Begin typing your search above and press return to search.

మాస్ జాతర.. ప్రీమియర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?

ఇక్కడే మరో కోణం ఆలోచించాలి. ఇప్పుడు ఆడియెన్స్ చాలా మారిపోయారు. ఇదివరకులా ప్రతీ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో పరుగులు పెట్టడం లేదు.

By:  M Prashanth   |   31 Oct 2025 4:30 PM IST
మాస్ జాతర.. ప్రీమియర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?
X

మాస్ మహారాజా రవితేజ సినిమాకు ఓపెనింగ్స్ రాకపోవడం అనేది ఊహించడానికి కష్టమైన విషయం. ఆయన ఎనర్జీకి, బ్రాండ్‌కు కచ్చితమైన ఫస్ట్ డే ఆడియెన్స్ ఉంటారు. ఇక ప్రీమియర్స్ అనగానే ఆ హడావుడి గట్టిగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సితార ఇదివరకే కొన్ని సినిమాలకి ప్రీమియర్స్ వేసి రిస్క్ చేసి సక్సెస్ అయ్యింది. అయితే ఈ సారి 'మాస్ జాతర' విషయంలో లెక్కలు పూర్తిగా తారుమారయ్యాని టాక్ వస్తోంది.

సినిమా ప్రీమియర్స్ కు చాలా అంతగా హై రేంజ్ వైబ్ కనిపించట్లేదని తెలుస్తోంది. ఇది కేవలం రవితేజ ఫ్యాన్స్‌కే కాదు, ట్రేడ్ వర్గాలకు కూడా పెద్ద షాక్ ఇచ్చింది. పరిస్థితి ఎంత నీరసంగా ఉందంటే, హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సాయంత్రం వేసిన మొదటి షో కూడా ఫుల్ అవ్వలేదు. చాలా థియేటర్లలో కనీస ఆక్యుపెన్సీ లేకపోవడంతో షోలు రద్దయ్యే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. యూఎస్‌లో సైతం బుకింగ్స్ దాదాపు లేవనే చెప్పాలి.

ఇక ఇందుకు కారణం ఎంటనే వివరాల్లోకి వెళితే.. చాలా మంది వేలెత్తి చూపుతున్న మొదటి కారణం 'బాహుబలి: ది ఎపిక్'. "నాలుగు గంటల పాటు 'బాహుబలి' ఎపిక్‌ను థియేటర్లలో చూసి ఆడియెన్స్ అలిసిపోయారు. వాళ్లకు వెంటనే మరో సినిమా చూసే ఎనర్జీ లేదు. అందుకే 'మాస్ జాతర'కు రాలేదు" అని కొందరు థియేటర్ ఓనర్లు చెబుతున్నారు. ఇది కొంతవరకు నిజమే అయినా, ఒక రీ రిలీజ్ సినిమా, ఒక స్టార్ హీరో కొత్త సినిమా ఓపెనింగ్స్‌ను ఇంతలా దెబ్బతీయడం సాధ్యమేనా అనే సందేహం రాకుండా ఉండదు.

ఇక్కడే మరో కోణం ఆలోచించాలి. ఇప్పుడు ఆడియెన్స్ చాలా మారిపోయారు. ఇదివరకులా ప్రతీ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో పరుగులు పెట్టడం లేదు. ఆడియెన్స్ ఇప్పుడు రెండు రకాలుగా విడిపోయారు. 'బాహుబలి', 'KGF', 'సలార్', 'కల్కి' లాంటి "ఈవెంట్ ఫిల్మ్స్"కు మాత్రమే ఫస్ట్ డే రష్ ఉంటుంది. మిగిలిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు, అవి ఎంత పెద్ద స్టార్ హీరోవి అయినా సరే, ఆడియెన్స్ "వెయిట్ అండ్ వాచ్" పాలసీ ఫాలో అవుతున్నారు.

'మాస్ జాతర' సరిగ్గా ఈ రెండో కేటగిరీలోకి వెళ్లిపోయింది. దీనికి కారణం, ట్రైలర్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. 'మాస్ జాతర' ట్రైలర్ లో రెగ్యులర్ కంటెంట్ తప్ప కొత్తగా లేదనే టాక్ ఎక్కువైంది. అది సినిమా చూడాలనే క్యూరియసిటీని పెద్దగా క్రియేట్ చేయలేకపోయింది. అందుకే ఆడియెన్స్, ముందు టాక్ చూసి, బాగుంటేనే వెళ్దాం అని డిసైడ్ అయ్యి ఉండవచ్చు.

ఏదేమైనా, 'మాస్ జాతర' భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా సినిమా కంటెంట్‌పైనే ఆధారపడి ఉంది. ఈ స్లో స్టార్ట్‌ను తట్టుకుని, సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ మౌత్ టాక్ వస్తే, తప్ప ఈ వెయిట్ అండ్ వాచ్ ఆడియెన్స్ థియేటర్లకు రారు. కాబట్టి రేపు గ్రాండ్ గా అన్ని ఏరియాల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి మాస్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.