Begin typing your search above and press return to search.

రెండున్నర నెలల్లో రెండు.. రవితేజ హిట్ ట్రాక్ ఎక్కేస్తారా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   8 Sept 2025 1:42 PM IST
రెండున్నర నెలల్లో రెండు.. రవితేజ హిట్ ట్రాక్ ఎక్కేస్తారా?
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ గా ఓ సినిమా తర్వాత మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. పలు ప్రాజెక్టులను లైన్ లో కూడా పెడుతున్నారు. కానీ సరైన హిట్ కోసం మాత్రం కొంతకాలంగా మాత్రం వెయిట్ చేస్తూనే ఉన్నారు రవితేజ.

ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాల్లో నటించారు. కానీ అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయారు. ఇప్పుడు మాస్ జాతర మూవీతో మరికొద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడింది.

ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీన ఆ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. ధమాకా మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందనే అంచనా ఉన్నాయి. త్వరలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.

అయితే అక్టోబర్ 31న బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ తప్ప మిగతా ఏ సినిమా రిలీజ్ అవ్వడం లేదు. కాబట్టి టాక్ బాగుంటే మాస్ జాతర హిట్ గా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో రవితేజ ఇప్పుడు.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ ను జెట్ స్పీడ్ లో జరుపుతున్నారు మేకర్స్.

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. జనవరి 13న మూవీని విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే ఇప్పుడు అక్టోబర్ 31న ఓ మూవీ.. జనవరి 13న మరో మూవీతో రవితేజ రానున్నారన్నమాట. అంటే 75 రోజుల్లో రెండు సినిమాలు రానున్నాయి.

అయితే ఓ స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు.. రెండున్నర నెలల్లో విడుదలవ్వడమంటే మామూలు విషయం కాదు. అభిమానులకు మాత్రం పండుగే. అదే సమయంలో ఇప్పుడు మాస్ జాతర, కిషోర్ తిరుమల సినిమాలు మంచి విజయం సాధిస్తే మాత్రం.. రవితేజ హిట్ ట్రాక్ ఎక్కడం గ్యారంటీ. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.