారట. అంటే, ఫ్యామిలీ, థ్రిల్లర్, సూపర్ హీరో, సైన్స్ ఫిక్షన్.. ఇలా రవితేజ లైనప్ మొత్తం కొత్త జానర్లతో నిండిపోయింది. ఫ్లాపులు వస్తున్నా, ఆయన ఖాళీగా కూర్చోలేదు, తనను తాను పూర్తిగా రీ ఇన్వెంట్ చేసుకునే పనిలో పడ్డాడని అర్థమవుతుంది.