కష్టపడి.. మొదటిసారి 150 కోట్లు కొట్టారు!
సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సోలో హీరోగా నిలబడటం అంత ఈజీ కాదు.
By: M Prashanth | 1 Oct 2026 9:15 AM ISTసినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సోలో హీరోగా నిలబడటం అంత ఈజీ కాదు. ఒక సినిమా హిట్ అయితే వెంటనే మరో అవకాశం వస్తుంది కానీ, రెండు మూడు ఫ్లాప్స్ పడితే అదే వేగంతో మార్కెట్ కూడా కిందకు వస్తుంది. ఇలాంటి ఎత్తుపల్లాలు చాలా చూసిన ఇద్దరు హీరోలు ఇప్పుడు తమ కెరీర్‌లో ఇప్పటివరకు అందని నంబర్ల దగ్గరకు చేరారు. ఒకరు రవితేజ అయితే, మరొకరు నాని.
రవితేజ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న చిన్న పాత్రలు, అసిస్టెంట్ డైరెక్షన్ పనుల నుంచి వచ్చి తర్వాత హీరోగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, విక్రమార్కుడు, ‘కిక్’ లాంటి సినిమాలతో ఒక టైమ్‌లో వరుస హిట్స్ ఇచ్చారు. కానీ తర్వాత ఫ్లాప్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఒకానొక దశలో “రవితేజ మార్కెట్ ఇంతే?” అనే కామెంట్స్ కూడా వచ్చాయి.
అలాంటి టైమ్‌లో ‘క్రాక్’, ‘ధమాకా’ లాంటి సినిమాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఇప్పుడు ‘ఇరుముడి’తో ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ అందుకోవడం ఆయన కెరీర్‌లోనే కొత్త రికార్డ్. ఇన్ని సంవత్సరాల కెరీర్ తర్వాత కూడా మొదటిసారి రూ.200 కోట్ల సినిమా రావడం చిన్న విషయం కాదు. పైగా ఈ నెంబర్ వచ్చిన టైమ్ కూడా రవితేజకు చాలా ముఖ్యమైనదే.
నాని కథ కూడా దాదాపు మరో రూట్‌లో అలానే ఉంది. క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత చిన్న సినిమాలతో హీరోగా వచ్చారు. ఒక్కో సినిమా, ఒక్కో దర్శకుడితో తన మార్కెట్ పెంచుకుంటూ వచ్చారు. భలే భలే మగాడివోయ్, జెర్సీ, దసరా, హాయ్ నాన్న, ‘సరిపోదా శనివారం’ ఇలా సక్సెస్‌లు వచ్చినా మధ్యలో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో నాని మొదటిసారి రూ.150 కోట్ల మార్క్ దాటారు. డివైడ్ టాక్ ఉన్నా ఓపెనింగ్స్ బలంగా రావడం, మొదటి వారం కలెక్షన్స్ నిలబడటం వల్ల ఈ నెంబర్ సాధ్యమైంది. ఇంతకుముందు నాని సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లినా, రూ.150 కోట్ల మార్క్ మాత్రం అందలేదు. ఆ గ్యాప్‌ను ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ఫిల్ చేసింది. హైలెట్ ఏంటంటే.. ఒకే ఏడాది చాలా తక్కువ టైమ్ లో ఈ ఇద్దరు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నారు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ట్స్ ఎలాంటి కంటెంట్ తో హిట్స్ కొడతారో చూడాలి.
